టమాటా.. ధర వింటే మంట..
♦ పండ్లతో పోటీ పడుతున్న రేటు
♦ రెండు వారాలుగా చుక్కల వీధుల్లో విహారం
♦ కిలో రూ.100కు చేరిన వైనం
♦ బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు
♦ జిల్లాలో పడిపోయిన కొనుగోళ్లు
♦ గణనీయంగా తగ్గిన దిగుమతులు
మండపేట : టమాటాకూ ఓ రోజొచ్చింది. నాడు అమ్మిన రూపాయి పక్కనే రెండు సున్నాలు చేర్చుకుని పండ్లతో పోటీ పడుతోంది. కొనుగోలు చేయాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోయేలా దీని ధర వికటాట్టహాసం చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో యాపిల్ ధర రూ.100, దానిమ్మ రూ.80, ద్రాక్ష రూ.80 ఉండగా.. దాదాపు ప్రతి ఒక్కరూ నిత్యావసరంగా వినియోగించే టమాటా కూడా రూ.100 రికార్డు స్థాయి ధరతో వాటి సరసన చేరిపోయింది.దాదాపు ప్రతి ఒక్కరూ వంటకాల్లో నిత్యం టమాటాను అధికంగా వినియోగిస్తుంటారు. ఇళ్లలో కూరలు, రసం, సాంబారు, వివిధ పచ్చళ్ల తయారీలో టమాటా వినియోగిస్తారు. అలాగే, హోటళ్లు, రెస్టారెంట్లలో కూరలతోపాటు చెట్నీలు, టిఫిన్ల తయారీలో వీటి వినియోగం ఎక్కువే. ఈసారి చిత్తూరు జిల్లాలో దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతోపాటు, ఉన్న పంట తమిళనాడుకు ఎక్కువగా ఎగుమతి జరుగుతోంది. ఆ ప్రభావంతో టమాటా ధర పెరుగుతోందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు.
గతంలో చిత్తూరు జిల్లాలో కిలో ఒక రూపాయి మాత్రమే పలికిన రోజులున్నాయి. రెండు వారాల క్రితం వరకు జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, అమలాపురం తదితర మార్కెట్లలో రూ.20 నుంచి రూ.25 మధ్య ఉన్న దీని ధర అమాంతం పెరుగుతూ వస్తోంది. గడచిన రెండు రోజుల వ్యవధిలో రూ.20 మేర పెరిగి ఆదివారానికి రూ.100కు చేరుకుంది. రికార్డు స్థాయిలో పెరిగిన ధరతో టమాటా కొనుగోలు చేయాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. కిలోకు పది టమాటాల వరకూ తూగుతుండగా ఒక్కొక్కటి రూ.10 పలుకుతోందని వినియోగదారులు వాపోతున్నారు. పండ్లతో పోలిస్తే టమాటా ధరలే అధికంగా ఉన్నాయని అంటున్నారు.
తగ్గిన వినియోగం
ధర ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు టమాటా కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. తప్పదనుకుంటే పావుకిలో నుంచి అరకిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు కూడా టమాటా దిగుమతులను, అమ్మకాలను తగ్గిస్తున్నారు. టమాటా ప్రధానంగా సాగయ్యే చిత్తూరు జిల్లా నుంచి మన జిల్లాకు ప్రతి రోజూ 80 టన్నుల టమాటాలు దిగుమతి అవుతుంటాయి. ధర విపరీతంగా పెరిగి, అమ్మకాలు పడిపోతున్న నేపథ్యంలో ఆదివారం 15 టన్నులు మాత్రమే దిగుమతి అయినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క 25 కిలోల టమాటా బాక్సు కొనుగోలు చేస్తుంటే అందులో దెబ్బతిన్నవి మూడు కిలోలకు పైగా ఉంటున్నాయని, దీంతో తాము నష్టపోవాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు టమాటాల లభ్యత తక్కువగా ఉండటంతో కొందరు వ్యాపారులు బెంగళూరు నుంచి హైబ్రీడ్ టమాటాలు దిగుమతి చేసుకుంటున్నారు. వీటి ధర కూడా రూ.80 వరకు ఉంటోంది. చిత్తూరులో కొత్తగా వేసిన పంటల దిగుబడులు వచ్చేవరకూ ధరలు ఇలా కొనసాగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.