సాక్షి, న్యూఢిల్లీ: నగరాల్లో ఉండే చిన్నారుల్లో ఎక్కువ మంది అనారోగ్యకర ఆహార అలవాట్లతో ఇబ్బందులు పడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకునే చిన్నారులు 18 శాతం మంది మాత్రమే రోజుకో పండు తింటున్నారని వెల్లడైంది. దేశవ్యాప్తంగా దాదాపు 100 పాఠశాలలను నిర్వహిస్తున్న పొదార్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఈ సర్వే చేపట్టింది. పిల్లల ఆహార అలవాట్లపై దేశంలోని మెట్రో నగరాల్లో ఉంటున్న1,350 మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవి 35శాతం మంది పిల్లలు మాత్రమే రోజు వారీగా శాకాహారం తీసుకుంటున్నారు. సగం మంది పిల్లలు జంక్‌ఫుడ్, స్వీట్లు రోజూ తీసుకోవటం వంటి అనారోగ్యకర ఆహార అలవాట్లను కలిగి ఉన్నారు. సుమారు 76 శాతం మంది చిన్నారులు ఆటలు ఆడుకునే అలవాటు ఉన్నట్లు తేలటం కొంత ఊరట కలిగించే అంశం. మిగతా 24 శాతం మందికి ఎటువంటి శారీరక శ్రమ పడటం లేదట.
ఈ సర్వేపై పొదార్ గ్రూప్ ట్రస్టీ రాఘవ్ పొదార్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాల చిన్నారుల్లో ఊబకాయ పెను సమస్యగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాల్లో చిన్నారులు యుక్తవయస్కు(5-19 ఏళ్లు)లో ఊబకాయం పది రెట్లు పెరిగినట్లు తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. చిన్నారుల ఆరోగ్యం చాలా కీలకమైన అంశం.. దీనిపై తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు కలిసికట్టుగా కృషి చేయాల్సి ఉంది. పౌష్టికాహారంపై చిన్నారులకు పాఠాలు బోధించటం కన్నా వారికి ఆ ఆహారం ఎంతమేరకు ఇస్తున్నారనేది కూడా ముఖ్యమని న్యూట్రిషనిస్ట్ శ్రీప్రియా వెంకటేషన్ తెలిపారు.
అంతే కాకుండా, ఏఏ వయస్సుల వారు ఎంత ఆహారం తీసుకోవాలనేది కూడా చిన్నారులకు అవగాహన కల్పించాలని, శుభకార్యాలకు వెళ్లిన సందర్భాల్లో ఆహారం మితంగా భుజించాలనేది కూడా తెలపాలని కోరారు. నియమిత వేళల్లో ఆహారం తీసుకోవటం ముఖ్యమని కూడా చిన్నారులకు తెలపాలని, ఆహారం మానేయటం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు. ఆహారం తీసుకున్న మూడు గంటల తర్వాతే పిల్లలు నిద్రకు ఉపక్రమించేలా అలవాటు చేయాలని కోరారు. ఆరోగ్యంగా, పుష్టిగా ఉండటానికి రోజుకు కనీసం గంట పాటు ఆటలు ఆడటం చాలా ముఖ్యమని తెలిపారు. వ్యాయామం లేని చిన్నారుల్లో చదువులో వెనుకబాటుతనంతో పాటు, చురుకుదనం తగ్గి, దుందుడుకు స్వభావం అలవాటు అవుతుందని, డయాబెటిస్, ఊబకాయం వంటివి వస్తాయని ఎడ్యుస్పోర్ట్స్ కో ఫౌండర్ పర్మిందర్ కౌర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment