సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలకు అలవాటైన సిటీజనులు.. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు అందించే కూరగాయలపై విముఖత చూపుతున్నారు. కూరగాయల తలసరి వినియోగంలో వెనుకంజలో ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. మనిషి ఆరోగ్యానికి, మెరుగైన జీవన క్రియలకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభించే కూరగాయలను ఆహారంగా తీసుకోవడంలోనగరవాసులు వెనుకంజలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి రోజువారీ ఆహారంలో 325 గ్రాముల మేర కూరగాయలు తీసుకోవాలి. కానీ సిటీలో ఒక్కో వ్యక్తి 269 గ్రాముల కూరగాయలనే వినియోగిస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అంటే జాతీయ సగటుతో పోలిస్తే గ్రేటర్‌లో 56 గ్రాముల కూరగాయలను తక్కువగా వినియోగిస్తున్నారు.
ఈ అధ్యయనం ప్రకారం 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసిస్తున్న వారికి ఏటా సుమారు 7,22,186 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతాయి. అంటే నెలకు 60,182 మెట్రిక్ టన్నులు, రోజుకు 2,006 మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. అయితే రాజధానికి ఆనుకొని ఉన్న పొరుగు జిల్లాల నుంచి నగరానికి ఏటా కేవలం 6,89,363 మెట్రిక్ టన్నుల కూరగాయలే దిగుమతి అవుతున్నాయి. డిమాండ్ కన్నా 32,823 మెట్రిక్ టన్నుల కూరగాయల కొరత ఉంది. ఈ కొరతను తీర్చేందుకు సిటీకి ఆనుకొని ఉన్న పొరుగు జిల్లాల్లో అదనంగా మరో 41,840 ఎకరాల్లో కూరగాయలను పండించాల్సి ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుంచి నగరానికి సరఫరా అవుతోన్న కూరగాయలు సిటీజనుల అవసరాలకు సరిపోవడం లేదు. ప్రస్తుతం గ్రేటర్‌కు అవసరమైన కూరగాయలకు దిగుమతులే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. కర్నాటకలోని బీదర్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఆలుగడ్డలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉల్లిగడ్డలు, మునగకాయలు, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి దిగుమతి అవుతున్నాయి.
ప్రత్యామ్నాయాలివే..
♦ నగరానికి ఆనుకొని ఉన్న పొరుగు జిల్లాల్లో క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలి.
♦ కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి.
♦ షేడ్‌నెట్స్, పాలీహౌస్‌లు, డ్రిప్, స్ప్రింక్లర్లు వంటి వాటికి మరింత సబ్సిడీ అందించాలి.
♦ మార్కెట్ సదుపాయం, కోల్డ్ స్టోరేజీల సదుపాయం కల్పించాలి.
♦ పంట విత్తే సమయంలోనే గిట్టుబాటు ధరలు ప్రకటించాలి. మార్కెట్లలో దళారులను పూర్తిగా నిరోధించాలి.
కొరతకు కారణాలివీ..
♦ నగరానికి ఆనుకొని ఉన్న మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ భూములు రియల్ వెంచర్లుగా మారడం.
♦ రైతులు యాంత్రీకరణ, ఆధునిక పద్ధతులు అవలంభించకుండా సంప్రదాయ విధానంలో కూరగాయలు సాగు చేస్తుండడంతో అధిక దిగుబడులు రావడం లేదు. దీంతో కూరగాయల సాగు లాభసాటిగా లేక మధ్యలోనే వదిలేస్తున్నారు.
♦ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం మరో కారణం. పంట విత్తే సమయంలో అధిక ధరలు, పంట కోసే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడం జరుగుతోంది.
♦ మార్కెట్ల లేమి, రవాణా పరమైన ఇబ్బందులు.
♦ కోల్డ్‌స్టోరేజీ యూనిట్లు అందుబాటులో లేకపోవడం.
♦ వ్యవసాయ కూలీలు దొరక్కపోవడం.
Comments
Please login to add a commentAdd a comment