
ఇకపై తీపి తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల మధ్య చక్కెర మిల్లల నిర్వహణ వాటి యజమానులకు భారంగా మారింది. ఈ నేపధ్యంలో చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు కనీసం రూ. 42కి పెంచాలని నేషనల్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఫెడరేషన్ (ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్)ప్రభుత్వాన్ని కోరింది.
మరోవైపు అక్టోబర్ ఒకటి నుండి ప్రారంభమయ్యే 2024-25 సీజన్‌కు చక్కెర కనీస అమ్మకపు ధర (ఎంఎస్‌పీ) ను పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చక్కెర ధరను పెంచినట్లయితే, దాని ప్రభావం రిటైల్ మార్కెట్‌లో కనిపిస్తుంది. దీంతో చక్కెర ధర పెరిగేందుకు అవకాశముంది. చక్కెర ధర కిలోకు రూ.3 నుంచి 4 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
2019 నుండి చెరకు కనీస అమ్మకపు ధర కిలోకు రూ. 31 వద్ద కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం చెరకు రైతులకు చెల్లించే న్యాయమైన,లాభదాయక ధర (ఎఫ్‌ఆర్‌పీ)ని పెంచింది. ఎన్‌ఎఫ్‌సిఎస్‌ఎఫ్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ చెరకు కనీస అమ్మకపు ధరను సర్దుబాటు చేయడం అవసరమని, చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు రూ.42కి పెంచితే చక్కెర పరిశ్రమ లాభసాటిగా మారుతుందని పేర్కొన్నారు.