కూర ‘గాయాలు’
కూర ‘గాయాలు’
Published Mon, Jul 3 2017 4:36 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
చుక్కల్లో ధరలు
వినియోగదారుల బెంబేలు
పది రోజుల వ్యవధిలో దాదాపు రెట్టింపు
కొద్ది రోజులు ఇంతేనంటున్న వ్యాపారులు
మండపేట /కాకినాడ రూరల్ : కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పది రోజుల వ్యవధిలో దాదాపు రెండింతలకు పైగా పెరిగి దడపుట్టిస్తున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతుంటే కూరగాయలు వాటి పక్కన చేరాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూరగాయల పంటలకు అపార నష్టం వాటిల్లడమే ఇందుకు కారణమని వ్యాపారులు అంటున్నారు.
లంక భూముల్లోను, మెట్ట ప్రాంతంలోను కూరగాయలు సాగుచేస్తుంటారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కడియం, సీతానగరం, కె గంగవరం, కపిలేశ్వరపురం మండలాల్లోని లంక భూముల్లో సుమారు 20 వేల ఎకరాల్లో దొండ, బెండ, బీరకాయ, చిక్కుడు, కాకర, మునగ, టమోటా, కాలీఫ్లవర్, ఆనబ తదితర పంటలు సాగవుతున్నాయి. మెట్ట, చాగల్నాడు ప్రాంతాల్లోని వేలాది ఐదు వేలకు పైగా ఎకరాల్లో అన్ని రకాల కూరగాల సాగు జరుగుతోంది. కూరగాయల ధరలు భారీగా పెరగడానికి వేసవి ఉష్ణోగ్రతలే కారణమని వ్యాపారులు అంటున్నారు. జూన్ మొదటి వారం వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండటం, గతంతో పోలిస్తే ఈసారి 45 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావడం జిల్లాలో సాగయ్యే ఆయా కూరగాయల పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఎండవేడి తాళలేక మొక్కలు మాడిపోవడంతో ప్రస్తుతం కూరగాయలు దొరకడం గగనంగా మారిందని రైతులు, వ్యాపారులు అంటున్నారు. కర్ణాటక, మహరాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే ఉల్లిపాయలు, బంగాళదుంప, బీట్‌రూట్, అల్లం, క్యాబీజీ తదితర రకాల ధరల్లో పెద్దగా మార్పు లేనప్పటికి స్థానికంగా సాగయ్యే వంకాయలు, బెండకాయలు, దొండ, బీరకాయ మొదలైన కాయగూరలు ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. పది రోజులు క్రితం వరకు ఉన్న ధరలు దాదాపు రెట్టింపై వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. తొలకరి వర్షాలతో వేసిన కూరగాయల పంటలు కొద్ది రోజుల్లో దిగుబడులు వచ్చినా, జూలైలో గోదావరికి వరదలు రానుండటంతో లంక భూములు ముంపునకు గురై పంటలకు నష్టం వాటిల్లే అవకాశముండటం ఆందోళనకు గురిచేస్తోంది. మెట్టలోని కూరగాయల పంటలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుముఖం పట్టే అవకాశముందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ప్రైవేటు మార్కెట్‌లో ధరలు ఇలా ఉంటే తోపుడు బండ్లు, సైకిళ్లపై అమ్మకాలు చేసే వారి వద్ద ఈ ధరలు మరింత అధికంగా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరికొద్ది రోజులు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని వ్యాపారస్తులు చెబుతున్నారు.
Advertisement
Advertisement