మైక్రోప్లాస్టిక్స్‌ కలిసిన నీటిని తాగితే కోలన్‌ క్యాన్సర్, ప్రొస్టేట్‌ క్యాన్సర్.. ఇంకా.. | Summer Health Tips: Harmful Effects Of Drinking Water In Plastic Bottles Dos Donts | Sakshi
Sakshi News home page

మైక్రోప్లాస్టిక్స్‌ కలిసిన నీటిని తాగితే కోలన్‌ క్యాన్సర్, ప్రొస్టేట్‌ క్యాన్సర్.. ఇంకా..

Published Sat, Apr 15 2023 1:46 PM | Last Updated on Sat, Apr 15 2023 1:54 PM

Summer Health Tips: Harmful Effects Of Drinking Water In Plastic Bottles Dos Donts - Sakshi

రాగి బాటిల్‌లో నీళ్లు తాగడం శ్రేయస్కరం

Summer Health Tips: అసలే ఎండాకాలం.. దాహం వేస్తుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడంటే కావలసినప్పుడల్లా నీళ్లు తాగుతుంటాం. మరి బయటికి వెళ్లేటప్పుడు? అందులో ఆలోచించేదేముంది... ఒక వాటర్‌ బాటిల్‌ తీసుకెళతాం.. అంతేకదా అని సింపుల్‌గా చెప్పేస్తాం.

అయితే ఆ బాటిల్‌ దేనితో తయారు చేసింది... అంటే నూటికి తొంభై పాళ్లు ‘ప్లాస్టిక్‌ బాటిల్‌’ అనే సమాధానం వస్తుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎంత ఉపయోగమో, ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీళ్లు తాగడం అంత ప్రమాదం. అది ఎండాకాలం అయితే కనక ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ ఏమిటా నష్టాలు అంటారా? అదే చూద్దాం.. 

ప్లాస్టిక్‌ వాడకం ఎందుకంటే!
ప్లాస్టిక్‌ వాడకం పర్యావరణానికి ముప్పు అని పదే పదే చెబుతున్నా కూడా ప్లాస్టిక్‌ ఇంకా వాడకంలోనే ఉండటానికి కారణం ఏమిటంటే, దానిని క్యారీ చేయడం చాలా సులువు.
నిర్వహించడం ఇంకా సులువు. ఒకవేళ ఎక్కడైనా పెట్టి మరచిపోయినా పెద్ద ఖరీదు ఉండదు కాబట్టి దిగులు పడనక్కరలేదు. అందువల్ల పర్యావరణ ప్రేమికులు ఎంతగా నెత్తీ నోరు బాదుకుంటున్నా, ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించే విషయంలో వెనకబడవలసి వస్తోంది. 

ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ అయినా, భారీ ప్లాస్టిక్‌ కంటైనర్లు అయినా వాటి నుంచి నీరు తాగడం ప్రమాదకరం. ముఖ్యంగా ఎండలో ఎక్కువగా ఉంచిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌లోని నీటిని అసలు తాగకూడదు.

పరిశోధన ప్రకారం..
ప్లాస్టిక్‌ బాటిల్స్‌ మీద ఎండ పడితే.. అవి మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ నీటిని తాగితే.. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడే.. ఎండోక్రైన్‌ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇలాంటి నీటిని ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయాన్ని కూడా పాడు చేస్తుంది.

ఎండలో ఉండే.. ప్లాస్టిక్‌ బాటిల్‌ నుంచి డయాక్సిన్‌ లాంటి టాక్సిన్‌ నీటిలోకి విడుదల అవుతుంది. ఈ డయాక్సిన్‌ నీటిని తాగితే.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్‌ బాటిల్‌ నీళ్లు తాగితే.. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మగవారిలో శుక్ర కణాల సంఖ్య కూడా తగ్గవచ్చు. 

బాటిల్‌ వాటర్‌లో మైక్రో ప్లాస్టిక్స్‌ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
మైక్రోప్లాస్టిక్స్‌ కలిసిన నీటిని తాగితే పొత్తి కడుపునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యం, పీసీఓఎస్, ఒవేరియన్‌ సమస్యలు, బ్రెస్ట్‌ క్యాన్సర్, కోలన్‌ క్యాన్సర్, ప్రొస్టేట్‌ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రావొచ్చు. 

ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్‌ బాటిళ్లకు ఎండ తగిలితే.. అస్సలే తాగొద్దు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బాటిళ్లను కొంతమంది అలానే ఉపయోగిస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. ఇది ఇంకా అపాయకరమైనది. ఇలా అస్సలు చేయొద్దు ఎప్పుడూ. 

ఏం చేయాలి మరి? 
ప్లాస్టిక్‌ బాటిల్స్‌ అంతగా వాడుకలోకి రాని రోజుల్లో పెద్దవాళ్లు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు స్టీలు లేదా ఇత్తడి మరచెంబులు తీసుకు వెళ్లేవారు. ఇప్పుడు కూడా అదే మంచిది. అందుకు తగ్గట్టు ఇప్పుడు మార్కెట్‌లో రకరకాల సైజుల్లో, ఆకారాలలో రాగి, స్టీలు, ఇత్తడి బాటిల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాస్తంత ఖరీదు ఎక్కువైనా, ప్లాస్టిక్‌ వాడకం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో పోల్చుకుంటే ఫరవాలేదనిపిస్తుంది. 

ప్లాంట్‌ బేస్డ్‌ బాటిల్స్, గాజుసీసాలు, అల్యూమినియం వాటర్‌ క్యాన్స్‌ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మనం వాడకం మొదలు పెడితే ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి.  

చదవండి: ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా
ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement