Summer Care Health Tips: Salads In Your Diet Will Help You, Check Inside - Sakshi
Sakshi News home page

Summer Care Tips: వేసవిలో సలాడ్స్‌ తిన్నారంటే!

Published Sun, Apr 10 2022 10:17 AM | Last Updated on Sun, Apr 10 2022 11:37 AM

Summer Care Health Tips: Salads In Your Diet Will Help You - Sakshi

కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం ఇంటిని, ఒంటినీ ఆరోగ్యంగా ఉంచుతుందనేది పెద్దల మాట. ఈ మాటను అనుసరించి వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో సలాడ్స్‌ తినడం మేలు చేస్తుంది. వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్‌ను తయారు చేసుకోవచ్చు. గ్రిల్డ్‌ వెజిటబుల్స్, గ్రిల్డ్‌ వెజిటబుల్‌ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్‌ వెజిటబుల్‌ పనీర్‌ సలాడ్స్‌ వంటివి చేసుకోవచ్చు.

హోల్‌ గ్రెయిన్‌ సలాడ్స్‌: మొక్కజొన్న, మొలకెత్తిన పెసలు, శనగలు, కూరముక్కలు.. వంటివాటిని కలిపి తీసుకుంటే మంచిది. అలాగే మొలకెత్తిన గింజలు, బీన్స్, తరిగిన కూరముక్కలు, పండ్లతో కలిపి సలాడ్‌లా తీసుకుంటే కాల్షియం, ప్రొటీన్లు ఒంటికి అందుతాయి.

ఇందులో తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన కూరలతో కలపడం వల్ల కాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు. ఇక సలాడ్స్‌తో పాటు దోసకాయతో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది.

గ్రీక్‌  రైస్‌ సలాడ్‌ తయారీ:
కావలసిన పదార్ధాలు: అన్నం – 3 కప్పులు, పుట్ట గొడుగులు – కప్పు (గంటసేపు నీళ్లలో నానబెట్టి, నీరు ఒంపేసి చిన్న చిన్న ముక్కలు చేయాలి), టొమాటో – 1 (ముక్కలు చేయాలి), కీర దోస చక్రాలు – అర కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, చీజ్‌ – పావు కప్పు, నిమ్మ రసం – ఒక టేబుల్‌ స్పూను, మిరియాల పొడి – అర టీ స్పూను

తయారీ: గిన్లెలో అన్నం, మిగిలిన పదార్థాలు వేసి బాగా మూత పెట్టాలి.
ఫ్రిజ్‌లో సుమారు గంటసేపు ఉంచి తీసేయాలి.
బౌల్స్‌లో సర్వ్‌ చేసే ముందు, కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్‌ చేసుకుంటే సరి!

క్యాబేజీ సలాడ్‌  విత్‌ ఎ క్రంచ్‌
కావలసిన పదార్ధాలు: క్యాబేజీ తరుగు –  కప్పు, నూడుల్స్‌ – ఒక ప్యాకెట్, నువ్వులు – ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 4 (మెత్తగా చేయాలి), బాదం పప్పులు – అర కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి)డ్రెసింగ్‌ కోసంసోయా సాస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, వెనిగర్‌ – పావు కప్పు, పంచదార – అర కప్పు, రిఫైన్డ్‌ ఆయిల్‌ – పావు కప్పు, మిరియాల పొడి – పావు టీ స్పూను, అల్లం తురుము – పావు టీ స్పూను, ఆలివ్‌ ఆయిల్‌ – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ: పాన్‌ను స్టౌ మీద ఉంచి వేడయ్యాక సోయా సాస్, వెనిగర్, పంచదార, రిఫైన్డ్‌ ఆయిల్, మిరియాల పొడి, అల్లం తురుము వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి చల్లారాక ఫ్రిజ్‌లో సుమారు రెండు గంటలు ఉంచాలి
ఒక చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నూనె వేసి.. అది వేడెక్కిన తర్వాత నూడుల్స్, నువ్వులు, వెల్లుల్లి ముద్ద వేసి పదార్థాలన్నీ బంగారు రంగులోకి మారేవరకు కలిపి దింపేయాలి
ఒక పెద్ద బౌల్‌లో నూడుల్స్‌ మిశ్రమం, క్యాబేజీ తరుగు వేసి కలపాలి
ఫ్రిజ్‌లో నుంచి డ్రెసింగ్‌ మిశ్రమం బయటకు తీసి, ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి, బాదం పప్పులతో అలంకరించి చల్లగా అందించాలి.

త్రీ బీన్‌  సలాడ్‌
కావలసినవి:  నానబెట్టిన అలసందలు – ఒక కప్పు ; నానబెట్టిన చిక్కుడు గింజలు; – ఒక కప్పు ; నానబెట్టిన సెనగలు – ఒక కప్పు ; ఉల్లి తరుగు – అర కప్పు ; కొత్తిమీర తరుగు – ఒక కప్పు ; పంచదార – పావు కప్పు ; ఆలివ్‌ ఆయిల్‌ – 3 టేబుల్‌ స్పూన్లు ; ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్లు; నల్ల మిరియాలు – పావు టీ స్పూను; వెనిగర్‌ – 2 టీ స్పూన్లు
తయారీ: ఒక పెద్ద పాత్రలో మూడు రకాల గింజలూ వేసి బాగా కలపాలి ∙ కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి బాగా కలపాలి ∙ వేరొక బౌల్‌లో వెనిగర్, పంచదార, ఆలివ్‌ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి గింజలున్న బౌల్‌లో వేసి కలిపి, ఫ్రిజ్‌లో నాలుగైదు గంటలు ఉంచి, బయటకు తీసి, అందించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement