పండ్లు అలవాటైతే జంక్‌ని నెట్టేస్తారు | Gujarat Government To Ban Sale Of Junk Food in And Around Schools | Sakshi
Sakshi News home page

పండ్లు అలవాటైతే జంక్‌ని నెట్టేస్తారు

Published Wed, Nov 20 2019 2:02 AM | Last Updated on Wed, Nov 20 2019 2:02 AM

Gujarat Government To Ban Sale Of Junk Food in And Around Schools - Sakshi

బడి పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఇటీవల కేరళ ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లలకు ‘మంచి నీటి గంట’ను ప్రవేశపెడితే.. ఇప్పుడు గుజరాత్‌ ప్రభుత్వం పాఠశాల క్యాంటీన్‌లలో జంక్‌ఫుడ్‌ అమ్మకాలపై నిషేధం విధించబోతోంది. అంతేకాదు, బడికి యాభై మీటర్ల పరిధిలో ఫాస్ట్‌ ఫుడ్‌ను విక్రయించకూడదని కూడా ఆదేశాలు జారీ చేయబోతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై జంక్‌ ఫుడ్‌ చూపే ప్రభావాలు, జంక్‌ని మాన్పించే మార్గాల గురించి తెలుసుకుందాం.

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. స్కూల్‌ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే సంస్కృతి ఇప్పుడు పల్లెలలో కూడా వ్యాపించింది. జంక్‌ ఫుడ్‌ ప్రధానంగా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

భావోద్వేగాలపైన కూడా!
ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే భవిష్యత్తులో డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్‌ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్‌ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకునేవారు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అలబామాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు కొంతమంది పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ విషయాన్ని నిర్ధారించారు.

పాఠశాల వయసులోనే!
ప్రస్తుతం డిప్రెషన్‌కు గురయ్యే వారిలో ఎక్కువమంది పాఠశాల వయసువారే ఉంటున్నారు. 12 నుంచి 17 ఏళ్ల  పిల్లలలో ఎక్కువ మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని జాతీయ డేటా విశ్లేషణలో తేలింది. 2005–2017 మధ్య కాలంలో ఇది 52 శాతం పెరిగింది.

పరిశోధన జరిగిన తీరు
ఫాస్ట్‌ఫుడ్‌ పిల్లలపై చూపే ప్రభావాల పరిశోధన కోసం ఫాస్ట్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకునే 84 మంది పాఠశాల వయసు గల బాల బాలికలను తీసుకున్నారు. వీరిలో 95 శాతం మంది తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన ఆఫ్రికన్‌ అమెరికన్లు. వారిలోని సోడియం, పొటాషియంల శాతాన్ని పరీక్షించడం కోసం ప్రతి రోజు రాత్రిపూట వారి మూత్ర నమూనాలు సేకరించారు. ఇలా ఏడాదిన్నర కాలంపాటు అధ్యయనం చేసిన తర్వాత.. జంక్‌ఫుడ్‌ తీసుకునేవారిలో సోడియం శాతం పెరిగి, పొటాషియం తగ్గుతుందని కనుగొన్నారు.

‘‘జంక్‌ఫుడ్‌లో ఎక్కువ మొత్తం కొవ్వు, చక్కెర, ఉప్పు ఉంటాయి. శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్స్, విటమిన్స్, ఇతర పోషక పదార్థాలు వుండవు. మనకు అవసరమైన పీచు పదార్థాలు లభించవు’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సిల్వీ మ్రగ్‌ సిల్వీ తన పరిశోధన తర్వాత వెల్లడించారు. బీన్స్, చిలగడ దుంపలు, బచ్చలికూర, టమాటాలు, అరటిపండ్లు, నారింజ, పెరుగు, కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే పొటాషియం శాతం తగ్గుతుందని కూడా సిల్వీ చెప్పారు.

తినకుండా ఉండలేని వారు..!
జంక్‌ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అందుకని జంక్‌ ఫుడ్‌ని తినకుండా ఉండలేనివారు తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో మాత్రమే ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకోవడం మంచిదని కూడా ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
– శెట్టె అంజి, సాక్షి వెబ్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement