జన చైతన్య భూమిక
రేపు ‘జాతీయ ఆధునిక వీధి నాటక దినోత్సవం’
‘ప్రజల సమస్యల్ని ప్రతిబింబిస్తూ... పరిష్కారాలు సూచించేదే ఆధునిక వీధి నాటకం...’ అంటూ తనదైన శైలిలో వీధి నాటకాలను సామాన్యుల మధ్యకు తీసుకెళ్లిన కళాకారుడు సఫ్దర్ హష్మీ. 1989 జనవరి 1న ఢిల్లీ సమీపంలో ‘హల్లాబోల్’ వీధినాటికను ప్రదర్శిస్తుండగా సఫ్దర్ హష్మీ హత్యకు గురయ్యారు. దేశంలోని ప్రజా కళాకారులంతా ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండించారు. ఆధునిక వీధి నాటకానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ కళాకారుడికి నివాళిగా సఫ్దర్ హష్మీ పుట్టినరోజైన ఏప్రిల్ 12న ‘జాతీయ ఆధునిక వీధి నాటక దినోత్సవం’ జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మన దేశంలో మొట్టమొదటిసారిగా వీధి నాటకంపై పరిశోధన చేసి ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రంగస్థల, కళల శాఖాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ జి.యస్ ప్రసాద్ రెడ్డిని పలకరిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
‘‘ప్రజల్ని చైతన్యవంతులుగా మార్చడానికి వీధి నాటకానికి మించిన ఆయుధం మరొకటి లేదు. ప్రజల్ని ఆలోచింప చేస్తుంది. ఉత్సాహపరుస్తుంది. విజ్ఞానాన్ని ఇస్తుంది. కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. పూర్వం మహారాజులు, చక్రవర్తులు, కవులు, పండితుల దగ్గరికి వెళ్లి కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేవారు. అంటే కళాకారులే ప్రేక్షకుల దగ్గరికి వెళ్లడమన్నమాట. తర్వాత ఆడిటోరియం నాటక ప్రదర్శనలు వచ్చాక ప్రేక్షకులే ప్రదర్శనల దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన ఆధునిక వీధి నాటకం ప్రజల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లడం మొదలుపెట్టింది.
ఎక్కడ ప్రజలుంటే అక్కడే వేదిక. బస్ స్టాండుల దగ్గర మొదలుపెడితే... పదిమంది గుమిగూడిన ప్రతి ప్రదేశమూ వీధి నాటకానికి వేదికే. మనదేశంలో వీధి నాటకాలకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ‘బాదల్ సర్కార్’ ఆద్యుడని చెప్పేవారు. అప్పట్లో ఉద్యమాలకూ, అణచివేతపై తిరుగుబాటుకూ వీధి నాటకం ఓ ఆయుధం. ప్రజల్ని చైతన్యపరచడానికి దీన్నో బ్రహ్మాస్త్రంలా ప్రయోగించేవారు. నేను చేసిన పరిశోధనలో మన రాష్ట్రానికి చెందిన తిరునగరి రామాంజనేయులు మొదటిసారి ఆధునిక వీధి నాటకాన్ని పదర్శించినట్టు తేలింది.
‘వెట్టి చాకిరి’తో...
1948లో తెలంగాణా స్వాతంత్య్ర పోరాట ఉద్యమకాలంలో అప్పటి గ్రామీణ సమాజంలో వెట్టిచాకిరీ వ్యవస్థను ప్రతిబింబిస్తూ, అమీనా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఓ గ్రామ సేవకుడి కథను రామాంజనేయులు ‘వెట్టిచాకిరీ’గా ప్రదర్శించారు. ఈ వీధి నాటిక ఒక్క ఖమ్మం జిల్లాలోనే వందసార్లకు పైగా ప్రదర్శించబడిందట. అలాగే మన రాష్ట్రం అత్యధిక వీధి నాటకాలు ప్రదర్శించిన ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. వీధి నాటకం... వేదికలు, మేకప్‌లు, హంగూ ఆర్భాటమేమీ అక్కర్లేని ప్రసారమాధ్యమం. పైగా స్పందన కూడా వెంటనే ఉంటుంది.
చైతన్యానికి చేయూత
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వీధి నాటక కళకు ఆదరణ మధ్యలో కొంత తగ్గినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. మన రాష్ట్రంలో చాలా స్వచ్ఛంద సంస్థలు మా రంగస్థల విద్యార్థులతో అవగాహన నాటికలు వేయించుకున్నారు.
ఎయిడ్స్, నిరక్షరాస్యత, బాలకార్మికులు, భ్రూణహత్యలు, వరకట్నాలు, మూఢనమ్మకాలు... ఇలా చాలా అంశాలపై వీధి నాటకాలు వేయించి ప్రజల్లో అవగాహన తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. నా వరకూ అయితే ఇలాంటి వీధి నాటకాల్ని ఉచితంగానే ప్రదర్శన చేయిస్తున్నాను. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కూడా తమ పథకాలను ప్రజలకు తెలియజెప్పడానికి వీధి నాటకాలను నమ్ముకుంటున్నారు. టీవీలు, రేడియోలు, సెల్‌ఫోన్‌లు... ఆధునిక పరికరాలేవీ చేయలేని పని వీధి నాటకం చేసిపెడుతుందన్నది వారి నమ్మకం. అదే నిజం కూడా.
పాఠ్యాంశాల్లో చేర్చాలి...
నాటకాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో లేని మరో ప్రత్యేకత మన రాష్ట్రానికి ఉంది. మన రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలలో రంగస్థల కళల శాఖ ఉంది. ఎన్నుంటే ఏం లాభం... నాటక రంగంపై ప్రేక్షకులకు అభిమానం తగ్గుతోంది. వారి మనసులో ప్రదర్శనలకు ఉన్న చోటు వారి పిల్లలను రంగస్థలానికి పంపడంవైపు ఉండడం లేదు.
విదేశాలలో అయితే పాఠశాల పుస్తకాల్లో రంగస్థల నాటక అంశం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి విద్యార్థీ గొప్ప కళాకారుడు కావాలని వారి ఉద్దేశం కాదు. నటనను బోధించడం వల్ల హావభావాల్లో, తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరచడంలో ప్రతి విద్యార్థీ నిష్ణాతుడు అవుతాడు. కనీసం దీనికోసమైనా మన పాఠ్యపుస్తకాల్లో కళకు చోటు కల్పిస్తే ఆసక్తి ఉన్నవారు కళాకారులుగా మారతారు, లేనివారు మంచి వ్యక్తిగా ఎదుగుతారు. ఈ మధ్యకాలంలో చాలాచోట్ల వీధినాటకాల్లో యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటప్పుడు అనిపిస్తుంది...వీధి నాటకానికి మళ్లీ పూర్వపు వైభోగం వస్తుందని!
- భువనేశ్వరి
మహిళలంతాచితక్కొట్టారు
తనికెళ్ల భరణిగారు రాసిన ‘గో గ్రహణం’ నాటకాన్ని మేం మహరాష్ట్రలోని నాగపూర్‌లో ప్రదర్శిస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అందులో ఓ భర్త పాత్ర తన భార్యను కొట్టే సన్నివేశం ఉంది. నేను భర్త పాత్ర పోషించాను. ఆ దృశ్యం చూసిన మహిళలు ఒక్కసారిగా మీదకొచ్చి నన్ను చితక్కొట్టారు. ‘ఇది నాటకం...’ అంటూ ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. ఇక్కడ నేను చెప్పేదేమిటంటే... అంత త్వరగా ప్రేక్షకుల మదిని తాకే శక్తి ఒక్క వీధి నాటకానికే ఉంటుంది.
- ప్రొఫెసర్ జి.యస్ ప్రసాద్ రెడ్డి
రంగస్థల కళల శాఖాధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం