‘మేఘా’ వండర్‌ | Kaleshwaram Laxmipur Underground Pump House Ready For Inauguration | Sakshi
Sakshi News home page

‘మేఘా’ వండర్‌

Published Tue, Aug 13 2019 2:21 AM | Last Updated on Tue, Aug 13 2019 8:33 AM

Kaleshwaram Laxmipur Underground Pump House Ready For Inauguration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయింది. ఇంజనీరింగ్‌ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా 139 మెగావాట్ల సామర్థ్యంగల బాహుబలి మోటార్‌ 111 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించింది. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా, ఇంజనీరింగ్‌ నిపుణులు సైతం నివ్వెరపోయేలా భూగర్భంలో నీటి పంపింగ్‌ కేంద్రం నుంచి నీటిని పంప్‌ చేయించడం ద్వారా నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) కొత్త రికార్డు సృష్టించింది. మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ముందు వరుసలో ఉండే కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్‌ (గాయత్రి) భూగర్భ పంపింగ్‌ కేంద్రం బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది.  
‘మేఘా’ మహాద్భుత సృష్టి.. 
ప్రపంచంలోనే అతిపెద్దది.. ఇంతకుముందు ఎక్కడా లేనిది.. అందులోనూ భూగర్భంలో నిర్మించిన అతిపెద్ద పంప్‌హౌస్‌గా కాళేశ్వరంలోని లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌ (ప్యాకేజీ–8) ఇప్పటికే పేరు గడించింది. ఈ భూగర్భ నీటి పంపింగ్‌ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులుకాగా 139 మెగావాట్ల సామర్థ్యంతో 5 మోటార్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది. ఒక్కో మోటార్‌ బరువు 2,376 మెట్రిక్‌ టన్నులు. ఈ మోటార్‌లో ప్రధానమైన స్టార్టర్‌ బరువు 216 టన్నులుకాగా రోటర్‌ బరువు 196 టన్నులు. సాధారణంగా 200 టన్నుల బరువు మోసే క్రేన్లు ఉండవు. ఇక్కడ వీటిని కదిలించడానికి రెండేసి క్రేన్లను వినియోగిస్తున్నారు. ఈ పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం 6 వేల టన్నుల స్టీల్‌తోపాటు 50 వేల టన్నుల సిమెంట్‌ కాంక్రీట్‌ వినియోగించారు. ఇక్కడి నుంచి కనీసం రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్‌ చేసేలా నిర్మాణ పని పూర్తయింది. ఈ మిషన్లు పని చేయడం ప్రారంభం కాగానే నాగార్జున సాగర్‌ కుడి కాలువ ప్రవాహం ఎంత పెద్దదో అంతకన్నా రెండింతలు పెద్దగా నీరు ప్రవహిస్తుంది. అక్కడ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులుకాగా ఇక్కడ 22 వేల క్యూసెక్కుల నీరు పంపింగ్‌ ద్వారా వస్తుంది. సాధారణంగా 30 లేదా 40 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్‌ చేయడమే ప్రాజెక్టుల్లో అరుదైన విషయంకాగా భూగర్భం నుంచి 111.4 మీటర్ల ఎత్తుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేసేలా మోటార్లను మేఘా సిద్ధం చేసింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 2 టీఎంసీల పంపింగ్‌కుగాను 4,627 మెగావాట్ల పంపింగ్‌ సామర్థ్యం గల మోటార్‌ పంపులు అవసరంకాగా ఒక్క మేఘానే 3,057 మెగావాట్ల పంపింగ్‌ సామర్థ్యంగల మోటార్‌ పంపులను ఏర్పాటు చేసింది. దీంతోపాటే పంప్‌హౌస్‌ ఆకృతి నిర్మాణంలో సర్వీస్‌ బే భూమి ఉపరితలం నుంచి 210 మీటర్లు లోతున ఉంది. పంప్‌ బే 190.5 మీటర్లు, యాన్సిరీ బే 195.5 మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ బే 215 మీటర్లు, కంట్రోల్‌ రూం 209 మీటర్ల లోతున ఉన్నాయి. ఆదివారం ఒక మోటార్‌కు విజయవంతంగా ట్రయల్‌ రన్‌ చేపట్టగా సోమవారం మధ్యాహ్నం సుమారు 45 నిమిషాలపాటు నీటిని పంప్‌ చేశారు. బుధవారం నాటికి రెండు మోటార్లను సిద్ధం చేయనుండగా వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచి నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. 

ప్రపంచంలోనే వినూత్నమైంది.. 
ఇదొక అత్యద్భుతమైన అండర్‌గ్రౌండ్‌ పంప్‌హౌస్‌. భూమికి 470 అడుగుల దిగువన, జంట టన్నెల్స్‌తోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జ్‌పూల్స్‌ నిర్మించాం. ఈ మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యంగల 5 మెషీన్లతో రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేయగల సామర్థ్యంతో నెలకొల్పాం. ఏ రకంగా చూసినా ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే వినూత్నమైన మెగా ప్రాజెక్టు. ఈ మహా అద్భుతమైన ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేసిన ఘనత మాకే దక్కుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతి అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లే తక్కువ కాలంలో దీన్ని పూర్తి చేయడం సాధ్యమైంది. – బి. శ్రీనివాస్‌రెడ్డి, మేఘా డైరెక్టర్‌
 

అత్యద్భుతమిది...  

  • లక్ష్మీపూర్‌ భూగర్భ నీటి పంపింగ్‌ కేంద్రం పొడవు ఐఫిల్‌ టవర్‌
  • పొడవుకన్నా ఎక్కువ. ఐఫిల్‌ టవర్‌ ఎత్తు 324 మీటర్లు కాగా పంప్‌హౌస్‌ పొడవు 327 మీటర్లు.  
  • కోల్‌కతాలో దేశంలోనే అతిపొడవైన భవంతి ‘ది 42’ (262 మీటర్లు) కంటే ఈ పంప్‌హౌస్‌ లోతు ఎక్కువ. 
  • పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.30 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీశారు. 
  • ఈ నీటి పంపింగ్‌ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement