salads
-
Summer Tips: వేసవిలో సలాడ్స్ తిన్నారంటే!
కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం ఇంటిని, ఒంటినీ ఆరోగ్యంగా ఉంచుతుందనేది పెద్దల మాట. ఈ మాటను అనుసరించి వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో సలాడ్స్ తినడం మేలు చేస్తుంది. వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్‌ను తయారు చేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు. హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్న, మొలకెత్తిన పెసలు, శనగలు, కూరముక్కలు.. వంటివాటిని కలిపి తీసుకుంటే మంచిది. అలాగే మొలకెత్తిన గింజలు, బీన్స్, తరిగిన కూరముక్కలు, పండ్లతో కలిపి సలాడ్‌లా తీసుకుంటే కాల్షియం, ప్రొటీన్లు ఒంటికి అందుతాయి. ఇందులో తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన కూరలతో కలపడం వల్ల కాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు. ఇక సలాడ్స్‌తో పాటు దోసకాయతో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. గ్రీక్ రైస్ సలాడ్ తయారీ: కావలసిన పదార్ధాలు: అన్నం – 3 కప్పులు, పుట్ట గొడుగులు – కప్పు (గంటసేపు నీళ్లలో నానబెట్టి, నీరు ఒంపేసి చిన్న చిన్న ముక్కలు చేయాలి), టొమాటో – 1 (ముక్కలు చేయాలి), కీర దోస చక్రాలు – అర కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, చీజ్ – పావు కప్పు, నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను, మిరియాల పొడి – అర టీ స్పూను తయారీ: గిన్లెలో అన్నం, మిగిలిన పదార్థాలు వేసి బాగా మూత పెట్టాలి. ఫ్రిజ్‌లో సుమారు గంటసేపు ఉంచి తీసేయాలి. బౌల్స్‌లో సర్వ్ చేసే ముందు, కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరి! క్యాబేజీ సలాడ్ విత్ ఎ క్రంచ్ కావలసిన పదార్ధాలు: క్యాబేజీ తరుగు – కప్పు, నూడుల్స్ – ఒక ప్యాకెట్, నువ్వులు – ఒక టేబుల్ స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 4 (మెత్తగా చేయాలి), బాదం పప్పులు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి)డ్రెసింగ్ కోసంసోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ – పావు కప్పు, పంచదార – అర కప్పు, రిఫైన్డ్ ఆయిల్ – పావు కప్పు, మిరియాల పొడి – పావు టీ స్పూను, అల్లం తురుము – పావు టీ స్పూను, ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు తయారీ: పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడయ్యాక సోయా సాస్, వెనిగర్, పంచదార, రిఫైన్డ్ ఆయిల్, మిరియాల పొడి, అల్లం తురుము వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి చల్లారాక ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచాలి ఒక చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి.. అది వేడెక్కిన తర్వాత నూడుల్స్, నువ్వులు, వెల్లుల్లి ముద్ద వేసి పదార్థాలన్నీ బంగారు రంగులోకి మారేవరకు కలిపి దింపేయాలి ఒక పెద్ద బౌల్లో నూడుల్స్ మిశ్రమం, క్యాబేజీ తరుగు వేసి కలపాలి ఫ్రిజ్‌లో నుంచి డ్రెసింగ్ మిశ్రమం బయటకు తీసి, ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి, బాదం పప్పులతో అలంకరించి చల్లగా అందించాలి. త్రీ బీన్ సలాడ్ కావలసినవి: నానబెట్టిన అలసందలు – ఒక కప్పు ; నానబెట్టిన చిక్కుడు గింజలు; – ఒక కప్పు ; నానబెట్టిన సెనగలు – ఒక కప్పు ; ఉల్లి తరుగు – అర కప్పు ; కొత్తిమీర తరుగు – ఒక కప్పు ; పంచదార – పావు కప్పు ; ఆలివ్ ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు ; ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్లు; నల్ల మిరియాలు – పావు టీ స్పూను; వెనిగర్ – 2 టీ స్పూన్లు తయారీ: ఒక పెద్ద పాత్రలో మూడు రకాల గింజలూ వేసి బాగా కలపాలి ∙ కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి ∙ వేరొక బౌల్లో వెనిగర్, పంచదార, ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి గింజలున్న బౌల్లో వేసి కలిపి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి, అందించాలి. -
సక్సెస్ఫుల్ సలాడ్!
మొలకెత్తిన విత్తనాలు, క్యాప్సికమ్, టొమాటో, క్యారట్, బీట్ రూట్ వంటి కొన్ని రకాల పచ్చి కూరగాయల ముక్కలు సన్నగా కట్ చేసి, ఉదయం పూట సలాడ్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే అవగాహన చాలామందిలో ఉంటుంది. కానీ, రోజూ అలా సలాడ్ తయారు చేసుకునే తీరిక అందరికీ ఉండదు. ముఖ్యంగా ఉద్యోగస్థులకు.‘సైడ్’ డిష్‌గా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా భావించే ఈ హెల్తీ సలాడ్ స్థిరమైన సంపాదనకు దారి చూపుతుందని భావించింది పూణెలో ఉంటున్న మేఘా బఫ్నా. ఐదేళ్ల క్రితం రూ.3500తో మొదలుపెట్టిన మేఘా హెల్తీ సలాడ్ వ్యాపారం ఇప్పుడు ఆమెకు నెలకు లక్షన్నర రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది. ‘నా నైపుణ్యాల పట్ల నాకు చాలా నమ్మకం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో 15 ఏళ్ల పాటు ఉన్నాను. పనిలో ఎంత బిజీగా ఉన్నా బ్రేక్‌ఫాస్ట్ ్టగా నేను తీసుకున్న సలాడ్ నన్ను ఆరోగ్యంగా ఉంచింది. దీన్నే బిజినెస్‌గా మార్చుకుంటే..? అనే ఆలోచన వచ్చినప్పుడు సలాడ్ వ్యాపారి గా మారిపోయాను’ అంటారు మేఘా. అనారోగ్యం తెచ్చిన మార్పు తన జీవితంలో ఎంత ముఖ్యమైనదో వివరిస్తూ ‘9వ తరగతి చదువుతున్న సమయంలో అనారోగ్య కారణంగా ఆపరేషన్ వరకు వెళ్లాను. నా కాళ్లు నా స్వాధీనంలోకి రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. పెద్దయ్యాక వచ్చే ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్లు ముందే హెచ్చరించారు. దీంతో ఎప్పుడూ బయట ఆహారం తీసుకోలేదు. కాలేజీ స్థాయి నుంచి ఆఫీసు వరకు.. అన్ని రోజుల్లోనూ నాకు నేనుగా తయారు చేసుకున్న ప్రత్యేక భోజనం ఎప్పుడూ నాతోపాటు ఉంటుంది. మా కొలీగ్స్ కూడా నా సలాడ్ బాక్స్‌ను తిని, మెచ్చుకునేవారు. దీనినే మార్కెట్ చేయమని వారు చెబుతుండేవారు’ అని నాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటారు మేఘా. తాజా తాజా సలాడ్స్ ‘జంక్ ఫుడ్ ఎక్కడైనా సులభంగా లభిస్తుంది. కానీ, మంచి ఆరోగ్యకరమైన సలాడ్స్ మాత్రం అందుబాటులో లేవు. తాజా సలాడ్స్ లభించకపోవడం అనే సమస్యను నేను పరిష్కరించాలనుకున్నాను. అందుకు మా కుటుంబసభ్యులతోనూ చర్చించాను. అలా 2017లో సలాడ్ బిజినెస్ మొదలుపెట్టాను. ప్రచారం కోసం వాట్సప్, ఫేస్‌బుక్‌లను మాత్రమే ఉపయోగించాను’ అని వివరించే మేఘా మరెక్కడా ప్రమెషన్లు ఇవ్వలేదని, పూర్తిగా సేంద్రియ పదార్థాలతోనే సలాడ్స్ తయారుచేస్తానని చెబుతుంది. కొత్త ఆర్డర్లు.. కొత్త సవాళ్లు మొదటి రోజున 3,500 రూపాయలతో ఆరు ఆర్డర్ల ప్రారంభ పెట్టుబడితో మేఘా సలాడ్ వ్యాపారం మొదలైంది. వచ్చిన ప్రతీ కొత్త ఆర్డర్‌తో, కొత్త సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. కార్పోరేట్ ఉద్యోగం చేస్తూనే అదనంగా సలాడ్ వ్యాపారం చేస్తూ వచ్చింది. అందుకు మేఘా రోజూ తెల్లవారుజామున 4 గంటలకు తన పనిని ప్రారంభిస్తుంది. ‘సలాడ్స్ కోసం రోజూ ధాన్యాలు నానబెట్టాలి, తాజా కూరగాయలు కావాలి. అందుకు రోజూ మార్కెట్‌కు వెళతాను. కూరగాయలను శుభ్రం చేసి, కట్ చేసి సలాడ్స్ సిద్ధం చేయాలి. నా కొడుకు స్కూల్‌కు వెళ్లేవరకు నాకు సాయంగా ఉంటాడు. సలాడ్స్ ప్యాక్ చేసి, పనికి బయల్దేరడం.. ఎలా ఉంటుందంటే రోలర్కోస్ట్ పై ప్రయాణం చేస్తున్నట్టుగా నా పని ఆనందంగా పూర్తిచేస్తాను’ అని మేఘా చెబుతుంది. ప్రత్యేకమైన ప్యాకింగ్ ఇప్పుడు మేఘా ప్రతి నెల లక్షన్నర రూపాయలు సలాడ్స్ మీద సంపాదిస్తుంది. ‘ఇది అంత ఆషామాషీగా జరగలేదు. నాలుగేళ్లు సలాడ్ వ్యాపారంలో వచ్చిన అడ్డంకులను ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు ఆర్డర్లు తగ్గిపోవడం, ప్లాస్టిక్ నిషేధం సమయంలో ప్యాకింగ్ విషయంలోనూ సమస్యలు వచ్చాయి. బీపీ, షుగర్ సమస్యలున్న కస్టమర్ల కోసం ప్రత్యేకమైన సలాడ్స్ తయారుచేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఉద్యోగులకు మరో తరహాలో సలాడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఈ వ్యాపారంలో ఎదురైన ఇబ్బందులు, వాటిని అధిగమిస్తున్న తీరు తెన్నుల గురించి తెలియజేస్తుంది మేఘా. ‘‘ఇప్పుడు పది మందికి పైగా మహిళలను సలాడ్ తయారీలో ఉద్యోగినులుగా నియమించుకోవడంతో వారాంతాలు కుటుంబంతో గడపడం, ఉదయం కాస్త లేటుగా నిద్రలేవడం వంటివి చేస్తున్నాను’’ అని చిరునవ్వుతో చెబుతుంది మేఘా. వారానికి రూ.620లతో మేఘా దగ్గర సలాడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. -
సలాడ్ కొంటే.. బ్యాక్టీరియా ఫ్రీ!
సాక్షి, హైదరాబాద్: పండ్లు, కూరగాయలు ఆరోగ్యకరం.. రోడ్డు పక్కన ఏవో తినుబండారాలు, చిరుతిళ్ల కన్నా వీటితో చేసిన సలాడ్లు ఎంతో మేలు. కానీ ఈ సలాడ్లు బ్యాక్టీరియాకు అడ్డాగా మారిపోతున్నాయి. అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచడం, కడగకుండానే కోయడం వల్ల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. క్యారెట్, దోస, క్యాబేజీ, ఉల్లితోపాటు వివిధ రకాల పండ్లను ముక్కలుగా చేసి నిల్వ ఉంచడం వల్ల ప్రమాదకర స్థాయిలో బ్యాక్టీరియా ఎదుగుతోంది. అసలు రోడ్ల పక్కన విక్రయించేవాటిలో దాదాపు 60 శాతం సలాడ్లపై బ్యాక్టీరియా ఉన్నట్లు హైదరాబాద్‌లోని ‘ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్’పరిశోధనలో వెల్లడైంది. అపరిశుభ్ర పరిసరాలు, దుమ్ము, ధూళి దీనికి కారణమవుతున్నట్లు తేలింది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 200 నమూనాలను సేకరించి.. ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)’సంస్థ ఆధ్వర్యంలో పరీక్షించారు. కడగకుండానే కోసేస్తున్నారు..! సాధారణంగా వివిధ ఆహార పదార్థాలతోపాటు అందించే క్యారెట్, కీరా, క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వంటివాటిని 98 శాతం మంది వ్యాపారులు కడగకుండానే కోస్తున్నారని గుర్తించారు. దీనికితోడు అపరిశుభ్ర పరిసరాల కారణంగా వాటిపై స్టెఫెలోకోకస్, ఎర్సినియా, సాల్మోనెల్లా, ఈకోలీ వంటి బ్యాక్టీరియా చేరుతోందని తేల్చారు. దీంతో సలాడ్లు తీసుకున్నవారికి జీర్ణకోశ వ్యాధులు, ఫుడ్ పాయిజన్, టైఫాయిడ్, న్యూమోనియా, చర్మవ్యాధుల వంటివి వస్తున్నట్లు గుర్తించారు. రోడ్డు పక్కన సలాడ్లు విక్రయించేవారిలో 56% మంది.. కొన్ని రోజులకు సరిపడా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారని అధ్యయనంలో తేలింది. మిగతా 44% మంది కూడా వీధుల్లో ఉండే తమ దుకాణా ల్లోనే అపరిశుభ్ర పరిసరాల్లో నిల్వ చేస్తున్నట్లు వెల్లడైంది. అధ్యయనంలో తేలిన మరిన్ని అంశాలు.. - సలాడ్లు విక్రయించే వ్యాపారాల్లో సుమారు 54 శాతం ఫుట్‌పాత్‌లు, కాలనీలు, బస్తీల కూడళ్లలోనే ఉన్నాయి. దాంతో దుమ్ము, ధూళి చేరుతోందని, దోమలు, ఈగలు వాలుతున్నట్లు గుర్తించారు. - కూరగాయలు, పండ్లను కోసే కత్తులు, చెక్క మొద్దులను సరిగా శుభ్రం చేయడం లేదు. - పండ్లను, క్యారెట్, దోస, క్యాబేజీ వంటివాటిని కడగకుండానే కోస్తుండడంతో.. వాటిపై ఉన్న పురుగు మందుల అవశేషాలు, బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు సలాడ్లలో చేరుతున్నాయి. - సలాడ్లు విక్రయించేవారు 60 శాతం మంది తమ చేతులను శుభ్రం చేసుకోవడం లేదని, దానితో బ్యాక్టీరియా పెరుగుతోందని అధ్యయనంలో గుర్తించారు. - సాధారణంగా రోడ్లపై విక్రయించే వాటిలో అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికించే, కాల్చే ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. - అయితే కూరగాయలు, పండ్లను కేవలం ముక్కలుగా చేసి విక్రయించే సలాడ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. -
అమ్మాయిలను ఆకర్షించాలంటే....
సిడ్నీ: అమ్మాయిలను ఆకర్షించేందుకు యువకులు అనేక విధాలుగా తంటాలు పడుతుంటారు. కొందరు రకరకాల రీతుల్లో హేర్ కట్ చేసుకొని, స్టైలిష్‌గా దుస్తులు వేసుకుంటారు. మరి కొందరు నీట్‌గా గడ్డం గీసుకొని గుభాలించే గులాబీ అత్తరును ఒళ్లంతా పూసుకుంటారు. మరికొందరు నీవులేక నేను లేను...నేను లేక నీవు లేవు...అని కూనిరాగాలు కూడా తీస్తారు. ఇక అలాంటి అగచాట్లు మగవాళ్లకు అక్కర్లేదని, మగవాళ్ల చెమట నుంచి వచ్చే సువాసనలకు అమ్మాయిలు పడిపోతారని, అందుకు ఓ చిట్కా కూడా ఉందని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. శరీరం నుంచి వెలువడే చెమట ఆడవాళ్లను ఆకర్షించే సువాసనలను వెదజల్లాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. మంచి ప్రొటీన్లు కలిగిన కూరగాయల సలాడ్లు, పండ్లు తీసుకోవాలి. వీలైనంత మేరకు కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. ఇవి తిన్నవారి మగవాళ్ల చెమట నుంచి సుమధుర సువాసనలు వెలువడుతాయట. ఆ వాసనను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట. కోడి, మేక మాంసం తినే అలవాటున్న నాన్ వెజిటేరియన్ మగవాళ్ల నుంచి కూడా ఇలాంటి సువాసనలే వెలువడుతాయట. ఏదేమైనా కార్బోహైరేట్లను మాత్రం గణనీయంగా తగ్గించాలట. కార్బోహైరేట్లు ఎక్కువగా ఉన్న మగవారి చెమట కంపు కొడుతుందట. ఈ విషయాన్ని సిడ్నీలోని మాక్వారీ యూనివర్శిటీకి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ ఐయాన్ స్టీఫెన్ బృందం తొమ్మిది మంది ఆడవాళ్లు, 43 మంది మగవాళ్లపై పరిశోధన జరిపి తేల్చారు. ‘ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ బిహేవియర్’ అనే పత్రికలో తమ పరిశోధన వివరాలను వివరించారు. స్టీఫెన్ ఈ ప్రయోగం కోసం ముందుగా 43 మంది యువకుల నుంచి వారి చెమటను సేకరించారు. వాటిలో ఏ చెమట మధురంగా ఆస్వాదించేలా ఉందో, ఏ చెమట శాంపిల్ కంపుకొడుతూ అసహ్యించుకునేలా ఉందో కనుక్కోవాల్సిందిగా పరీక్ష పెట్టారు. తొమ్మిది మంది మహిళులు అభిప్రాయాలను తీసుకొని 43 మంది చెమటకు గ్రేడ్లు కేటాయించారు. ఆశ్చర్యంగా కూరగాయ సలాడ్లు, పండ్లు ఎక్కువగా తీసుకొని, కార్బోహైడ్రేట్స్‌ను తక్కువగా తీసుకునే వారి చెమటకే ఆ మహిళంతా ఓటేశారు. తక్కువ కార్బొహైడ్రేట్లు తీసుకొని మాంసం ఎక్కువగా తీసుకునే వారి చెమటను కూడా కొంచెం తక్కువగా అదే గ్రేడ్‌ను కేటాయించారు. స్టీఫెన్ బృందం స్పెక్ట్రోమీటర్ ద్వారా మగవాళ్ల చెమటోవున్న ‘కరోటినాయిడ్స్’ను లెక్కించారు. కరోటినాయిడ్స్ ఎక్కువగా వున్న మగవాళ్ల చెమటనే మహిళలు గ్రేడ్ వన్‌గా నిర్ణయించారు. కూరగాయలు, పండ్లు, మాంసం ఎక్కువగా తీసుకునే వారిలోనే కరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయని డాక్టర్ స్టీఫెన్ తెలిపారు. ప్రోటీన్లకన్నా కార్బోహైడ్రేట్లు ఎక్కువ తీసుకున్న వారి చెమట వాసనకు ఆడవాళ్లు ముక్కులు మూసుకున్నారు. కంపు అంటూ ఛీదరించుకున్నారు. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా తీసుకునే వారిలో కరోటినాయిడ్స్ తక్కువగా ఉంటుందట. అందుకని వారి నుంచి వెలువడే చెమట వాసన బాగుండదట. అనంతరం స్టీఫెన్ బృందం చెమట సేకరించిన 43 మంది అహార అలవాట్ల గురించి ముందుగానే సేకరించిన సమాచారంతో ఆడవాళ్లు కేటాయించిన గ్రేడ్లను పోల్చి చూశారు. గ్రేడ్లకు, మగవాళ్ల ఆహారపు అలవాట్లకు సరిపోయిందని ఈ పరిశోధన ద్వారా తేల్చారు. అయితే ఇదే ప్రయోగం ఆడవాళ్ల చెమటపై కూడా జరపాలని అనుకుంటున్నామని స్టీఫెన్ బృందం తెలిపింది. మగవాళ్ల వద్ద నుంచి వచ్చే ఒకవిధమైన వాసన ఆడవాళ్లను ఎక్కువగా ఆకర్షిస్తుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చారు. -
సీజన్లో తినేవన్నీ ఇంటిపంటలే!
ఇంటిపంటల పెంపకం హాబీ మాత్రమేనా? ఇంటి అవసరాల కోసం సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లకు ఆధారపడేంతగా పండించుకోవచ్చా? ఇంటిపంటలు పండించే వారికి ఉన్న ఆసక్తి, చోటు, తీరిక ఎంత ఉందన్న దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. గాఢమైన ఆసక్తి, అవగాహన ఉంటే ఇంటిపంటల ఉత్పాదక ఎంత చక్కగా ఉంటుందో సికింద్రాబాద్ సైనిక్‌పురి నివాసి విజయలక్ష్మి ‘సాక్షి’తో చెప్పిన మాటలనుబట్టి అర్థం చేసుకోవచ్చు. ‘సీజన్లో మా పెరటిలో పండించే ఆకుకూరలు, కూరగాయలనే మా కుటుంబం, మా ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు వాడుకుంటున్నాం. మిగిలిన వాటిని సేంద్రియ సంతల్లో అమ్ముతున్నాం. ఖర్చులు పోను అదనంగానే ఆదాయం వస్తోంది. సంపాయించిన డబ్బుతోనే పీవీసీ పైపులతో షేట్నెట్ పందిరి వేయించా. దీంతోపాటు మా పనివాళ్ల పిల్లల చదువుల కోసం కూడా ఈ డబ్బు వెచ్చిస్తున్నాం’ అన్నారామె సంతృప్తిగా! సంప్రదాయ పంటలతో పాటు ఆధునిక పంటలనూ సాగు చేయడం ఆమె ప్రత్యేకత. విజయలక్ష్మి ఇంటి ఆవరణలో 400 చదరపు అడుగుల స్థలం ఉంది. జీవశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేసి విశ్రాంత జీవితం గడుపుతున్న ఆమెకు చెంచాడు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఇంటి పంటలు పండించడంపై లోతైన అవగాహనతోపాటు కొన్ని ఏళ్ల అనుభవం కూడా ఉంది. మైక్రో స్ప్రింక్లర్లను అమర్చడం వల్ల సాధా రణం కన్నా 4, 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమో దవుతున్నా ఇంటిపంటలు చక్కగా పెరుగుతున్నాయి. సలాడ్స్‌లో వినియోగించే లెట్యూస్, పాక్చాయ్(చైనీస్ క్యాబేజి) వంటి ఖరీదైన ఆకుకూరలను ఎత్తుమడుల్లో పెంచుతుండడం విశేషం. రెండు రకాల లెట్యూస్‌ను ఆమె సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 90 రోజులు. 4 వారాల నారును మడుల్లో నాటేసి పెంచుతున్నారు. చదరపు అడుగుకు 5 మొక్కల చొప్పున నాటుతున్నారు. నాటిన 50-60 రోజుల్లో కోతకొస్తాయన్నారు. అధిక పోషకాలనిచ్చే ఎర్ర తోటకూరతోపాటు కొత్తిమీర, గోంగూర, పాలకూర, చుక్కకూర, వంగ, క్యాబేజి, ఆనప, పొట్ల, చిలగడదుంప, మిరప తదితర పంటలను ఆమె సాగు చేస్తున్నారు. 6్ఠ4 మడిని సాగుకు సిద్ధం చేసేటప్పుడు 6-10 కిలోల అమృత్ఖాద్ అనే సొంతంగా తయారుచేసుకున్న సేంద్రియ ఎరువును వేస్తారు. ఆకుకూరల సాగుకు ఈ బలం సరిపోతుంది. కూరగాయలు, తీగజాతి పాదులకు (వర్మీ కంపోస్టు కిలో+కొబ్బరిపొట్టు కిలో+ పావుకిలో మట్టి కలిపిన) కంపోస్టు మిశ్రమాన్ని మొక్కకు 50-100 గ్రాముల చొప్పున నెలకోసారి వేస్తారు. పిందె దశలో ఉన్నప్పుడు స్లో రిలీజింగ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మిశ్రమాన్ని మొక్కకు 25 నుంచి 50 గ్రాముల వరకు ఒకసారి వేస్తారు. వీటితోపాటు సస్యరక్షణకు స్వయంగా తయారు చేసుకున్న ‘వర్మీటీ’ని అడపా దడపా పిచికారీ చేస్తున్నారు. చీడపీడల బెడద లేకుండా చూడ డంతోపాటు అదనపు పోషకాల నందించడం వర్మీటీ ప్రత్యేకత అని ఆమె చెప్పారు. గ్రోబాగ్స్.. కంటెయినర్లలోనూ.. కేవలం మడుల్లోనే కాకుండా.. యూవీ ట్రీటెడ్ గ్రోబాగ్స్, కుండీలు, పాత బకెట్లు వంటి కంటెయినర్లలోనూ అనేక పంటలు పండిస్తున్నారు. గ్రోబాగ్స్‌లో 3 నెలల క్రితం విజయలక్ష్మి నాటిన బెల్ పెప్పర్స్ మొక్కలు పెద్ద కాయలతో కనువిందు చేస్తున్నాయి. విస్తారంగా అల్లుకొని కాయలు కాస్తున్న నాటు ఆనప పాదు చూడముచ్చటగా ఉంది. అడుగు వెడల్పు, అడుగు ఎత్తు ఉన్న గ్రోబ్యాగ్లోనే ఈ ఆనప పాదు పెరుగుతోంది. మైక్రో గ్రీన్స్, గోధుమ గడ్డి.. సలాడ్స్‌లో సకల పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలంటే మైక్రో గ్రీన్స్‌ను వాడుకోవడం మంచిదని విజయలక్ష్మి చెబుతున్నారు. 25 రకాల ఆహార పంటల గింజలను రెండు అంగుళాల ఎత్తు వరకు పెంచి సలాడ్స్‌లో వాడుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆమె అన్నారు. క్యాంటీన్ పార్సిళ్లలో వచ్చే చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సులను వినియోగిస్తూ గోధుమ గడ్డిని కూడా పెంచుతున్నారు. పెరటి స్థలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ.. ఇంటిపంటల సాగుపై జీవ ఆర్గానిక్స్ శ్యామ్ పెనుబోలు(9849514854)తో కలసి ఔత్సా హికులకు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారామె. నేలతల్లిపై ప్రేమతో స్ఫూర్తిదాయకమైన జీవనం సాగిస్తున్న ఆదర్శ సిటీ ఫార్మర్ విజయలక్ష్మికి ఆ..కు..ప..చ్చ..ని వందనాలు! - పంతంగి రాంబాబు, ఇంటిపంట డెస్క్ ఫొటోలు: కరుణాకర్ స్లో రిలీజింగ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అవసరమే! ఇంటిపంటలకు వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులు నెల రోజులకు మించి పోషకాల నందించలేవు. వేసిన రెండు నెలల వరకు నిదానంగా పోషకాలనందించే స్లో రిలీజింగ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడకం అవసరమేనని అనుభవపూర్వకంగా గ్రహించాను. సీ వీడ్ గ్రాన్యూల్స్, రాక్ ఫాస్పేట్, వేపపిండి, వేరుశనగ/ కానుగ/ఆముదం/సీతాఫలం గింజల పిండి సమపాళ్లలో కలిపి వాడుతుంటే మంచి ఫలితాలొస్తున్నాయి. కొత్తగా ఇంటిపంటలు సాగు చేసే వారు ఆకుకూరలతో ప్రారంభించి.. ఆ తర్వాత కూరగాయలు పెంచుకోవాలి. - విజయలక్ష్మి, సీనియర్ సిటీ ఫార్మర్, సైనిక్‌పురి, సికింద్రాబాద్ -
మేనికి వరాల జల్లు...
నిన్న మొన్నటి దాకా ఎండలకు చర్మం కమిలి, దుమ్ము పేరుకుపోయి నల్లబడి ఉంటుంది. చినుకుల వల్ల వాతావరణం చల్లబడటంతో చర్మం పొడిగా మారి పైన తెల్లటి పొలుసులుగా మృతకణాలు కనిపిస్తుంటాయి. జిడ్డుచర్మం అయితే స్వేదగ్రంథులు మూసుకుపోతాయి. దీంతో మొటిమలు, బ్లాక్, వైట్ హెడ్స్(చర్మంపై అక్కడక్కడా సన్నని పొక్కులు) వస్తుంటాయి. వేళ్ల మధ్య బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు చోటుచేసుకుంటాయి. ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే... తడిస్తే తప్పనిసరి: వర్షంలో తడవడం ఆరడం ఈ కాలం సాధారణమే! అయితే వర్షంలో తడిసి ఇంటికి చేరుకుంటే మాత్రం స్నానం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు. వర్షపు నీటిలో ఉండే ఆమ్లాలు, మలినాలు ఒంటిని మురికిగా చేస్తాయి. దీని వల్ల చర్మం, శిరోజాలు దెబ్బతింటాయి. అందుకని వానలో తడిస్తే తదుపరి స్నానం తప్పనిసరి. మలినాల తొలగింపు: రోజూ ఉదయం సాయంత్రం యాంటీబ్యాక్టీరియల్ సబ్బు/లోషన్‌ను శరీర శుభ్రతకు ఉపయోగించాలి. వీటి వల్ల చర్మంపై మలినాలు తొలగిపోవడమే గాక ఈ కాలపు బ్యాక్టీరియా దాడిని అడ్డుకోవచ్చు. చర్మంపై పొలుసులుగా కనిపించే మృతకణాల తొలగింపుకు నలుగుపిండి మేలైన ఎంపిక. నిమ్మరసం, పసుపు బ్యాక్టీరియా నాశనకారిగా పనిచేస్తాయి. చర్మంపై మలినాలను తొలగించడానికి ఆల్కహాల్(మద్యం) లేని టోనర్ ఉత్పత్తులను ఉపయోగించాలి. (క్లెన్సింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు ప్రొడక్ట్ వెనక వైపు ఇచ్చే లేబుల్ పరిశీలించాలి) చల్లగా, మబ్బుగా వాతావరణం ఉంటుంది కదా అని వదిలేయకుండా బయటకు వెళ్లడానికి ముందు సన్‌స్క్రీన్ లోషన్/ఎస్.పి.ఎఫ్ 15 నుంచి 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్‌ను సూర్యకాంతి పడే శరీరభాగాలకు కొద్ది మోతాదులో ఉపయోగించాలి. క్రీమ్‌లు కాకుండా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడితే ఈ కాలం చర్మం డీహైడ్రేట్(నిస్తేజం) కాకుండా, కాంతిమంతంగా కనిపిస్తుంది. ఈ కాలంలో చేయకూడనివి...! పదే పదే ముఖాన్ని శుభ్రపరచకూడదు. దీని వల్ల సహజమైన తేమను కోల్పోయి చర్మం పొడిబారుతుంది. ముఖం తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ని ఉపయోగించినా చర్మానికి హాని కలిగేలా రుద్దకూడదు. అధికంగా చేసే మసాజ్‌ల వల్ల చర్మంపై పొర నిర్జీవంగా తయారవుతుంది. బ్యూటీ బాటలో బామ్మ మాట సెనగపిండి, పాలు, రోజ్‌వాటర్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15-20 నిమిషాలు ఉంచి, ఆరిన తర్వాత శుభ్రపరుచు కోవాలి. ఈ మిశ్రమం మంచి క్లెన్సర్(శుభ్రపరిచే ఉత్పత్తి)లా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక సారి ఈ ప్యాక్ వేసుకోవచ్చు. పండిన బొప్పాయి గుజ్జును మేనుకు పట్టించి, మెల్లగా రుద్దితే, మలినాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది. మృదువైన చర్మానికి సలాడ్స్ శరీర భాగలలో అతి పెద్దది, అత్యంత ప్రాధాన్యం గలది చర్మం. ఇందుకు బయటి వరకే తీసుకునే సంరక్షణ చర్యలు కొంతమేరకే సహాయపడతాయి. చర్మకాంతి మెరుగవ్వాలంటే రోజువారీగా తీసుకునే ఆహారంపై అత్యవసర జాగ్రత్తలు తప్పనిసరి. పూర్తి పచ్చి ఆహారాన్ని కాకుండా ఈ కాలంలో కొద్దిగా ఉడికించిన సలాడ్స్, కూరగాయలు, ఆకుకూరల రసాలు (సూప్స్) తీసుకోవాలి. కాచివడబోసిన నీళ్లు రోజుకు 10-12 గ్లాసులు సేవించాలి. దీని వల్ల చర్మం లోపలి మలినాలు తొలగిపోయి, కాంతిమంతంగా తయారవుతుంది. పాలు, పాల ఉత్పత్తులు, నట్స్, సోయా వంటివి ఆహారంగా తీసుకుంటే చర్మం, శిరోజాల ఆరోగ్యం మెరుగవుతుంది. వేసవిలో తలెత్తిన ట్యాన్ (చర్మం నల్లబడటం) సమస్య తగ్గాలంటే బంగాళదుంప తొక్కతో చర్మంపై నెమ్మదిగా రబ్ చేస్తూ, శుభ్రపరుచుకోవాలి. టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల బాదంపప్పు పొడి, 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టిస్తూ, మెల్లగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేయడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది. రోజ్ వాటర్‌లో ముంచిన దూదితో ముఖమంతా అద్దుతూ, తుడిచేస్తే ఈ కాలంలో తలెత్తే మొటిమల సమస్య తగ్గుతుంది. - డా. షాను చర్మ వైద్య నిపుణురాలు, కాయా స్కిన్‌కేర్ క్లినిక్