కుండీల్లో కమ్మని ఆకుకూరలకు హాయ్.. చెబుదామా?
విషపు రసాయనాలు, రసాయనిక ఎరువులు, కలుషిత నీరు వాడకుండా ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచీ!.. కానీ ఇప్పుడలా పండిస్తున్నదెవరు? అయినా.. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామాల్లో అయినా ప్రకృతిసిద్ధంగా పెంచిన ఆహారం ఎక్కడ దొరుకుతాయిలెద్దూ.. అని నిరుత్సాహపడుతున్నారా? ఎక్కడి దాకో ఎందుకు చెప్పండి? ఆసక్తి ఉంటే మీరే.. మీ ఇంటిపట్టునే నిక్షేపంగా పండించుకోవచ్చు. ఇంటిపట్టున కాస్త ఖాళీ స్థలం ఉంటే సరేసరి. లేదంటే కుండీలు, మడుల్లో సులువుగానే ఇంటిపంటలు సాగు చేసుకోవచ్చు. ఉదయపు నీరెండలో ఇంటిపంటల పనులు చేస్తుంటే.. అలసిన మనసుకు ఎంత గొప్ప రిలీఫో కదండీ..? దీన్నే ‘హార్టీకల్చర్ థెరపీ’ అని నిపుణులు అభివర్ణిస్తున్నారు. కమ్మని ఆకుకూరలు, కూరగాయలకు ఇది బోనస్ అన్నమాట.
కంపోస్టు+కొబ్బరిపొట్టు+మట్టి,,
ఒకటి లేదా రెండు కుండీలతో ఆకుకూరల సాగు సరదాగా మొదలు పెట్టొచ్చు. ఆకుకూరలకు ఆరు అంగుళాల కన్నా లోతు మట్టి అవసరం లేదు. కుండీలు/ ట్రేలు/ మడుల్లో ఆకుకూరలను ఎంచక్కా పెంచుకోవచ్చు. కంపోస్టు (చివికిన పశువుల ఎరువు / వర్మీకంపోస్టు/ ఎండిన పేడ/ ఏదైనా ఇతర కంపోస్టు)+ కొబ్బరిపొట్టు సమపాళ్లలో కలిపి.. దానికి కొద్దిమొత్తంలో ఎర్రమట్టిని కలిపితే చాలు. కుండీలు, మడుల్లో ఆకుకూరలు, కూరగాయల సాగుకు మట్టి మిశ్రమం సిద్ధమైనట్లే. వేపపిండి ఉంటే కొంచెం కలిపితే ఇంకా మంచిది. కంపోస్టు టీ, వర్మీవాష్, జీవామృతం.. వంటివి వాడుకోవడం అవసరం.
కుండీ అడుగున బెజ్జం మీద కుండ పెంకులు లేదా రాళ్లతో కప్పండి(ఈ బెజ్జం పూడిపోకుండా ఉంటేనే.. అదనపు నీరు బయటకుపోతుంది. కుండీలో నీరు నిలబడితే మొక్కకు నష్టం). ఆ తర్వాత కుండీ అడుగున అంగుళం మందాన ఎండు ఆకులు వేసి.. పైన మట్టి మిశ్రమం పోయండి. మట్టి నింపిన రోజే విత్తనాలు చల్లకండి. నీరు పోస్తూ ఒకటి, రెండు రోజులు కుండీ సాగుకు సిద్ధమయ్యాక.. విత్తనాలు చల్లండి లేదా మొక్కలు నాటండి.
పది రోజుల్లో ముచ్చటైన బేబీ మెంతి కూర!
విత్తనాలు లేవా? పర్లేదు. పోపు డబ్బాలో మెంతులు ఉన్నాయి కదా? మెంతి కూర ఎంత ఆరోగ్యమో మీకు తెలుసు కదా! గుప్పెడు మెంతులు తీసుకొని కుండీలో చల్లండి. వాటిపైన పల్చగా మట్టి వేసి.. నెమ్మదిగా నీటిని చిలకరించండి. మొక్కలు మొలిచే వరకూ తడి ఆరకుండా చూడండి. మొలకలొచ్చే వరకు పైన ఎండు ఆకులు కప్పితే మరీ మంచిది. గుర్తుపెట్టుకోండి. కుండీలో/ట్రేలో మట్టి ఏకాలంలోనైనా తడీపొడిగా ఉండాలి. నీరు నిలవ కూడదు.. అంతే! పది రోజుల్లో ముచ్చటైన బేబీ మెంతి కూర పచ్చగా పలకరిస్తుంది! అప్పటికప్పుడు కత్తిరించి తాజాగా పప్పులో వేయండి. ఆహా.. ఈ మెంతి కూర పప్పు రుచే వేరండోయ్.. అని మీరే అంటారు!
మెంతికూర ఒక్కటేనా? పాలకూర, చుక్కకూర.. ఒకటేమిటి ఆకుకూరలేవైనా.. ఏ కాలంలోనైనా సాగు చేయొచ్చు. వంగ, టమాటా, బీర, బెండ, దొండ, ఆనప, దోస, కాకర.. ఇలాంటి కూరగాయలను సైతం ఇప్పుడు పెంచవచ్చు. డ్రిప్ సదుపాయం పెట్టుకుంటే నీటి వృథాతోపాటు శ్రమ కూడా తగ్గుతుంది.
- ‘ఇంటిపంట’ డెస్క్ , intipanta@sakshi.com