జంక్ ఫుడ్‌తో ఆరోగ్యం పాడవుతుందని మనందరికీ తెలుసు. చాలాకాలంగా వింటున్న ఈ విషయాన్ని ఇంకోసారి రూఢి చేసుకోవాలని అనుకున్నారో ఏమోగానీ.. పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని పల్లె ప్రాంత ప్రజలపై ఓ ప్రయోగం చేశారు. అమెరికాలో ఉండే కొంతమంది ఆఫ్రికా పల్లె తిండి తినేలా.. అదే సమయంలో ఆఫ్రికా గ్రామీణ ప్రజలు కొందరు అమెరికన్ ఫాస్ట్‌ఫుడ్ తినేలా చేశారు. రెండు వారాల తరువాత పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.
పీచుపదార్థం ఎక్కువగా.. కొవ్వు తక్కువగా ఉండే గ్రామీణ తిండితో కేన్సర్ ముప్పు తగ్గినట్లు గుర్తించారు. దీన్నిబట్టి కేవలం ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా పేగు కేన్సర్ ముప్పును తప్పించుకోవచ్చని తెలుస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ ఓ కీఫీ అంటున్నారు. ఆఫ్రికన్ అమెరికన్లలో ఈ రకమైన కేన్సర్ ఎక్కువగా ఉందని.. అదే సమయంలో ఆఫ్రికాలోని గ్రామీణులకు ఈ ముప్పు తక్కువగా ఉన్న నేపథ్యంలో తాము ఈ పరిశోధన చేపట్టామని కీఫీ వివరించారు.
అమెరికన్ తిండిలో పీచుపదార్థం తక్కువగా, కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తోందని, ఇందుకు భిన్నమైన ఆహారం తీసుకోవడం ద్వారా కేవలం రెండు వారాల్లోగానే కేన్సర్ ముప్పును తప్పించుకోవచ్చునని తమ పరిశోధన చెబుతున్నట్లు కీఫీ వివరించారు.
ఈ పూతతో...కాయగూరల తాజాదనం నాలుగింతలు!
కాయగూరలు, పండ్లు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? ఫ్రిజ్‌లో లేదంటే శీతలీకరణ గిడ్డంగుల్లో ఉంచాలి. ఈ రెండూ లేకపోతే? ఇక అంతే సంగతులు. అవి కాస్తా తొందరగా పాడైపోతాయి. అటు రైతుకు, ఇటు మార్కెటింగ్ చేసే వారికీ నష్టాలు మిగులుస్తాయి. ఈ పరిస్థితిని మార్చేస్తామంటోంది అమెరికా కంపెనీ అపీల్ సైన్సెస్. మొక్కల నుంచి సేకరించిన ఓ ద్రావణంతోనే రిఫ్రిజిరేషన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కాలం పండ్లు, కాయగూరలను తాజాగా ఉంచవచ్చునని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు.
ఎడిపీల్ అని పిలుస్తున్న ఈ ద్రావణం ప్రతి పండు, కాయగూర చుట్టూ ఒక సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తుందని, తద్వారా ఇది ఎక్కువ కాలం పాడవకుండా చూస్తుందని కంపెనీ సీఈవో జేమ్స్ రోజర్స్ తెలిపారు. ఆక్సిడేషన్, ద్రవాలు కోల్పోవడం వల్ల... పండ్లు, కాయగూరలు తొందరగా పాడవుతాయని గుర్తించిన రోజర్స్... ఈ సమస్యలకు పరిష్కారంగా ఎడిపీల్‌ను తయారు చేశారు. మొక్కల నుంచి సేకరించిన రసాయనాలతోనే దీనిని తయారుచేశారు. ఎడిపీల్... పండ్లు, కాయగూరలపై ఒక పొరలా ఏర్పడి ఆక్సిజన్ లోపలకు రాకుండా, నీరు బయటికి పోకుండా అడ్డుకుంటుందని రోజర్స్ వివరిస్తున్నారు. పండ్లు, కాయగూరల రకాలను బట్టి ఎడిపీల్ మిశ్రమం మారిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment