అమ్మాయిలను ఆకర్షించాలంటే....
సిడ్నీ: అమ్మాయిలను ఆకర్షించేందుకు యువకులు అనేక విధాలుగా తంటాలు పడుతుంటారు. కొందరు రకరకాల రీతుల్లో హేర్ కట్ చేసుకొని, స్టైలిష్‌గా దుస్తులు వేసుకుంటారు. మరి కొందరు నీట్‌గా గడ్డం గీసుకొని గుభాలించే గులాబీ అత్తరును ఒళ్లంతా పూసుకుంటారు. మరికొందరు నీవులేక నేను లేను...నేను లేక నీవు లేవు...అని కూనిరాగాలు కూడా తీస్తారు. ఇక అలాంటి అగచాట్లు మగవాళ్లకు అక్కర్లేదని, మగవాళ్ల చెమట నుంచి వచ్చే సువాసనలకు అమ్మాయిలు పడిపోతారని, అందుకు ఓ చిట్కా కూడా ఉందని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు.
శరీరం నుంచి వెలువడే చెమట ఆడవాళ్లను ఆకర్షించే సువాసనలను వెదజల్లాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్. మంచి ప్రొటీన్లు కలిగిన కూరగాయల సలాడ్లు, పండ్లు తీసుకోవాలి. వీలైనంత మేరకు కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. ఇవి తిన్నవారి మగవాళ్ల చెమట నుంచి సుమధుర సువాసనలు వెలువడుతాయట. ఆ వాసనను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట. కోడి, మేక మాంసం తినే అలవాటున్న నాన్ వెజిటేరియన్ మగవాళ్ల నుంచి కూడా ఇలాంటి సువాసనలే వెలువడుతాయట. ఏదేమైనా కార్బోహైరేట్లను మాత్రం గణనీయంగా తగ్గించాలట. కార్బోహైరేట్లు ఎక్కువగా ఉన్న మగవారి చెమట కంపు కొడుతుందట. ఈ విషయాన్ని సిడ్నీలోని మాక్వారీ యూనివర్శిటీకి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ ఐయాన్ స్టీఫెన్ బృందం తొమ్మిది మంది ఆడవాళ్లు, 43 మంది మగవాళ్లపై పరిశోధన జరిపి తేల్చారు. ‘ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ బిహేవియర్’ అనే పత్రికలో తమ పరిశోధన వివరాలను వివరించారు.
స్టీఫెన్ ఈ ప్రయోగం కోసం ముందుగా 43 మంది యువకుల నుంచి వారి చెమటను సేకరించారు. వాటిలో ఏ చెమట మధురంగా ఆస్వాదించేలా ఉందో, ఏ చెమట శాంపిల్ కంపుకొడుతూ అసహ్యించుకునేలా ఉందో కనుక్కోవాల్సిందిగా పరీక్ష పెట్టారు. తొమ్మిది మంది మహిళులు అభిప్రాయాలను తీసుకొని 43 మంది చెమటకు గ్రేడ్లు కేటాయించారు. ఆశ్చర్యంగా కూరగాయ సలాడ్లు, పండ్లు ఎక్కువగా తీసుకొని, కార్బోహైడ్రేట్స్‌ను తక్కువగా తీసుకునే వారి చెమటకే ఆ మహిళంతా ఓటేశారు. తక్కువ కార్బొహైడ్రేట్లు తీసుకొని మాంసం ఎక్కువగా తీసుకునే వారి చెమటను కూడా కొంచెం తక్కువగా అదే గ్రేడ్‌ను కేటాయించారు.
స్టీఫెన్ బృందం స్పెక్ట్రోమీటర్ ద్వారా మగవాళ్ల చెమటోవున్న ‘కరోటినాయిడ్స్’ను లెక్కించారు. కరోటినాయిడ్స్ ఎక్కువగా వున్న మగవాళ్ల చెమటనే మహిళలు గ్రేడ్ వన్‌గా నిర్ణయించారు. కూరగాయలు, పండ్లు, మాంసం ఎక్కువగా తీసుకునే వారిలోనే కరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయని డాక్టర్ స్టీఫెన్ తెలిపారు. ప్రోటీన్లకన్నా కార్బోహైడ్రేట్లు ఎక్కువ తీసుకున్న వారి చెమట వాసనకు ఆడవాళ్లు ముక్కులు మూసుకున్నారు. కంపు అంటూ ఛీదరించుకున్నారు. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా తీసుకునే వారిలో కరోటినాయిడ్స్ తక్కువగా ఉంటుందట. అందుకని వారి నుంచి వెలువడే చెమట వాసన బాగుండదట.
అనంతరం స్టీఫెన్ బృందం చెమట సేకరించిన 43 మంది అహార అలవాట్ల గురించి ముందుగానే సేకరించిన సమాచారంతో ఆడవాళ్లు కేటాయించిన గ్రేడ్లను పోల్చి చూశారు. గ్రేడ్లకు, మగవాళ్ల ఆహారపు అలవాట్లకు సరిపోయిందని ఈ పరిశోధన ద్వారా తేల్చారు. అయితే ఇదే ప్రయోగం ఆడవాళ్ల చెమటపై కూడా జరపాలని అనుకుంటున్నామని స్టీఫెన్ బృందం తెలిపింది. మగవాళ్ల వద్ద నుంచి వచ్చే ఒకవిధమైన వాసన ఆడవాళ్లను ఎక్కువగా ఆకర్షిస్తుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చారు.