సాక్షి, విజయవాడ: అర్హత ఉన్న ఏ రైతుకు కూడా అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు భరోసాలో పేర్ల నమోదుకు అర్హత ఉన్న రైతులు జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కష్టంగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ రైతు భరోసాను రెండో సంవత్సరం అందించామన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ పథకం ప్రారంభించగా.. ఈసారి 49 లక్షల మందికి పైగా రైతులకు లబ్ది చేకూరిందన్నారు. అన్ని గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల పేర్లు ఉంచుతున్నామని.. గత ప్రభుత్వం లాగా కేవలం సొంత పార్టీ వారికి మాత్రమే లబ్ది చేకూర్చట్లేదని స్పష్టం చేశారు. కౌలు రైతులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం 7500 చెల్లిస్తుందన్నారు. ఈ ఒక్క రోజే 2800 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. (మాటంటే మాటే..)
"లాక్‌డౌన్ ఉన్నప్పటికీ రూ.1500 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం. మొక్కజొన్న, పసుపు, టమాట సహా 2లక్షల టన్నులకు పైగా మొక్కజొన్న, 53 వేల టన్నుల జొన్నలు, 80వేల టన్నుల కందులను రైతుల నుంచి కొనుగోలు చేశాం. బత్తాయి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రోజుకు 500 టన్నుల బత్తాయి కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులు ఏర్పాటు చేయబోతున్నాం. అదే విధంగా ఈనెల 30న రైతు భరోసా కేంద్రాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. మొత్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయని, వీటితో రాష్ట్రంలో వ్యవసాయ స్వరూపం మారబోతోంది. ఈ కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో ఆర్‌బీకేలు కొనుగోలు కేంద్రాలుగా మారనున్నాయని కన్నబాబు వ్యాఖ్యానించారు. (రైతుభరోసా వచ్చేసింది)
Comments
Please login to add a commentAdd a comment