food markets
-
రెడీ టు కుక్ తిండికి రెడీ అయ్యారా? ‘బ్యాక్టీరియా, వైరస్‌లకు అవకాశం ఉంటుంది’
సాక్షి, అమరావతి: ఉరుకులు పరుగుల జీవన విధానం కారణంగా ఆహార సంస్కృతిలో భారీ మార్పులొస్తున్నాయి. పెద్దగా శ్రమపడకుండానే కోరుకున్న ఐటమ్స్‌ను వండుకునేందుకు వీలుగా ఉండే ‘రెడీ టు కుక్’ పదార్థాలకు డిమాండ్ పెరుగుతోంది. ఆహార నాణ్యత గురించి ఆందోళన చెందకుండా ఒక రూపాయి ఎక్కువైనా చెల్లించడానికి వెనుకాడట్లేదు. ఈ క్రమంలోనే చాలా ఆహార తయారీ కంపెనీలు వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా∙మెనూల్లోకి కొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. రెడీ టు కుక్ అంటే? ఈ విధానంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిని ఉడకబెట్టుకుని లేదా వేడి చేసుకుని తినేయాలి. వీటితో పాటు రెడీ టు కన్స్యూమ్ విధానంలో అప్పటికే తయారుచేసిన.. తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలూ ఉన్నాయి. చిన్నారులు, యువత, వృత్తిరీత్యా వేర్వేరుగా ఉండే దంపతులు ఈ తరహా ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నగ్గెట్స్, బ్రెడ్డెడ్ ఫింగర్స్, మీట్‌బాల్స్, సమోసాలు, చపాతీలు, కబాబ్‌లు, పఫ్స్, పాస్తా, శాకాహార, మాంసాహార పదార్థాలు ప్యాకింగ్, సెమీ కుక్డ్ విధానంలో మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాగే, పాలక్ పన్నీర్ నుంచి ఇడ్లీ సాంబార్ వరకు, బర్గర్ల నుంచి జాక్‌ఫ్రూట్ చికెన్ వరకు భారతీయుల రుచికి తగ్గట్టుగా రెడీ టు ఈట్ ఆహారం అందుబాటులోకి వచ్చింది. ఉడికించిన శనగలు, వేగన్ మీట్ ఇన్‌స్టంట్‌గా లభిస్తున్నాయి. ఇడ్లీ పిండి, దోశె పిండి, ఇంట్లో చేసుకోకుండా బయట కొనుగోలు చేస్తున్నారు. వీటి అమ్మకాలు ఇటీవల దాదాపు 20 శాతం పెరిగాయి. టిన్ ప్యాక్డ్ స్వీట్లు కూడా మార్కెట్‌ను పెంచుకున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో మిల్లెట్స్ ఫుడ్స్‌పై ఆసక్తి పెరగడం.. అవికూడా రెడీమేడ్ ఆహారంగా లభిస్తుండటం విశేషం. కంపెనీలు సైతం పర్యావరణానికి ఇబ్బందిలేకుండా బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌లో ఈ తరహా ఆహారాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తరహా ఫుడ్స్.. ఆహార వ్యర్థాలను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్ టు డిన్నర్! పట్టణీకరణ, ఆదాయ వృద్ధి, మధ్య తరగతి జీవనంలో మార్పులు కూడా ఇన్స్టంట్ కుక్కు ప్రాధాన్యత పెరగడానికి కారణం. ఎక్కువ సమయం తీసుకునే కూరగాయలను కోసే అవసరం లేకుండా వాటితో చేసే ప్యాకేజ్డ్ శాకాహార వంటకాల కోసం జనం ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో చాలామంది ప్రజలకు పోషకమైన భోజనం తయారు చేసుకోవడానికి సమయం ఉండట్లేదు. అందుకే దేశంలో ఐదేళ్లలో ఈ తరహా విధానం పెరుగుతోంది. రిటైల్ మార్కెట్లలో, సూపర్బజార్లలో, ఇతర స్టోర్లలో ఈ పదార్థాలు అందుబాటులో ఉంటున్నాయి. సమయాన్ని ఆదా చేసుకునేందుకు అల్పాహారం దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు ప్రజలు వీటిపైనే ఆధారపడుతున్నారు. 2026 నాటికి దేశంలో ఏడాదికి 18 శాతం పెరిగి.. రూ.8వేల కోట్ల వరకు మార్కెట్ విస్తరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంటి ఆహారమే మేలు ఇంట్లో తయారుచేసుకున్న తాజా ఆహారం తింటేనే ఆరోగ్యానికి మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవాలి. ప్యాకేజ్ ఫుడ్ నిల్వ ఉండేందుకు ఆయిల్, సాల్ట్ ఎక్కువగా వాడతారు. నాన్‌వెజ్ ఫుడ్‌ను ఎంత ఫ్రీజర్‌లో పెట్టినా నిల్వ ఉండటం మంచిదికాదు. ఒక్కోసారి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని తినడంవల్ల జీర్ణకోశ సమస్యలొస్తాయి. వెజిటబుల్ ప్యాక్డ్ ఫుడ్‌ను ప్యాక్‌చేసి ఎన్ని రోజులైంది అనేది చెక్ చేసుకోవాలి. – డాక్టర్ గర్రే హరిత, న్యూట్రీషియనిస్ట్, విజయవాడ -
భవిష్యత్తులో కొనుగోలు కేంద్రాలుగా ఆర్బీకేలు
సాక్షి, విజయవాడ: అర్హత ఉన్న ఏ రైతుకు కూడా అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసాలో పేర్ల నమోదుకు అర్హత ఉన్న రైతులు జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కష్టంగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ రైతు భరోసాను రెండో సంవత్సరం అందించామన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ పథకం ప్రారంభించగా.. ఈసారి 49 లక్షల మందికి పైగా రైతులకు లబ్ది చేకూరిందన్నారు. అన్ని గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల పేర్లు ఉంచుతున్నామని.. గత ప్రభుత్వం లాగా కేవలం సొంత పార్టీ వారికి మాత్రమే లబ్ది చేకూర్చట్లేదని స్పష్టం చేశారు. కౌలు రైతులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం 7500 చెల్లిస్తుందన్నారు. ఈ ఒక్క రోజే 2800 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. (మాటంటే మాటే..) "లాక్డౌన్ ఉన్నప్పటికీ రూ.1500 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం. మొక్కజొన్న, పసుపు, టమాట సహా 2లక్షల టన్నులకు పైగా మొక్కజొన్న, 53 వేల టన్నుల జొన్నలు, 80వేల టన్నుల కందులను రైతుల నుంచి కొనుగోలు చేశాం. బత్తాయి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రోజుకు 500 టన్నుల బత్తాయి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులు ఏర్పాటు చేయబోతున్నాం. అదే విధంగా ఈనెల 30న రైతు భరోసా కేంద్రాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. మొత్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయని, వీటితో రాష్ట్రంలో వ్యవసాయ స్వరూపం మారబోతోంది. ఈ కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో ఆర్బీకేలు కొనుగోలు కేంద్రాలుగా మారనున్నాయని కన్నబాబు వ్యాఖ్యానించారు. (రైతుభరోసా వచ్చేసింది) -
వాళ్లంతే.. చైనాలో మళ్లీ మామూలే!
బీజింగ్ : కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ప్రకటించిన చైనాలో ఆహార మార్కెట్లు తిరిగి తెరుచుకోగా, అక్కడ యథాతథ పరిస్థితి కళ్లకు కడుతోంది. చైనాలో పుట్టిన మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా అపరిశుభ్ర వాతావరణంలోనే అక్కడి ఆహార మార్కెట్లలో పిల్లులు, కుక్కలు, గబ్బిలాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. చైనా ఆహార మార్కెట్లలో కబేళాలకు సిద్ధమైన మూగ జీవాలు వేలాడుతూ అదే అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. గబ్బిలాలు, ఇతర మూగజీవాల ద్వారా ఈ మహమ్మారి మానవులకు వ్యాపించిందన్న సమాచారంతో ఈ ఏడాది జనవరిలో చైనాలో ఆహార మార్కెట్ల (వెట్ మార్కెట్స్)ను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వైరస్‌ను విజయవంతంగా నిరోధించగలిగామని చైనా ప్రకటించిన క్రమంలో మార్కెట్లు పునఃప్రారంభమయ్యాయి. అయితే చైనా ఫుడ్ మార్కెట్లలో తిరిగి అపరిశుభ్ర వాతావరణంలో మూగజీవాల విక్రయం ఆందోళన కలిగిస్తోంది. కరోనావైరస్కు ముందున్న స్ధితిలోనే మార్కెట్లు తిరిగి పనిచేస్తున్నాయని డైలీమెయిల్ పేర్కొంది. అయితే ఎవరినీ ఫోటోలు తీసుకునేందుకు గతంలో మాదిరిగా అనుమతించడం లేదని, ఫోటోలు తీసుకునే వారిని సెక్యూరిటీ గార్డులు అడ్డగించడం ఒక్కటే వ్యత్యాసమని తెలిపింది. ఇక ఆగ్నేయ చైనాలోని గిలిన్ నగరంలో అస్వస్థతలను నివారించేందుకు గబ్బిలాలు, పాములు, స్పైడర్లు ఇతర మూగజీవాలను తినాలంటూ సూచించే ప్రకటన బోర్డు దర్శనమిస్తోంది. చైనాలో పునఃప్రారంభమైన ఫుడ్ మార్కెట్లలో చైనా సంప్రదాయ ఆహారంపై సోషల్ మీడియాలోనూ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. ఇక కోవిడ్-19ను అధిగమించామని చైనా చెబుతున్నా పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించిన వైరస్ గణాంకాల్లో చిత్తశుద్ధిని పలువురు శంకిస్తున్నారు. చైనా తమ దేశంలో వైరస్ విధ్వంసం గురించి ప్రపంచానికి దాచిన వందల ఉదంతాలను గుర్తించామని నేషనల్ రివ్యూ వెల్లడించింది. చైనాలో 82,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3000 మందికి పైగా మరణించారు. మహమ్మారి వైరస్ వేలాది మంది ప్రాణాలను హరించినా చైనా ఆహారపు అలవాట్లు, అక్కడి ఆహార మార్కెట్లలో అపరిశుభ్రత రాజ్యమేలడం ఆందోళన రేకెత్తిస్తోంది. చదవండి: చైనా ఆ పని చేయకపోయుంటే పరిస్థితేంటి! -
అన్వేషణం: షాక్‌కి గురిచేసే షాంఘై ఫుడ్ మార్కెట్!
ఫుడ్ మార్కెట్లో ఏముంటాయి? రకరకాల కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, రొయ్యలు, ఇతరత్రా తినుబండారాలు... ఇవేగా! కానీ మీరింతవరకూ చూసి ఉండని ఓ విచ్రితమైన మార్కెట్ షాంఘైలో ఉంది. దాన్ని చూడటం సంగతి తర్వాత... దాని గురించి వింటేనే షాకయిపోతాం మనం! షాంఘైలోని గ్వాండాంగ్ ప్రావిన్స్‌లో ఉండే ఓ ఫుడ్ మార్కెట్ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ మార్కెట్లో ప్రపంచంలో ఎక్కడా చూడలేనంత నాన్‌వెజ్ దొరుకుతుంది. ఎవరూ తినలేనన్ని రకాల మాంసాలు అక్కడ ఉంటాయి. చేపలు, రొయ్యలు, పీతలు, చికెన్, మటన్ మామూలే. కానీ వాటితో పాటు మొసలి మాంసం, ఆక్టోపస్ మాంసం, స్టార్‌ఫిష్‌లు, తేళ్లు, జైలు, పాములు, ఎలుకలు, పురుగులు... దొరకని జీవి అంటూ ఏదీ ఉండదక్కడ. పచ్చివి, ఎండబెట్టినవి అంటూ వేరు చేసి మరీ అమ్ముతుంటారు. అంతేనా! తేళ్లతో చేసిన క్యాండీలు, ఫ్రూట్ పీసెస్ బదులు చిన్ని చిన్ని పురుగులను అద్దిన ఐస్‌క్రీములు, వేయించిన ఎలుకలు... అబ్బో, తినాలే గానీ బోలెడన్ని! మనకి వినడానికే వెగటుగా ఉంటుంది కానీ... షాంఘై వారికి ఆ మార్కెట్లో దొరికే ఐటెమ్స్ అంటే మహా ప్రీతి. ఎంత ఖరీదైనా పెట్టి వాటిని కొనేసుకుంటారు. ఏమాత్రం సంకోచం లేకుండా రకరకాల జీవుల్ని వండుకుని స్వాహా చేసేస్తుంటారు. వారికవి తినడం అలవాటు మరి! మీకేమైనా వాటి మీద ఇంటరెస్ట్ ఉంటే... ఎప్పుడైనా షాంఘై వెళ్లినప్పుడు చక్కగా టేస్ట్ చేసి రావచ్చు! ఆకాశంలో చందమామ ఎంత హుందాగా కనబడుతుందో... దుబాయ్‌లోని జుమేరియా బీచ్‌లో అంతకంటే ఠీవిగా కనిపిస్తుంది బుర్జ అల్ అరబ్ హోటల్. ప్రపంచంలోని అతి ఎత్తయిన హోటళ్లలో నాలుగో స్థానంలో ఉన్న ఈ స్టార్ హోటల్ అందాన్ని వర్ణించి లాభం లేదు. స్వయంగా చూడాల్సిందే! బుర్జ అల్ అరబ్ ఏర్పాటు కోసం ముందుగా సముద్రపు నీటిలో ఓ ఆర్టిఫీషియల్ దీవిని ఏర్పరిచారు. దాని మీద హోటల్‌ను నిర్మించారు. దీని ఆకారం చాలా విచిత్రంగా ఉంటుంది. అటు పూర్తిగా అర్థ చంద్రాకారంలో కాకుండా, ఇటు పూర్తి నిటారుగా కాకుండా... ఓ విచిత్రమైన ఆకృతిలో ఉంటుంది. ఓడల రాకపోకలకు ఆటకం కలుగకుండా, ఓడల కారణంగా హోటల్‌కి నష్టం వాటిల్లకుండా ఉండేలా నిర్మించేందుకే ఈ ఆకారాన్ని ఎంచుకున్నారు. మొదట్లో దీనిని దుబాయ్ చికాగో బీచ్ హోటల్ అనేవారు. కానీ 1997లో బుర్జ అల్ అరబ్‌గా పేరు మార్చారు. జుమేరియన్ గ్రూప్ వారిది కావడంతో దీనికి జుమేరియన్ బీచ్ హోటల్ అనే పేరు కూడా వచ్చింది. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో, విలాస వంతంగా ఉండే ఈ హోటల్లో విడిది చేస్తే స్వర్గంలో ఉన్నట్టేనంటారు సందర్శకులు! టామ్ రైట్, అట్కిన్స అనే ఇద్దరు ఆర్కిటెక్టులు కలిసి ఈ హోటల్‌కు రూపకల్పన చేశారు. కెనడాకు చెందిన ఇంజినీర్ రిక్ గ్రెగరీ 1994లో దీన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. 1999లో నిర్మాణం పూర్తయ్యింది. ఆ యేడు డిసెంబర్లో హోటల్‌ను తెరిచారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఇది లక్షలాది మందిని ఆకర్షించింది. దుబాయ్‌లో ప్రతిష్టాత్మకమైన, సుందరమైన నిర్మాణాలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ హోటల్లో మొత్తం 202 సూట్స్ ఉన్నాయి. రాయల్ సూట్ పేరుతో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వీటిలో విడిది చేయాలంటే ఒక్క రాత్రికి 18,776 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, మన కరెన్సీలో దాదాపు 12లక్షల పైమాటే. మామూలు సూట్ కూడా తక్కువేమీ ఉండదు. అందుకే దీనిని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పదిహేను హోటళ్లలో ఒకటిగా పేర్కొంటారు. సామాన్యుడు ఇందులో అడుగు పెట్టడం కల్లే. అందుకే బడా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు మాత్రమే ఇందులోకి వెళుతుంటారు.