నిన్న మొన్నటి దాకా ఎండలకు చర్మం కమిలి, దుమ్ము పేరుకుపోయి నల్లబడి ఉంటుంది. చినుకుల వల్ల వాతావరణం చల్లబడటంతో చర్మం పొడిగా మారి పైన తెల్లటి పొలుసులుగా మృతకణాలు కనిపిస్తుంటాయి. జిడ్డుచర్మం అయితే స్వేదగ్రంథులు మూసుకుపోతాయి. దీంతో మొటిమలు, బ్లాక్, వైట్ హెడ్స్(చర్మంపై అక్కడక్కడా సన్నని పొక్కులు) వస్తుంటాయి. వేళ్ల మధ్య బ్యాక్టీరియా చేరి ఇన్‌ఫెక్షన్లు చోటుచేసుకుంటాయి. ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే...
తడిస్తే తప్పనిసరి:
వర్షంలో తడవడం ఆరడం ఈ కాలం సాధారణమే! అయితే వర్షంలో తడిసి ఇంటికి చేరుకుంటే మాత్రం స్నానం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు. వర్షపు నీటిలో ఉండే ఆమ్లాలు, మలినాలు ఒంటిని మురికిగా చేస్తాయి. దీని వల్ల చర్మం, శిరోజాలు దెబ్బతింటాయి. అందుకని వానలో తడిస్తే తదుపరి స్నానం తప్పనిసరి.
మలినాల తొలగింపు: రోజూ ఉదయం సాయంత్రం యాంటీబ్యాక్టీరియల్ సబ్బు/లోషన్‌ను శరీర శుభ్రతకు ఉపయోగించాలి. వీటి వల్ల చర్మంపై మలినాలు తొలగిపోవడమే గాక ఈ కాలపు బ్యాక్టీరియా దాడిని అడ్డుకోవచ్చు. చర్మంపై పొలుసులుగా కనిపించే మృతకణాల తొలగింపుకు నలుగుపిండి మేలైన ఎంపిక. నిమ్మరసం, పసుపు బ్యాక్టీరియా నాశనకారిగా పనిచేస్తాయి. చర్మంపై మలినాలను తొలగించడానికి ఆల్కహాల్(మద్యం) లేని టోనర్ ఉత్పత్తులను ఉపయోగించాలి. (క్లెన్సింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు ప్రొడక్ట్ వెనక వైపు ఇచ్చే లేబుల్ పరిశీలించాలి) చల్లగా, మబ్బుగా వాతావరణం ఉంటుంది కదా అని వదిలేయకుండా బయటకు వెళ్లడానికి ముందు సన్‌స్క్రీన్ లోషన్/ఎస్.పి.ఎఫ్ 15 నుంచి 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్‌ను సూర్యకాంతి పడే శరీరభాగాలకు కొద్ది మోతాదులో ఉపయోగించాలి. క్రీమ్‌లు కాకుండా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడితే ఈ కాలం చర్మం డీహైడ్రేట్(నిస్తేజం) కాకుండా, కాంతిమంతంగా కనిపిస్తుంది.
ఈ కాలంలో చేయకూడనివి...!
పదే పదే ముఖాన్ని శుభ్రపరచకూడదు. దీని వల్ల సహజమైన తేమను కోల్పోయి చర్మం పొడిబారుతుంది. ముఖం తుడుచుకోవడానికి టిష్యూ పేపర్‌ని ఉపయోగించినా చర్మానికి హాని కలిగేలా రుద్దకూడదు. అధికంగా చేసే మసాజ్‌ల వల్ల చర్మంపై పొర నిర్జీవంగా తయారవుతుంది.
బ్యూటీ బాటలో బామ్మ మాట
సెనగపిండి, పాలు, రోజ్‌వాటర్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15-20 నిమిషాలు ఉంచి, ఆరిన తర్వాత శుభ్రపరుచు కోవాలి. ఈ మిశ్రమం మంచి క్లెన్సర్(శుభ్రపరిచే ఉత్పత్తి)లా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక సారి ఈ ప్యాక్ వేసుకోవచ్చు. పండిన బొప్పాయి గుజ్జును మేనుకు పట్టించి, మెల్లగా రుద్దితే, మలినాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.
మృదువైన చర్మానికి సలాడ్స్
శరీర భాగలలో అతి పెద్దది, అత్యంత ప్రాధాన్యం గలది చర్మం. ఇందుకు బయటి వరకే తీసుకునే సంరక్షణ చర్యలు కొంతమేరకే సహాయపడతాయి. చర్మకాంతి మెరుగవ్వాలంటే రోజువారీగా తీసుకునే ఆహారంపై అత్యవసర జాగ్రత్తలు తప్పనిసరి. పూర్తి పచ్చి ఆహారాన్ని కాకుండా ఈ కాలంలో కొద్దిగా ఉడికించిన సలాడ్స్, కూరగాయలు, ఆకుకూరల రసాలు (సూప్స్) తీసుకోవాలి. కాచివడబోసిన నీళ్లు రోజుకు 10-12 గ్లాసులు సేవించాలి. దీని వల్ల చర్మం లోపలి మలినాలు తొలగిపోయి, కాంతిమంతంగా తయారవుతుంది. పాలు, పాల ఉత్పత్తులు, నట్స్, సోయా వంటివి ఆహారంగా తీసుకుంటే చర్మం, శిరోజాల ఆరోగ్యం మెరుగవుతుంది.
వేసవిలో తలెత్తిన ట్యాన్ (చర్మం నల్లబడటం) సమస్య తగ్గాలంటే బంగాళదుంప తొక్కతో చర్మంపై నెమ్మదిగా రబ్ చేస్తూ, శుభ్రపరుచుకోవాలి.
టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల బాదంపప్పు పొడి, 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టిస్తూ, మెల్లగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేయడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది.
రోజ్ వాటర్‌లో ముంచిన దూదితో ముఖమంతా అద్దుతూ, తుడిచేస్తే ఈ కాలంలో తలెత్తే మొటిమల సమస్య తగ్గుతుంది.
- డా. షాను
చర్మ వైద్య నిపుణురాలు, కాయా స్కిన్‌కేర్ క్లినిక్
మేనికి వరాల జల్లు...
Published Wed, Aug 6 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement
Advertisement