సాక్షి,చొప్పదండి(కరీంనగర్) : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రామడుగు మండలం లక్ష్మీపూర్ పంప్‌హౌస్(గాయత్రి) బాహుబలి మోటార్ల వెట్‌రన్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఈ నెల 14న రానున్నట్లు సమాచారం. బాహుబలి విద్యుత్‌మోటార్ల ద్వారా నీటిని వెట్‌రన్ నిర్వహించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం 14న రానిపక్షంలో 16న వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
కాగా.. బాహుబలి 5వ మోటార్ వెట్‌రన్‌ను రెండోసారి సోమవారం మధ్యాహ్నం 1.45గంటలకు అధికారులు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 5వ మోటారును దాదాపు 40 నిమిషాలు వెట్‌రన్ విజయవంతంగా నిర్వహించి నిలిపివేశారు. మళ్లీ సోమవారం దాదాపు గంటా 12 నిమిషాలు వెట్‌రన్ నిర్వహించారు. భారీగా నీటి ప్రవాహం గ్రావిటీ కాలువలో ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి నీటి ప్రవాహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు.
వెట్‌రన్ కోసం నీటిని వదిలిన తర్వాత ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌ను గ్రావిటీ కాలువ(5.77 కిలోమీటర్లు)ను పరిశీలించారు. లక్ష్మీపూర్ నుంచి శ్రీరాములపల్లి గ్రామ పరిధిలోని వరద కాలువ వరకు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. గ్రావిటీ కాలువ ద్వారా శ్రీరాములపల్లి గ్రామ శివారులో వరదకాలువలో కాళేశ్వరం ప్రాజెక్టు నీరు చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు. 5వ విద్యుత్ మోటారు వెట్‌రన్ విజయవంతం కావడంతో రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, డీఈఈ గోపాలక్రిష్ణ, ఏఈఈలు సురేష్, రమేష్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
నాలుగో మోటార్..
లక్ష్మీపూర్ పంపుహౌస్(గాయత్రి)లో అధికారులు సోమవారం రాత్రి 9.15 గంటలకు 4వ బాహుబలి విద్యుత్ మోటారు వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 4వ మోటారు వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేసుకున్న అధికారులు కొంత సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి రాత్రి వెట్‌రన్ నిర్వహించారు. మోటారును రాష్ట్ర సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి స్విఛ్‌ఆన్ చేసి ప్రారంభించారు. ఈ వెట్‌రన్‌ను దాదాపుగా గంటపాటు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
పంపుహౌస్‌ను పరిశీలించిన సీపీ
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో ఉన్న లక్ష్మీపూర్ పంపుహౌస్(గాయత్రి)ను సోమవారం కరీంనగర్ సీపీ వీబీ.కమలాసన్‌రెడ్డి పరిశీలించారు. సర్జిపూల్‌తోపాటుగా నీటి పంపింగ్ చేసే ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలను సందర్శించారు. సీపీ వెంట ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్, ఏసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషావిశ్వనాథ్, చొప్పదండి సీఐ రమేష్, రామడుగు ఎస్సై వి.రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment