అన్వేషణం: షాక్‌కి గురిచేసే షాంఘై ఫుడ్ మార్కెట్! | Shopping in a Shanghai Food Market | Sakshi
Sakshi News home page

అన్వేషణం: షాక్‌కి గురిచేసే షాంఘై ఫుడ్ మార్కెట్!

Published Sun, Sep 15 2013 2:50 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

అన్వేషణం: షాక్‌కి గురిచేసే షాంఘై ఫుడ్ మార్కెట్!

అన్వేషణం: షాక్‌కి గురిచేసే షాంఘై ఫుడ్ మార్కెట్!

ఫుడ్ మార్కెట్లో ఏముంటాయి? రకరకాల కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, రొయ్యలు, ఇతరత్రా తినుబండారాలు... ఇవేగా! కానీ మీరింతవరకూ చూసి ఉండని ఓ విచ్రితమైన మార్కెట్ షాంఘైలో ఉంది. దాన్ని చూడటం సంగతి తర్వాత... దాని గురించి వింటేనే షాకయిపోతాం మనం!
 
 షాంఘైలోని గ్వాండాంగ్ ప్రావిన్స్‌లో ఉండే ఓ ఫుడ్ మార్కెట్ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ మార్కెట్లో ప్రపంచంలో ఎక్కడా చూడలేనంత నాన్‌వెజ్ దొరుకుతుంది. ఎవరూ తినలేనన్ని రకాల మాంసాలు అక్కడ ఉంటాయి. చేపలు, రొయ్యలు, పీతలు, చికెన్, మటన్ మామూలే. కానీ వాటితో పాటు మొసలి మాంసం, ఆక్టోపస్ మాంసం, స్టార్‌ఫిష్‌లు, తేళ్లు, జైలు, పాములు, ఎలుకలు, పురుగులు... దొరకని జీవి అంటూ ఏదీ ఉండదక్కడ. పచ్చివి, ఎండబెట్టినవి అంటూ వేరు చేసి మరీ అమ్ముతుంటారు. అంతేనా! తేళ్లతో చేసిన క్యాండీలు, ఫ్రూట్ పీసెస్ బదులు చిన్ని చిన్ని పురుగులను అద్దిన ఐస్‌క్రీములు, వేయించిన ఎలుకలు... అబ్బో, తినాలే గానీ బోలెడన్ని!
 
 మనకి వినడానికే వెగటుగా ఉంటుంది కానీ... షాంఘై వారికి ఆ మార్కెట్లో దొరికే ఐటెమ్స్ అంటే మహా ప్రీతి. ఎంత ఖరీదైనా పెట్టి వాటిని కొనేసుకుంటారు. ఏమాత్రం సంకోచం లేకుండా రకరకాల జీవుల్ని వండుకుని స్వాహా చేసేస్తుంటారు. వారికవి తినడం అలవాటు మరి! మీకేమైనా వాటి మీద ఇంటరెస్ట్ ఉంటే... ఎప్పుడైనా షాంఘై వెళ్లినప్పుడు చక్కగా టేస్ట్ చేసి రావచ్చు!
 
 ఆకాశంలో చందమామ ఎంత హుందాగా కనబడుతుందో... దుబాయ్‌లోని జుమేరియా బీచ్‌లో అంతకంటే ఠీవిగా కనిపిస్తుంది బుర్‌‌జ అల్ అరబ్ హోటల్. ప్రపంచంలోని అతి ఎత్తయిన హోటళ్లలో నాలుగో స్థానంలో ఉన్న ఈ స్టార్ హోటల్ అందాన్ని వర్ణించి లాభం లేదు.
 
 స్వయంగా చూడాల్సిందే!
 బుర్‌‌జ అల్ అరబ్ ఏర్పాటు కోసం ముందుగా సముద్రపు నీటిలో ఓ ఆర్టిఫీషియల్ దీవిని ఏర్పరిచారు. దాని మీద హోటల్‌ను నిర్మించారు. దీని ఆకారం చాలా విచిత్రంగా ఉంటుంది. అటు పూర్తిగా అర్థ చంద్రాకారంలో కాకుండా, ఇటు పూర్తి నిటారుగా కాకుండా... ఓ విచిత్రమైన ఆకృతిలో ఉంటుంది. ఓడల రాకపోకలకు ఆటకం కలుగకుండా, ఓడల కారణంగా హోటల్‌కి నష్టం వాటిల్లకుండా ఉండేలా నిర్మించేందుకే ఈ ఆకారాన్ని ఎంచుకున్నారు. మొదట్లో దీనిని దుబాయ్ చికాగో బీచ్ హోటల్ అనేవారు. కానీ 1997లో బుర్‌‌జ అల్ అరబ్‌గా పేరు మార్చారు. జుమేరియన్ గ్రూప్ వారిది కావడంతో దీనికి జుమేరియన్ బీచ్ హోటల్ అనే పేరు కూడా వచ్చింది. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో, విలాస వంతంగా ఉండే ఈ హోటల్లో విడిది చేస్తే స్వర్గంలో ఉన్నట్టేనంటారు సందర్శకులు!
 
 టామ్ రైట్, అట్కిన్‌‌స అనే ఇద్దరు ఆర్కిటెక్టులు కలిసి ఈ హోటల్‌కు రూపకల్పన చేశారు. కెనడాకు చెందిన ఇంజినీర్ రిక్ గ్రెగరీ 1994లో దీన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. 1999లో నిర్మాణం పూర్తయ్యింది. ఆ యేడు డిసెంబర్‌లో హోటల్‌ను తెరిచారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఇది లక్షలాది మందిని ఆకర్షించింది. దుబాయ్‌లో ప్రతిష్టాత్మకమైన, సుందరమైన నిర్మాణాలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది.
 
 ఈ హోటల్లో మొత్తం 202 సూట్స్ ఉన్నాయి. రాయల్ సూట్ పేరుతో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వీటిలో విడిది చేయాలంటే ఒక్క రాత్రికి 18,776 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, మన కరెన్సీలో దాదాపు 12లక్షల పైమాటే. మామూలు సూట్ కూడా తక్కువేమీ ఉండదు. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పదిహేను హోటళ్లలో ఒకటిగా పేర్కొంటారు. సామాన్యుడు ఇందులో అడుగు పెట్టడం కల్లే. అందుకే బడా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు మాత్రమే ఇందులోకి వెళుతుంటారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement