
బీజింగ్ : కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ప్రకటించిన చైనాలో ఆహార మార్కెట్లు తిరిగి తెరుచుకోగా, అక్కడ యథాతథ పరిస్థితి కళ్లకు కడుతోంది. చైనాలో పుట్టిన మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నా అపరిశుభ్ర వాతావరణంలోనే అక్కడి ఆహార మార్కెట్లలో పిల్లులు, కుక్కలు, గబ్బిలాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. చైనా ఆహార మార్కెట్లలో కబేళాలకు సిద్ధమైన మూగ జీవాలు వేలాడుతూ అదే అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. గబ్బిలాలు, ఇతర మూగజీవాల ద్వారా ఈ మహమ్మారి మానవులకు వ్యాపించిందన్న సమాచారంతో ఈ ఏడాది జనవరిలో చైనాలో ఆహార మార్కెట్ల (వెట్ మార్కెట్స్)ను మూసివేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ వైరస్‌ను విజయవంతంగా నిరోధించగలిగామని చైనా ప్రకటించిన క్రమంలో మార్కెట్లు పునఃప్రారంభమయ్యాయి.
అయితే చైనా ఫుడ్ మార్కెట్లలో తిరిగి అపరిశుభ్ర వాతావరణంలో మూగజీవాల విక్రయం ఆందోళన కలిగిస్తోంది. కరోనావైరస్‌కు ముందున్న స్ధితిలోనే మార్కెట్లు తిరిగి పనిచేస్తున్నాయని డైలీమెయిల్ పేర్కొంది. అయితే ఎవరినీ ఫోటోలు తీసుకునేందుకు గతంలో మాదిరిగా అనుమతించడం లేదని, ఫోటోలు తీసుకునే వారిని సెక్యూరిటీ గార్డులు అడ్డగించడం ఒక్కటే వ్యత్యాసమని తెలిపింది. ఇక ఆగ్నేయ చైనాలోని గిలిన్ నగరంలో అస్వస్థతలను నివారించేందుకు గబ్బిలాలు, పాములు, స్పైడర్లు ఇతర మూగజీవాలను తినాలంటూ సూచించే ప్రకటన బోర్డు దర్శనమిస్తోంది.
చైనాలో పునఃప్రారంభమైన ఫుడ్ మార్కెట్లలో చైనా సంప్రదాయ ఆహారంపై సోషల్ మీడియాలోనూ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇక కోవిడ్-19ను అధిగమించామని చైనా చెబుతున్నా పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ వెల్లడించిన వైరస్ గణాంకాల్లో చిత్తశుద్ధిని పలువురు శంకిస్తున్నారు. చైనా తమ దేశంలో వైరస్ విధ్వంసం గురించి ప్రపంచానికి దాచిన వందల ఉదంతాలను గుర్తించామని నేషనల్ రివ్యూ వెల్లడించింది. చైనాలో 82,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3000 మందికి పైగా మరణించారు. మహమ్మారి వైరస్ వేలాది మంది ప్రాణాలను హరించినా చైనా ఆహారపు అలవాట్లు, అక్కడి ఆహార మార్కెట్లలో అపరిశుభ్రత రాజ్యమేలడం ఆందోళన రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment