సాక్షి, హైదరాబాద్: పండ్లు, కూరగాయలు ఆరోగ్యకరం.. రోడ్డు పక్కన ఏవో తినుబండారాలు, చిరుతిళ్ల కన్నా వీటితో చేసిన సలాడ్‌లు ఎంతో మేలు. కానీ ఈ సలాడ్‌లు బ్యాక్టీరియాకు అడ్డాగా మారిపోతున్నాయి. అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచడం, కడగకుండానే కోయడం వల్ల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. క్యారెట్, దోస, క్యాబేజీ, ఉల్లితోపాటు వివిధ రకాల పండ్లను ముక్కలుగా చేసి నిల్వ ఉంచడం వల్ల ప్రమాదకర స్థాయిలో బ్యాక్టీరియా ఎదుగుతోంది. అసలు రోడ్ల పక్కన విక్రయించేవాటిలో దాదాపు 60 శాతం సలాడ్‌లపై బ్యాక్టీరియా ఉన్నట్లు హైదరాబాద్‌లోని ‘ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్’పరిశోధనలో వెల్లడైంది. అపరిశుభ్ర పరిసరాలు, దుమ్ము, ధూళి దీనికి కారణమవుతున్నట్లు తేలింది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 200 నమూనాలను సేకరించి.. ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)’సంస్థ ఆధ్వర్యంలో పరీక్షించారు.
కడగకుండానే కోసేస్తున్నారు..!
సాధారణంగా వివిధ ఆహార పదార్థాలతోపాటు అందించే క్యారెట్, కీరా, క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వంటివాటిని 98 శాతం మంది వ్యాపారులు కడగకుండానే కోస్తున్నారని గుర్తించారు. దీనికితోడు అపరిశుభ్ర పరిసరాల కారణంగా వాటిపై స్టెఫెలోకోకస్, ఎర్సినియా, సాల్మోనెల్లా, ఈకోలీ వంటి బ్యాక్టీరియా చేరుతోందని తేల్చారు. దీంతో సలాడ్లు తీసుకున్నవారికి జీర్ణకోశ వ్యాధులు, ఫుడ్ పాయిజన్, టైఫాయిడ్, న్యూమోనియా, చర్మవ్యాధుల వంటివి వస్తున్నట్లు గుర్తించారు. రోడ్డు పక్కన సలాడ్లు విక్రయించేవారిలో 56% మంది.. కొన్ని రోజులకు సరిపడా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారని అధ్యయనంలో తేలింది. మిగతా 44% మంది కూడా వీధుల్లో ఉండే తమ దుకాణా ల్లోనే అపరిశుభ్ర పరిసరాల్లో నిల్వ చేస్తున్నట్లు వెల్లడైంది.
అధ్యయనంలో తేలిన మరిన్ని అంశాలు..
- సలాడ్లు విక్రయించే వ్యాపారాల్లో సుమారు 54 శాతం ఫుట్‌పాత్‌లు, కాలనీలు, బస్తీల కూడళ్లలోనే ఉన్నాయి. దాంతో దుమ్ము, ధూళి చేరుతోందని, దోమలు, ఈగలు వాలుతున్నట్లు గుర్తించారు.
- కూరగాయలు, పండ్లను కోసే కత్తులు, చెక్క మొద్దులను సరిగా శుభ్రం చేయడం లేదు.
- పండ్లను, క్యారెట్, దోస, క్యాబేజీ వంటివాటిని కడగకుండానే కోస్తుండడంతో.. వాటిపై ఉన్న పురుగు మందుల అవశేషాలు, బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు సలాడ్లలో చేరుతున్నాయి.
- సలాడ్లు విక్రయించేవారు 60 శాతం మంది తమ చేతులను శుభ్రం చేసుకోవడం లేదని, దానితో బ్యాక్టీరియా పెరుగుతోందని అధ్యయనంలో గుర్తించారు.
- సాధారణంగా రోడ్లపై విక్రయించే వాటిలో అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికించే, కాల్చే ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- అయితే కూరగాయలు, పండ్లను కేవలం ముక్కలుగా చేసి విక్రయించే సలాడ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment