laxmipur village
-
రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో
ప్రభుత్వ ఆపీస్లో పై అధికారి తలబిరుసుతనంతో తన కింద పనిచేసిన వాళ్లపై చేయిచేసుకోవడం వంటి పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవలే ఒక నర్సు ఆలస్యంగా వచ్చినందుకు ఒక ఆరోగ్యాధికారి దాడి చేసేందుకు ప్రయత్నించిన వీడియోలను చూశాం. లక్షల్లోనూ లేదా కోట్ల ఆస్తి గురించి దెబ్బలాడుకున్నా ఓ అర్థం ఉంటుంది. కానీ కేవలం రూ 500 కోసం కొట్టుకోవడం గురించి విన్నారా. పైగా ఆపేందుకు ప్రయత్నించిన కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే....బీహార్‌లో జాముయ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు ఒకరినోకరు జుట్టుపట్టుకుని లాక్కుంటూ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఒక వ్యక్తి జోక్యం చేసుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ చేతులతోనూ, చెప్పులతోను ఘోరంగా కొట్టుకున్నారు. అయితే ఆశా వర్కర్ రింటూ కుమారి బీసీజీ వ్యాక్సిన్ షాట్ కోసం ఆక్సిలరీ నర్సు మిడ్వైఫ్(ఏఎన్ఎం) రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లినప్పుడే ఈ వివాదం తలెత్తింది. అయితే వ్యాక్సిన్ వేసేందుకు ఆ ఆక్సిలరీ నర్సు రూ 500 డిమాండ్ చేయడంతో ఈ గోడవ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్ వైరల్‌గా మారింది. దీంతో ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు ఆ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ये दृश्य @NitishKumar के स्वास्थ्य विभाग की असलियत की कहानी बयान कर रहा हैं जहां एक टीका के बदले 500 घूस की माँग पर एएनएम और आशा सेविका ऐसे उलझ गयी @ndtvindia @Anurag_Dwary @mangalpandeybjp @PratyayaIAS pic.twitter.com/98JrknbpMk — manish (@manishndtv) January 24, 2022 (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
మనిషి లేని ‘నిజాయితీ దుకాణం’.. ఎక్కడ ఉందంటే?
ప్రధాన రహదారి పక్కనే చిన్న షెడ్డులో తాజా సేంద్రియ కూరగాయాలతో ‘నిజాయితీ దుకాణం’ వినియోగదారులకు దృష్టిని ఆకట్టుకుంటుంది. ఆ షెడ్డులో ఎవరూ ఉండరు. ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసి పెట్టి ఉంటుంది. రోడ్డున వెళ్లే వారు తమకు అవసరమైన కూరగాయలను తీసుకొని.. వాటికి తగినంత డబ్బును షెడ్డులో ఉన్న ఓ కవర్లో వేస్తారు. లేదంటే ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా చెల్లిస్తుంటారు. ఇంతకీ ఈ దుకాణం ఎవరిది, మనుషులపై ఇంత నమ్మకం ఉంచిన ఆ మనిషి ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి. వృత్తులన్నిటికీ తల్లి వంటిది వ్యవసాయం. కరోనా ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన నేపథ్యంలో.. ఇతర వృత్తుల్లో స్థిర పడిన వాళ్లు ఇప్పుడు తిరిగి పల్లెలకు చేరుకొని వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా చేపడుతున్నారు. ఈ కోవకే చెందుతారు ఎడ్మల మల్లారెడ్డి. ప్రైవేటు పాఠశాల నడిపే మల్లారెడ్డి మరల సేద్యంలోకి వచ్చారు. తన ఏడెకరాల భూమిలో ప్రణాళికాబద్ధంగా సమగ్ర వ్యవసాయ విధానం చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. కూరగాయల నుంచి కుందేళ్ల వరకు, కొత్తిమీర నుంచి అంజీర పండ్ల వరకు పండిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేయటమే కాకుండా, ఆ పంటను వినూత్నంగా ‘నిజాయితీ రైతు దుకాణం’ ఏర్పాటు చేసి వినియోగదారులకు సరసమైన ధరలకు విక్రయిస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన ఈ ‘రైతు ఉపాధ్యాయుడి’ అనుభవాలను తెలుసుకుందాం.. అంజీర తోటలో రైతు మల్లారెడ్డి ఎడ్మల మల్లారెడ్డి స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్. కోవిడ్‌తో ఏడాది క్రితం నుంచే పాఠశాలలు మూతపడ్డాయి. ఎప్పుడు తెరిచే పరిస్థితులు వస్తాయో తెలియదు. ఆయనది వ్యవసాయ కుటుంబం. ఏడెకరాల సొంత వ్యవసాయ భూమి ఉంది. అప్పటి వరకు కౌలుకు ఇచ్చిన ఆ భూమిలో ఇక తానే వ్యవసాయం చేస్తానని గ్రామస్థులకు చెప్పాడు. అయితే, ‘ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న మాకే గిట్టుబాటు కావడం లేదు, నీవేమి వ్యవసాయం చేస్తావు, స్కూల్‌ను బాగా నడిపించుకో..’ అని మొహం మీదే చెప్పారు. అయితే, మల్లారెడ్డి సవాలుగా తీసుకున్నారు. అందరిలాగ వ్యవసాయం చేస్తే మన ప్రత్యేకత ఏంటి, సాధారణ రైతులకు భిన్నంగా సేంద్రియ పద్ధతిలో సమగ్ర వ్యవసాయం చేసి అదాయం పొందాలనుకున్నాడు. కసితో వ్యవసాయానికి శ్రీకారం చుట్టి, ప్రస్తుతం అందరికీ ఆదర్శం అయ్యారు. ప్రణాళికాబద్ధంగా సాగులోకి.. ఏడు ఎకరాల భూమిని ఐదారు ప్లాట్లుగా విభజించి, డ్రిప్ ఏర్పాటు చేసుకుని, చుట్టూ కంచే వేశారు. ఒక ప్లాట్‌లో– కోళ్లు, బాతులు, సీమ కోళ్లు.. రెండో ప్లాట్‌లో– జామ, బొప్పాయి, అరటి తోట.. మూడో ప్లాట్‌లో– మామిడి, సీతాఫలం మొక్కలు.. నాలుగో ప్లాట్‌లో– అంజీర, ఆపిల్ బెర్.. ఐదో ప్లాట్‌లో– కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. బెంగళూర్, హైద్రాబాద్ నర్సరీల నుంచి పండ్ల మొక్కలు తెప్పించి.. పశువుల ఎరువు, గొర్రెల ఎరువు వేసి నాటారు. పొట్ల, బీర, సొర, కాకర, నేతిబీర, దోస, మునగ, వంకాయ వంటి 25 రకాల దేశీ రకాల కూరగాయ విత్తనాలను హైద్రాబాద్ నుంచి తీసుకువచ్చి సాగు చేస్తున్నారు. ఏడెకరాల్లో గుంట భూమి ఖాళీ లేకుండా దాదాపు 2 వేల రక రకాల పండ్లు, కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. పంటలన్నిటినీ పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తుండటం, జగిత్యాలకు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉండటంతో, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ కస్టమర్లుగా నేరుగా తోట వద్దకే వచ్చి పండ్లు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎం తరహాలో 365 రోజులు తోటలో కూరగాయలు, పండ్లను అందుబాటులో ఉంచుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు మల్లారెడ్డి. డిమాండ్‌ను బట్టి నాటు కోళ్లను పెంచుతూ, బాతులు, సీమ కోడి గుడ్లు అమ్ముతూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. గొర్రెల పెంపకం, చేపల పెంపకం ప్రారంభించబోతున్నారు. ఆ కుక్కలంటే కోతులకు హడల్! మల్లారెడ్డి తోటలో ఎక్కువగా పండ్ల మొక్కలు ఉండటంతో కోతులు ఎక్కువగా వస్తున్నాయి. పొలంలో రెండు ‘బాహుబలి’ కుక్కలు పెంచుతున్నారు. రాత్రింబవళ్లు అవే కాపాలా కాస్తుంటాయి. కోతులు వస్తే ఈ కుక్కలు వాటిని ఉరికిస్తుంటాయి. దీంతో, ఈ తోటలోకి కోతులు వచ్చే పరిస్థితి లేదు. అలాగే, పట్టణానికి దగ్గరలో ఉండటంతో తల్లితండ్రులతో కలిసి పిల్లలు వచ్చేలా, మామిడి చెట్ల మధ్యలో పిల్లలు ఆటలాడుకునే వస్తువులను ఏర్పాటు చేశారు. ‘అగ్రి టూరిజం’ దృష్టితో తోటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ నిజాయితీ దుకాణం! ప్రధాన రహదారి పక్కనే ఉన్న తన తోటలో పండిన కూరగాయలను తోట దగ్గరే ‘నిజాయితీ దుకాణం’ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. చిన్న షెడ్డు వేశారు. అందులో కూరగాయలు పెట్టి, ఏ కూరగాయల ధర ఎంత అన్నది బోర్డుపై రాసి పెడుతుంటారు. ఆ షెడ్డులో ఎవరూ ఉండరు. రోడ్డున వెళ్లే వారు తమకు అవసరమైన కూరగాయలను తీసుకొని.. వాటికి తగినంత డబ్బును షెడ్డులో ఉన్న ఓ కవర్లో వేస్తారు. లేదంటే ఫోన్‌పే, గుగూల్‌పే ద్వారా చెల్లిస్తుంటారు. కోళ్లు, బాతు గుడ్లను కూడా తోటలోనే అమ్ముతుంటారు. రోజుకు రూ. 3 – 4 వేల వరకు ఆదాయం పొందుతూ మల్లారెడ్డి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సీనియర్ రైతులకే సేంద్రియ సమగ్ర సేద్య పాఠాలు నేర్పుతున్నారు! నిజాయితీ + నమ్మకం = విజయం! అందరిలాగా చేస్తే మనల్ని ఎవరూ గుర్తించరు. ఆరోగ్యదాయకంగా, వినూత్నంగా చేయాలి, దాని ద్వారా మనం ఆదాయం పొందాలి. వినియోగదారుల మనసులను చూరగొనాలి. నిజాయితీ, నమ్మకంతో చేస్తే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. తొలుత కొన్ని కష్టాలు తప్పవు. కష్టాలను అధిగమిస్తే విజయాలు చేకూరతాయని నేను నమ్ముతా. సమగ్ర సేంద్రియ వ్యవసాయంలో తృప్తితో పాటు మంచి ఆదాయమూ పొందుతున్నాను. – ఎడ్మల మల్లారెడ్డి (99598 68192), లక్ష్మీపూర్, జగిత్యాల జిల్లా -
బాహుబలి మూడో మోటార్ వెట్‌రన్
రామడుగు (చొప్పదండి): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపూర్ గ్రామ గాయత్రి పంపు హౌస్‌లోని బాహుబలి మూడో విద్యుత్ మోటారుకు శనివారం సాయంత్రం అధికారులు వెట్‌రన్ నిర్వహించారు. సాయంత్రం 6.18 గంటలకు మోటార్‌ను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోశారు.పంపుహౌస్‌లో ఏడు బాహుబలి విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేయగా..ఇప్పటికే 1, 2, 4, 5, 6 మోటార్లను వెట్‌రన్ విజయవంతంగా చేశారు. తాజా మరో మోటారు వెట్‌రన్ విజయవంతంగా నిర్వహించారు.దీంతో ఆరు మోటార్ల వెట్‌రన్ పూర్తయింది.చివరి మోటారు వెట్‌రన్‌కు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్ పాల్గొన్నారు. -
ఆ ఊరు నుంచి 12 మంది డాక్టర్లు
సాక్షి, జగిత్యాల : ఆ గ్రామంలో పసుపుతో పాటు వరి, మొక్కజొన్న వంటి మిశ్రమ పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందుతుంటారు. అంతేకాదు అక్కడి రైతులు రాజకీయాలకు అతీతంగా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తమ ఉత్పత్తులను నేరుగా మార్కెటింగ్ చేసుకుంటూ ఆదర్శ రైతులుగా మారి, ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. అలాంటి గ్రామంలో ఓ వైపు లక్ష్మీ కళ తాండవిస్తుంటే, మరో వైపు సరస్వతీ కళ కూడా తాండవిస్తోంది. ఆ గ్రామమే జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క లక్ష్మీపూర్ గ్రామం నుంచే దాదాపు 12 మంది డాక్టర్లు ఉండటం గమనార్హం. ఇందులో ఇప్పటికే నలుగురైదుగురు డాక్టర్లు తమ వైద్య వృత్తిని కొనసాగిస్తుండగా, మరికొందరు త్వరలోనే వైద్య విద్యను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం వైద్యులుగా కొనసాగుతున్న డాక్టర్ జయంతి–డాక్టర్ ఉదయ్ జగిత్యాలలో గైనకాలజి ప్రైవేట్ ఆసుపత్రి ఏర్పాటు చేయగా, మేడిపల్లి ప్రియాంక– శ్రీనివాస్‌రెడ్డిలు హైదరాబాద్‌లో గైనకాలజి ప్రైవేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అలాగే డాక్టర్ కొప్పెర మహేశ్– శిరీష జగిత్యాలలో ఆర్థోపెడిక్ అసుపత్రిని ఏర్పాటు చేయగా, అటుకుల రాహుల్ ఎంబీబీఎస్ పూర్తి కాగా, పీజి కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇక గర్వందుల శరణ్య ఎంబీబీఎస్‌లో భాగంగా హౌస్ సర్జన్ చేస్తుండగా, ఎర్రవేల్లి శ్రీనాథ్, పన్నాల మధు, గడ్డం గోవర్ధన్‌రెడ్డిలు ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఇంకా నాతర్ల సంజీవ్ బీడీఎస్ పూర్తి చేసి ఎండీఎస్ చదువుతుండగా, గర్వందుల నందిని బీడీఎస్ చదువుతుంది. వీరిని చూసిన మరికొందరు కూడా ఆ గ్రామం నుంచి వైద్య విద్యను అభ్యసించేందుకు ముందుకు వస్తుండటం విశేషం. అందరూ కూడా మంచి ర్యాంకులు సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించినవారే కావడం మరీ విశేషం. అందరూ రైతుబిడ్డలే.. పిల్లలకే పూర్తి స్వేచ్ఛ.. రాత్రనక, పగలనక కష్టపడి పంట సాగు చేసిన వారి బిడ్డలే డాక్టర్లు అయినవారిలో ఉన్నారు. ఆ రైతులకు ఏ పంట ఎప్పుడు వేయాలో తెలుసు. పండించిన పంటలో ఎలా ఆదాయం పొందాలో తెలుసు. కాని వారి పిల్లలు మాత్రం ఏం చదువుతున్నదో వారికి తెలియదు. అయితే పిల్లలకు తల్లితండ్రులు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మీ ఇష్టం వచ్చింది చదవండి. ఎంతైనా పెట్టుబడి పెడతాం. కాని పట్టుదలతో చదవి ఏదైనా సాధించండి అని మాత్రం చెప్పారు. డాక్టరే కావాలి, ఇంజినీరే కావాలి అని ఏ తల్లితండ్రి చెప్పలేదు. పిల్లలే తల్లితండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసి ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం కోసం పరితపించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ బిడ్డలు వారి తల్లితండ్రులకే కాకుండా ఆ గ్రామానికి పేరు తీసుకువచ్చారు. ఇటీవల డాక్టర్లు అయినవారిని, డాక్టర్లు కాబోతున్న వారిని లక్ష్మీపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో సన్మానించగా, వారి తల్లితండ్రులు భావోద్వేగంతో ఆనందభాష్పాలను రాల్చారు. -
14న సీఎం కేసీఆర్ రాక..?
సాక్షి,చొప్పదండి(కరీంనగర్) : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌస్(గాయత్రి) బాహుబలి మోటార్ల వెట్‌రన్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఈ నెల 14న రానున్నట్లు సమాచారం. బాహుబలి విద్యుత్‌మోటార్ల ద్వారా నీటిని వెట్‌రన్ నిర్వహించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం 14న రానిపక్షంలో 16న వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. బాహుబలి 5వ మోటార్ వెట్‌రన్‌ను రెండోసారి సోమవారం మధ్యాహ్నం 1.45గంటలకు అధికారులు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 5వ మోటారును దాదాపు 40 నిమిషాలు వెట్‌రన్ విజయవంతంగా నిర్వహించి నిలిపివేశారు. మళ్లీ సోమవారం దాదాపు గంటా 12 నిమిషాలు వెట్‌రన్ నిర్వహించారు. భారీగా నీటి ప్రవాహం గ్రావిటీ కాలువలో ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి నీటి ప్రవాహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. వెట్‌రన్ కోసం నీటిని వదిలిన తర్వాత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌ను గ్రావిటీ కాలువ(5.77 కిలోమీటర్లు)ను పరిశీలించారు. లక్ష్మీపూర్ నుంచి శ్రీరాములపల్లి గ్రామ పరిధిలోని వరద కాలువ వరకు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. గ్రావిటీ కాలువ ద్వారా శ్రీరాములపల్లి గ్రామ శివారులో వరదకాలువలో కాళేశ్వరం ప్రాజెక్టు నీరు చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు. 5వ విద్యుత్ మోటారు వెట్‌రన్ విజయవంతం కావడంతో రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, డీఈఈ గోపాలక్రిష్ణ, ఏఈఈలు సురేష్, రమేష్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. నాలుగో మోటార్.. లక్ష్మీపూర్ పంపుహౌస్(గాయత్రి)లో అధికారులు సోమవారం రాత్రి 9.15 గంటలకు 4వ బాహుబలి విద్యుత్ మోటారు వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 4వ మోటారు వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేసుకున్న అధికారులు కొంత సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి రాత్రి వెట్‌రన్ నిర్వహించారు. మోటారును రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి స్విఛ్‌ఆన్ చేసి ప్రారంభించారు. ఈ వెట్‌రన్‌ను దాదాపుగా గంటపాటు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పంపుహౌస్‌ను పరిశీలించిన సీపీ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో ఉన్న లక్ష్మీపూర్ పంపుహౌస్(గాయత్రి)ను సోమవారం కరీంనగర్ సీపీ వీబీ.కమలాసన్‌రెడ్డి పరిశీలించారు. సర్జిపూల్‌తోపాటుగా నీటి పంపింగ్ చేసే ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలను సందర్శించారు. సీపీ వెంట ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, ఏసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషావిశ్వనాథ్, చొప్పదండి సీఐ రమేష్, రామడుగు ఎస్సై వి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘మేఘా’ వండర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయింది. ఇంజనీరింగ్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా 139 మెగావాట్ల సామర్థ్యంగల బాహుబలి మోటార్ 111 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించింది. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా, ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయేలా భూగర్భంలో నీటి పంపింగ్ కేంద్రం నుంచి నీటిని పంప్ చేయించడం ద్వారా నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కొత్త రికార్డు సృష్టించింది. మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ముందు వరుసలో ఉండే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ పంపింగ్ కేంద్రం బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది. ‘మేఘా’ మహాద్భుత సృష్టి.. ప్రపంచంలోనే అతిపెద్దది.. ఇంతకుముందు ఎక్కడా లేనిది.. అందులోనూ భూగర్భంలో నిర్మించిన అతిపెద్ద పంప్‌హౌస్‌గా కాళేశ్వరంలోని లక్ష్మీపూర్ పంప్‌హౌస్ (ప్యాకేజీ–8) ఇప్పటికే పేరు గడించింది. ఈ భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులుకాగా 139 మెగావాట్ల సామర్థ్యంతో 5 మోటార్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది. ఒక్కో మోటార్ బరువు 2,376 మెట్రిక్ టన్నులు. ఈ మోటార్లో ప్రధానమైన స్టార్టర్ బరువు 216 టన్నులుకాగా రోటర్ బరువు 196 టన్నులు. సాధారణంగా 200 టన్నుల బరువు మోసే క్రేన్లు ఉండవు. ఇక్కడ వీటిని కదిలించడానికి రెండేసి క్రేన్లను వినియోగిస్తున్నారు. ఈ పంప్‌హౌస్ నిర్మాణం కోసం 6 వేల టన్నుల స్టీల్‌తోపాటు 50 వేల టన్నుల సిమెంట్ కాంక్రీట్ వినియోగించారు. ఇక్కడి నుంచి కనీసం రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్ చేసేలా నిర్మాణ పని పూర్తయింది. ఈ మిషన్లు పని చేయడం ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రవాహం ఎంత పెద్దదో అంతకన్నా రెండింతలు పెద్దగా నీరు ప్రవహిస్తుంది. అక్కడ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులుకాగా ఇక్కడ 22 వేల క్యూసెక్కుల నీరు పంపింగ్ ద్వారా వస్తుంది. సాధారణంగా 30 లేదా 40 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేయడమే ప్రాజెక్టుల్లో అరుదైన విషయంకాగా భూగర్భం నుంచి 111.4 మీటర్ల ఎత్తుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేలా మోటార్లను మేఘా సిద్ధం చేసింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 2 టీఎంసీల పంపింగ్‌కుగాను 4,627 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం గల మోటార్ పంపులు అవసరంకాగా ఒక్క మేఘానే 3,057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యంగల మోటార్ పంపులను ఏర్పాటు చేసింది. దీంతోపాటే పంప్‌హౌస్ ఆకృతి నిర్మాణంలో సర్వీస్ బే భూమి ఉపరితలం నుంచి 210 మీటర్లు లోతున ఉంది. పంప్ బే 190.5 మీటర్లు, యాన్సిరీ బే 195.5 మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ బే 215 మీటర్లు, కంట్రోల్ రూం 209 మీటర్ల లోతున ఉన్నాయి. ఆదివారం ఒక మోటార్‌కు విజయవంతంగా ట్రయల్ రన్ చేపట్టగా సోమవారం మధ్యాహ్నం సుమారు 45 నిమిషాలపాటు నీటిని పంప్ చేశారు. బుధవారం నాటికి రెండు మోటార్లను సిద్ధం చేయనుండగా వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచి నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. ప్రపంచంలోనే వినూత్నమైంది.. ఇదొక అత్యద్భుతమైన అండర్‌గ్రౌండ్ పంప్‌హౌస్. భూమికి 470 అడుగుల దిగువన, జంట టన్నెల్స్తోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జ్‌పూల్స్ నిర్మించాం. ఈ మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యంగల 5 మెషీన్లతో రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేయగల సామర్థ్యంతో నెలకొల్పాం. ఏ రకంగా చూసినా ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే వినూత్నమైన మెగా ప్రాజెక్టు. ఈ మహా అద్భుతమైన ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేసిన ఘనత మాకే దక్కుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతి అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లే తక్కువ కాలంలో దీన్ని పూర్తి చేయడం సాధ్యమైంది. – బి. శ్రీనివాస్‌రెడ్డి, మేఘా డైరెక్టర్ అత్యద్భుతమిది... లక్ష్మీపూర్ భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం పొడవు ఐఫిల్ టవర్ పొడవుకన్నా ఎక్కువ. ఐఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు కాగా పంప్‌హౌస్ పొడవు 327 మీటర్లు. కోల్‌కతాలో దేశంలోనే అతిపొడవైన భవంతి ‘ది 42’ (262 మీటర్లు) కంటే ఈ పంప్‌హౌస్ లోతు ఎక్కువ. పంప్‌హౌస్ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.30 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తీశారు. ఈ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. -
నాటు వేస్తుండగా నలుగుర్ని కాటేసిన పాము
ఆదిలాబాద్(లక్సెట్టిపేట): లక్సెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బుధవారం ఓ పాము నలుగుర్ని కాటేసింది. గ్రామానికి చెందిన అక్కల రాజయ్య అనే రైతు పొలంలో నాటు వేస్తుండగా మల్లమ్మ, శాంత, సునీత, రాజవ్వ అనే నలుగురిని వెను వెంటనే కాటేసింది. బాధిత మహిళలను చికిత్సనిమిత్తం హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడా ఉంది.