సీజన్‌లో తినేవన్నీ ఇంటిపంటలే!
ఇంటిపంటల పెంపకం హాబీ మాత్రమేనా? ఇంటి అవసరాల కోసం సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లకు ఆధారపడేంతగా పండించుకోవచ్చా? ఇంటిపంటలు పండించే వారికి ఉన్న ఆసక్తి, చోటు, తీరిక ఎంత ఉందన్న దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. గాఢమైన ఆసక్తి, అవగాహన ఉంటే ఇంటిపంటల ఉత్పాదక ఎంత చక్కగా ఉంటుందో సికింద్రాబాద్ సైనిక్‌పురి నివాసి విజయలక్ష్మి ‘సాక్షి’తో చెప్పిన మాటలనుబట్టి అర్థం చేసుకోవచ్చు.
‘సీజన్‌లో మా పెరటిలో పండించే ఆకుకూరలు, కూరగాయలనే మా కుటుంబం, మా ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు వాడుకుంటున్నాం. మిగిలిన వాటిని సేంద్రియ సంతల్లో అమ్ముతున్నాం. ఖర్చులు పోను అదనంగానే ఆదాయం వస్తోంది. సంపాయించిన డబ్బుతోనే పీవీసీ పైపులతో షేట్‌నెట్ పందిరి వేయించా. దీంతోపాటు మా పనివాళ్ల పిల్లల చదువుల కోసం కూడా ఈ డబ్బు వెచ్చిస్తున్నాం’ అన్నారామె సంతృప్తిగా! సంప్రదాయ పంటలతో పాటు ఆధునిక పంటలనూ సాగు చేయడం ఆమె ప్రత్యేకత.
విజయలక్ష్మి ఇంటి ఆవరణలో 400 చదరపు అడుగుల స్థలం ఉంది. జీవశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేసి విశ్రాంత జీవితం గడుపుతున్న ఆమెకు చెంచాడు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో ఇంటి పంటలు పండించడంపై లోతైన అవగాహనతోపాటు కొన్ని ఏళ్ల అనుభవం కూడా ఉంది. మైక్రో స్ప్రింక్లర్లను అమర్చడం వల్ల సాధా రణం కన్నా 4, 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమో దవుతున్నా ఇంటిపంటలు
చక్కగా పెరుగుతున్నాయి.
సలాడ్స్‌లో వినియోగించే లెట్యూస్, పాక్చాయ్(చైనీస్ క్యాబేజి) వంటి ఖరీదైన ఆకుకూరలను ఎత్తుమడుల్లో పెంచుతుండడం విశేషం. రెండు రకాల లెట్యూస్‌ను ఆమె సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 90 రోజులు. 4 వారాల నారును మడుల్లో నాటేసి పెంచుతున్నారు. చదరపు అడుగుకు 5 మొక్కల చొప్పున నాటుతున్నారు. నాటిన 50-60 రోజుల్లో కోతకొస్తాయన్నారు. అధిక పోషకాలనిచ్చే ఎర్ర తోటకూరతోపాటు కొత్తిమీర, గోంగూర, పాలకూర, చుక్కకూర, వంగ, క్యాబేజి, ఆనప, పొట్ల, చిలగడదుంప, మిరప తదితర పంటలను ఆమె సాగు చేస్తున్నారు.
6్ఠ4 మడిని సాగుకు సిద్ధం చేసేటప్పుడు 6-10 కిలోల అమృత్‌ఖాద్ అనే సొంతంగా తయారుచేసుకున్న సేంద్రియ ఎరువును వేస్తారు. ఆకుకూరల సాగుకు ఈ బలం సరిపోతుంది. కూరగాయలు, తీగజాతి పాదులకు (వర్మీ కంపోస్టు కిలో+కొబ్బరిపొట్టు కిలో+ పావుకిలో మట్టి కలిపిన) కంపోస్టు మిశ్రమాన్ని మొక్కకు 50-100 గ్రాముల చొప్పున నెలకోసారి వేస్తారు. పిందె దశలో ఉన్నప్పుడు స్లో రిలీజింగ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మిశ్రమాన్ని మొక్కకు 25 నుంచి 50 గ్రాముల వరకు ఒకసారి వేస్తారు. వీటితోపాటు సస్యరక్షణకు స్వయంగా తయారు చేసుకున్న ‘వర్మీటీ’ని అడపా దడపా పిచికారీ చేస్తున్నారు. చీడపీడల బెడద లేకుండా చూడ డంతోపాటు అదనపు పోషకాల నందించడం వర్మీటీ ప్రత్యేకత అని ఆమె చెప్పారు.
గ్రోబాగ్స్.. కంటెయినర్లలోనూ..
కేవలం మడుల్లోనే కాకుండా.. యూవీ ట్రీటెడ్ గ్రోబాగ్స్, కుండీలు, పాత బకెట్లు వంటి కంటెయినర్లలోనూ అనేక పంటలు పండిస్తున్నారు. గ్రోబాగ్స్‌లో 3 నెలల క్రితం విజయలక్ష్మి నాటిన బెల్ పెప్పర్స్ మొక్కలు పెద్ద కాయలతో కనువిందు చేస్తున్నాయి. విస్తారంగా అల్లుకొని కాయలు కాస్తున్న నాటు ఆనప పాదు చూడముచ్చటగా ఉంది. అడుగు వెడల్పు, అడుగు ఎత్తు ఉన్న గ్రోబ్యాగ్‌లోనే ఈ ఆనప పాదు పెరుగుతోంది.
మైక్రో గ్రీన్స్, గోధుమ గడ్డి..
సలాడ్స్‌లో సకల పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలంటే మైక్రో గ్రీన్స్‌ను వాడుకోవడం మంచిదని విజయలక్ష్మి చెబుతున్నారు. 25 రకాల ఆహార పంటల గింజలను రెండు అంగుళాల ఎత్తు వరకు పెంచి సలాడ్స్‌లో వాడుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆమె అన్నారు. క్యాంటీన్ పార్సిళ్లలో వచ్చే చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సులను వినియోగిస్తూ గోధుమ గడ్డిని కూడా పెంచుతున్నారు. పెరటి స్థలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ.. ఇంటిపంటల సాగుపై జీవ ఆర్గానిక్స్ శ్యామ్ పెనుబోలు(9849514854)తో కలసి ఔత్సా హికులకు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారామె. నేలతల్లిపై ప్రేమతో స్ఫూర్తిదాయకమైన జీవనం సాగిస్తున్న ఆదర్శ సిటీ ఫార్మర్ విజయలక్ష్మికి ఆ..కు..ప..చ్చ..ని వందనాలు!
- పంతంగి రాంబాబు, ఇంటిపంట డెస్క్
ఫొటోలు: కరుణాకర్
స్లో రిలీజింగ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అవసరమే!
ఇంటిపంటలకు వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులు నెల రోజులకు మించి పోషకాల నందించలేవు. వేసిన రెండు నెలల వరకు నిదానంగా పోషకాలనందించే స్లో రిలీజింగ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడకం అవసరమేనని అనుభవపూర్వకంగా గ్రహించాను. సీ వీడ్ గ్రాన్యూల్స్, రాక్ ఫాస్పేట్, వేపపిండి, వేరుశనగ/ కానుగ/ఆముదం/సీతాఫలం గింజల పిండి సమపాళ్లలో కలిపి వాడుతుంటే మంచి ఫలితాలొస్తున్నాయి. కొత్తగా ఇంటిపంటలు సాగు చేసే వారు ఆకుకూరలతో ప్రారంభించి.. ఆ తర్వాత కూరగాయలు పెంచుకోవాలి.
- విజయలక్ష్మి, సీనియర్ సిటీ ఫార్మర్,
సైనిక్‌పురి, సికింద్రాబాద్