ప్రధాన రహదారి పక్కనే చిన్న షెడ్డులో తాజా సేంద్రియ కూరగాయాలతో ‘నిజాయితీ దుకాణం’ వినియోగదారులకు దృష్టిని ఆకట్టుకుంటుంది. ఆ షెడ్డులో ఎవరూ ఉండరు. ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసి పెట్టి ఉంటుంది. రోడ్డున వెళ్లే వారు తమకు అవసరమైన కూరగాయలను తీసుకొని.. వాటికి తగినంత డబ్బును షెడ్డులో ఉన్న ఓ కవర్లో వేస్తారు. లేదంటే ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా చెల్లిస్తుంటారు. ఇంతకీ ఈ దుకాణం ఎవరిది, మనుషులపై ఇంత నమ్మకం ఉంచిన ఆ మనిషి ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.
వృత్తులన్నిటికీ తల్లి వంటిది వ్యవసాయం. కరోనా ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన నేపథ్యంలో.. ఇతర వృత్తుల్లో స్థిర పడిన వాళ్లు ఇప్పుడు తిరిగి పల్లెలకు చేరుకొని వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేపడుతున్నారు. ఈ కోవకే చెందుతారు ఎడ్మల మల్లారెడ్డి. ప్రైవేటు పాఠశాల నడిపే మల్లారెడ్డి మరల సేద్యంలోకి వచ్చారు. తన ఏడెకరాల భూమిలో ప్రణాళికాబద్ధంగా సమగ్ర వ్యవసాయ విధానం చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. కూరగాయల నుంచి కుందేళ్ల వరకు, కొత్తిమీర నుంచి అంజీర పండ్ల వరకు పండిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేయటమే కాకుండా, ఆ పంటను వినూత్నంగా ‘నిజాయితీ రైతు దుకాణం’ ఏర్పాటు చేసి వినియోగదారులకు సరసమైన ధరలకు విక్రయిస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన ఈ ‘రైతు ఉపాధ్యాయుడి’ అనుభవాలను తెలుసుకుందాం..
అంజీర తోటలో రైతు మల్లారెడ్డి
ఎడ్మల మల్లారెడ్డి స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్. కోవిడ్‌తో ఏడాది క్రితం నుంచే పాఠశాలలు మూతపడ్డాయి. ఎప్పుడు తెరిచే పరిస్థితులు వస్తాయో తెలియదు. ఆయనది వ్యవసాయ కుటుంబం. ఏడెకరాల సొంత వ్యవసాయ భూమి ఉంది. అప్పటి వరకు కౌలుకు ఇచ్చిన ఆ భూమిలో ఇక తానే వ్యవసాయం చేస్తానని గ్రామస్థులకు చెప్పాడు. అయితే, ‘ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న మాకే గిట్టుబాటు కావడం లేదు, నీవేమి వ్యవసాయం చేస్తావు, స్కూల్‌ను బాగా నడిపించుకో..’ అని మొహం మీదే చెప్పారు. అయితే, మల్లారెడ్డి సవాలుగా తీసుకున్నారు. అందరిలాగ వ్యవసాయం చేస్తే మన ప్రత్యేకత ఏంటి, సాధారణ రైతులకు భిన్నంగా సేంద్రియ పద్ధతిలో సమగ్ర వ్యవసాయం చేసి అదాయం పొందాలనుకున్నాడు. కసితో వ్యవసాయానికి శ్రీకారం చుట్టి, ప్రస్తుతం అందరికీ ఆదర్శం అయ్యారు.
ప్రణాళికాబద్ధంగా సాగులోకి..
ఏడు ఎకరాల భూమిని ఐదారు ప్లాట్లుగా విభజించి, డ్రిప్ ఏర్పాటు చేసుకుని, చుట్టూ కంచే వేశారు. ఒక ప్లాట్‌లో– కోళ్లు, బాతులు, సీమ కోళ్లు.. రెండో ప్లాట్‌లో– జామ, బొప్పాయి, అరటి తోట.. మూడో ప్లాట్‌లో– మామిడి, సీతాఫలం మొక్కలు.. నాలుగో ప్లాట్‌లో– అంజీర, ఆపిల్ బెర్.. ఐదో ప్లాట్‌లో– కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. బెంగళూర్, హైద్రాబాద్ నర్సరీల నుంచి పండ్ల మొక్కలు తెప్పించి.. పశువుల ఎరువు, గొర్రెల ఎరువు వేసి నాటారు. పొట్ల, బీర, సొర, కాకర, నేతిబీర, దోస, మునగ, వంకాయ వంటి 25 రకాల దేశీ రకాల కూరగాయ విత్తనాలను హైద్రాబాద్ నుంచి తీసుకువచ్చి సాగు చేస్తున్నారు. ఏడెకరాల్లో గుంట భూమి ఖాళీ లేకుండా దాదాపు 2 వేల రక రకాల పండ్లు, కూరగాయల మొక్కలు పెంచుతున్నారు.
పంటలన్నిటినీ పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తుండటం, జగిత్యాలకు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉండటంతో, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ కస్టమర్లుగా నేరుగా తోట వద్దకే వచ్చి పండ్లు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎం తరహాలో 365 రోజులు తోటలో కూరగాయలు, పండ్లను అందుబాటులో ఉంచుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు మల్లారెడ్డి. డిమాండ్‌ను బట్టి నాటు కోళ్లను పెంచుతూ, బాతులు, సీమ కోడి గుడ్లు అమ్ముతూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. గొర్రెల పెంపకం, చేపల పెంపకం ప్రారంభించబోతున్నారు.
ఆ కుక్కలంటే కోతులకు హడల్!
మల్లారెడ్డి తోటలో ఎక్కువగా పండ్ల మొక్కలు ఉండటంతో కోతులు ఎక్కువగా వస్తున్నాయి. పొలంలో రెండు ‘బాహుబలి’ కుక్కలు పెంచుతున్నారు. రాత్రింబవళ్లు అవే కాపాలా కాస్తుంటాయి. కోతులు వస్తే ఈ కుక్కలు వాటిని ఉరికిస్తుంటాయి. దీంతో, ఈ తోటలోకి కోతులు వచ్చే పరిస్థితి లేదు. అలాగే, పట్టణానికి దగ్గరలో ఉండటంతో తల్లితండ్రులతో కలిసి పిల్లలు వచ్చేలా, మామిడి చెట్ల మధ్యలో పిల్లలు ఆటలాడుకునే వస్తువులను ఏర్పాటు చేశారు. ‘అగ్రి టూరిజం’ దృష్టితో తోటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
– పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్
నిజాయితీ దుకాణం!
ప్రధాన రహదారి పక్కనే ఉన్న తన తోటలో పండిన కూరగాయలను తోట దగ్గరే ‘నిజాయితీ దుకాణం’ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. చిన్న షెడ్డు వేశారు. అందులో కూరగాయలు పెట్టి, ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసి పెడుతుంటారు. ఆ షెడ్డులో ఎవరూ ఉండరు. రోడ్డున వెళ్లే వారు తమకు అవసరమైన కూరగాయలను తీసుకొని.. వాటికి తగినంత డబ్బును షెడ్డులో ఉన్న ఓ కవర్లో వేస్తారు. లేదంటే ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా చెల్లిస్తుంటారు. కోళ్లు, బాతు గుడ్లను కూడా తోటలోనే అమ్ముతుంటారు. రోజుకు రూ. 3 – 4 వేల వరకు ఆదాయం పొందుతూ మల్లారెడ్డి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సీనియర్ రైతులకే సేంద్రియ సమగ్ర సేద్య పాఠాలు నేర్పుతున్నారు!
నిజాయితీ + నమ్మకం = విజయం!
అందరిలాగా చేస్తే మనల్ని ఎవరూ గుర్తించరు. ఆరోగ్యదాయకంగా, వినూత్నంగా చేయాలి, దాని ద్వారా మనం ఆదాయం పొందాలి. వినియోగదారుల మనసులను చూరగొనాలి. నిజాయితీ, నమ్మకంతో చేస్తే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. తొలుత కొన్ని కష్టాలు తప్పవు. కష్టాలను అధిగమిస్తే విజయాలు చేకూరతాయని నేను నమ్ముతా. సమగ్ర సేంద్రియ వ్యవసాయంలో తృప్తితో పాటు మంచి ఆదాయమూ పొందుతున్నాను.
– ఎడ్మల మల్లారెడ్డి (99598 68192), లక్ష్మీపూర్, జగిత్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment