అరటి ధర హాసం
అరటి ధర హాసం
Published Sun, Apr 9 2017 10:22 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM
జోరందుకున్న ఎగుమతులు
మార్కెట్‌యార్డులో సందడి
రైతుల్లో ఆనందం
రావులపాలెం : లారీల సమ్మెతో కొద్ది రోజులుగా ఎగుమతులు తగ్గి ఢీలా పడిన అరటి రైతులు తాజాగా ధరలు పెరగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డు నుంచి ఎక్కువ శాతం గెలలు ఎగుమతయ్యే ఒరిశా రాష్ట్రంలో ఈ నెల 14న సంక్రాంతి పండుగ నేపథ్యంలో అక్కడ వ్యాపారులు కొనుగోళ్ళుకు పోటీ పడుతున్నారు. దీంతో ధరలు ఊపందుకున్నాయి. ఒడిశాలో సంక్రాంతికి మామిడి, పెండ్లంతో పాటు అరటి పండ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా కొత్తగా పెళ్లయిన దంపతులు వీటిని దేవాలయాల్లో సమర్పించడం ఆనవాయితీ. దీంతో వ్యాపారులు రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున గెలలు కొనుగోలు చేసి ఒడిశాకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు ఎగుమతులు పెరిగాయి.
మన రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో శుభకార్యాలు, పూజలు ప్రసుత్తం ఎక్కువగా ఉండటంతో అరటి గెలలకు డిమాండ్ పెరిగింది. యార్డు పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల్లో నిన్నమొన్నటి వరకూ లారీల సమ్మెతో గెలలు కోయని రైతులు పెరిగిన ధరతో కోతలు ముమ్మరం చేశారు. స్థానిక వ్యాపారులతో పాటు తమిళనాడు, ఒడిశా నుంచి కూడా వ్యాపారులు కొనుగోళ్ళుకు రావడంతో అరటి గెలలకు మంచి ధర లభిస్తోంది. ప్రస్తుతం యార్డు పరిధిలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట, కపిలేశ్వరపురం, మండపేట, పి.గన్నవరం, పెనుగొండ, పెరవలి, మార్టేరు మండలాల నుంచి రోజుకు 10 నుంచి 20 వేలు గెలలను రైతులు అమ్మకానికి తీసుకువస్తున్నారు. దీంతో తమిళనాడు, ఒడిశా, బీహర్ తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 15 నుంచి 20 లారీల సరుకు నిత్యం రవాణా అవుతోంది. రోజుకు సుమారు రూ.15 నుంచి 20 లక్షల వ్యాపారం సాగుతోంది. ప్రస్తుతం మార్కెట్ జోరును బట్టి ఈ నెలాఖరు వరకూ ఇదే రీతిలో ధరలు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ఎగుమతులు పెరిగాయి
నిన్నమొన్నటి వరకూ లారీల సమ్మెతో ఎగుమతులు తగ్గి కొనుగోళ్లు అంతమాత్రంగా చేసేవాళ్లం. ప్రసుత్తం ఒరిస్సాతో పాటు తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వినియోగం పెరడంతో ధర పెరిగింది. దీంతో ఎగుమతులు జోరందుకున్నాయి. మరో రెండు వారాల పాటు ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది.
- కోనాల చంద్రశేఖరరెడ్డి, వ్యాపారి.
Advertisement
Advertisement