న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తలకిందులవడంతో రైతులంతా తల్లడిల్లిపోతున్నారు. గత జూన్ నెలలో ఆరు రూపాయలకు కిలో ధర పలికిన టమోటా ఇప్పుడు యాభై రూపాయలకు కిలో పలుకుతోంది. కొన్ని రాష్ట్రాల్లో వంద రూపాయల వరకు దూసుకెళ్లిన టమోటా ధర ఇప్పుడు 75, 80 రూపాయల వద్ద ఊగిసలాడుతోంది. టమోటాలకు ఆపిల్ డిమాండ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చెక్కర్లు కొడుతున్నాయి. టమోటా ధరను చూసి రైతులకు గిట్టుబాటు ధర దొరకుతుందంటూ సంబరపడితే పొరపాటే. డిమాండ్‌కు తగ్గ సరకు అందుబాటులో లేకపోవడం వల్ల టమోటాల ధరను అమాంతంగా పెంచి సొమ్ము చేసుకొంటోంది వ్యాపారస్థులే.
మరోపక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండు మిర్చికి గిట్టుబాటు ధర లభించక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంజాబ్‌లో గిట్టుబాటు ధర లేక రైతులు బంగాళా దుంపలను రోడ్డున పారబోస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రైతులు కూడా బంగళా దుంపలను మురికి కాల్వల్లో పడేస్తున్నారు. రాజస్థాన్‌లో వెల్లుల్లి ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు గోల పెడుతున్నారు. ఉల్లి ధరలు పడిపోవడంతో మహారాష్ట్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జూన్ నెలలో దేశవ్యాప్తంగా టమోటా ధర క్వింటాల్‌కు 600 రూపాయలు ఉండగా, నేడు క్వింటాల్‌కు 4,100 రూపాయలు పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లో బంగళా దుంపలు గతేడాది క్వింటాల్‌కు 800 రూపాయల నుంచి 1400 రూపాయలు పలుకగా, నేడు 300 రూపాయల నుంచి 500 రూపాయలు పలుకుతోంది. రాజస్థాన్‌లో రెండేళ్ల క్రితం వెల్లుల్లి ధర క్వింటాల్‌కు 8000 రూపాయలుండగా, నేడు 3,200 రూపాయలకు పడిపోయింది.
కూరగాయల ధరలు ఇంత దారుణంగా తలకిందులవడానికి కారణాలేమిటీ? ప్రప్రథమ కారణం పెద్ద నోట్ల రద్దు. నగదు లావాదేవీలకు రైతులకు అవకాశం లేకపోవడం వల్ల వారు సరకును సకాలంలో అమ్ముకోలేకపోయారు. గిడ్డంగుల్లో దాచుకోవాల్సి వచ్చింది. తర్వాత అధిక దిగుబడి రావడంతో డిమాండ్ పడిపోయింది. ఆ తర్వాత గిట్టుబాటు ధరల కోసం 16 రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలను నిర్వహించడం, వారు టమోటా పంటలను గాలికొదిలేయడం, హిమాచల్ లాంటి రాష్ట్రాల్లో టమోటాలను గిట్టుబాటులేక రైతులు రోడ్డపై పారబోయడం, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అధిక వర్షాలకు టమోటా పంట దెబ్బతినడం తదితర కారణాల వల్ల టమోటాల ధరలు పెరిగాయి.
రైతుల సమ్మెకాలంలో నిల్వ ఉంచిన బంగాళా దుంపలకు అధిక దిగుబడి వచ్చి చేరడంతో ధరలు దారుణంగా పడిపోయాయి. వెల్లుల్లి పరిస్థితి దాదాపు అదే. ఈ కారణాలకు తోడు పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిలిపివేయడంతో మహారాష్ట్రలో ఉల్లి ధర దారుణంగా పడిపోయింది. ధరలు పెరిగినా, తగ్గినా ఇక్కడ నష్టపోతున్నది ప్రధానంగా రైతులు, ఆ తర్వాత కొనుగోలుదారులైన ప్రజలు. కూరగాయలు, నిత్యావసర సరకుల ధరల స్థిరీకరణకు ప్రభుత్వ మార్కెటింగ్ శాఖలు జోక్యం చేసుకొని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమంటూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులెత్తేసింది. ఇక రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రమే సకాలంలో స్పందించి ఎనిమిది లక్షల టన్నుల బంగాళా దుంపలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. అంతమొత్తాన్ని భద్రపరిచే అవకాశాలు లేకపోవడం వల్ల అవి అప్పుడే కుళ్లిపోతున్నాయి.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు ఆయా రాష్ట్రాల వ్యాపారులు డిమాండ్ పడిపోతుందని అంగీకరించడం లేదు. దీంతో కొన్ని జీల్లాలో మార్కెటింగ్ అధికారులు టన్నులకొద్ది బంగాళా దుంపలను భూమిలో పాతిపెడుతుండగా, కొన్ని జిల్లాలో అధికారులు రోడ్డురోలర్లతో వాటిని తొక్కిస్తున్నారు. మూడొంతల మంది అన్నమో రామచంద్రా! అంటూ అలమటిస్తున్న భారతావనిలో ఆహారం ఇలా నేలపాలవుతోంది.