సాక్షి, విజయవాడ : సామాన్యుడి రేటుకు అందకుండా పోయి కంటనీరు తెప్పిస్తున్న ఉల్లిగడ్డ విషయంలో ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతు బజార్ల ద్వారా రాయితీపై రూ.40కే కిలో ఉల్లిపాయలు రేపట్నుంచే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం విజయవాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు.5 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా దిగుమతి చేసుకుంటున్నామని.. తక్షణమే వెయ్యి టన్నులు మార్కెట్లోకి తీసుకువచ్చి రైతుబజార్లలో విక్రయిస్తామన్నారు.
తొలి దశలో అన్ని ప్రధాన పట్టణాల్లోనూ రైతు బజార్ల ద్వారా కేజీ రూ.40లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ఉల్లిపాయలను ప్రతి కుటుంబానికి ఒక కేజీ వంతున రొటేషన్ పద్దతిలో ఇవ్వాలని నిర్ణయించామన్నారు. భారీ వర్షాల వల్ల మన రాష్ట్రంలో కర్నూలు సహా ఇతర రాష్ట్రాలైన తమిళనాడు,కర్నాటక, కేరళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరగడంతో ఉల్లిరేటుకు రెక్కలొచ్చాయన్నారు. కాగా రాష్ట్రంలో 28 వేల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతోందని.. మరో నెలలో కొత్త పంట కొంత అందుబాటులోకి వస్తుందన్నారు.
ప్రతి ఏటా ఈ సీజన్లో 12 వేల క్వింటాళ్లు కర్నూలు ఉల్లి మార్కెట్లకు వచ్చేదని.. ఇప్పుడు 15 వందల నుంచి 2వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోందన్నారు. గతంలో మహారాష్ట్ర నుంచే అత్యధికంగా ఉల్లి దిగుమతులు జరిగేవని.. కానీ అక్కడ భారీ వర్షాలు కురవడంతో పంట దిగుబడి బాగా తగ్గిపోయిందన్నారు. రేపటి నుంచి ఉల్లి విక్రయాలు మొదలుపెట్టి క్రమంగా అన్ని ప్రాంతాల రైతుబజార్లకు విక్రయాలు విస్తరిస్తామన్నారు. గతంలో కూడా ఉల్లి ధరలు పెరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని సబ్సిడీపై అందించినట్లు కన్నబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment