మనిషికి వృద్ధాప్యం అనేది గడ్డుకాలమని చాలామంది అంటుంటారు. అలాంటి కాలం త్వరలో రానుంది. భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న 25 ఏళ్లలో దేశంలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సవాల్ విసురుతున్న వృద్ధాప్య జనాభా
ప్రస్తుతం భారతదేశంలో వృద్ధుల సంఖ్య దాదాపు 10.40 కోట్లు (104 మిలియన్లు), ఇది 2050 నాటికి 31.90 కోట్లకు (319 మిలియన్లు) చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. వృద్ధాప్య దశలో శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా వృద్ధులు దీర్ఘకాలం జీవించగలుగుతారు. అయితే ఇదే సమయంలో వృద్ధుల ఆరోగ్య సంబంధిత సవాళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రెండున్నర దశాబ్దాల్లో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోఛామ్) నేషనల్ కౌన్సిల్ ఆన్ సీఎస్‌ఆర్, చైర్మన్ అనిల్ రాజ్‌పుత్ ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ వృద్ధులకు వారి స్వతంత్రతను కాపాడుకునేందుకు, చురుకుగా ఉండటానికి అనువైన విధానాలను అనుసరించడం అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యం అనేది 21వ శతాబ్దపు అతిపెద్ద సామాజిక సవాళ్లలో ఒకటిగా మారింది. వచ్చే రెండున్నర దశాబ్దాల్లో భారతదేశంలో వృద్ధుల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వృద్ధాప్య సంరక్షణపై కార్పొరేట్ రంగం, సమాజం, ప్రభుత్వాలు క్రియాశీల సహకారం అందించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
వృద్ధాప్య సమస్యలను నియంత్రించే యోగా
న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సుభాష్ మంచాంద ఇదే అంశంపై మాట్లాడుతూ వృద్ధులకు వచ్చే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల సమస్యలను నియంత్రించడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. యోగాభ్యాసం వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదింపజేస్తుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. వృద్ధులు క్రమం తప్పకుండా యోగా చేయాలని, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సుభాష్ మంచాంద పేర్కొన్నారు.
సమతుల ఆహారంతో ఆరోగ్యం
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో గల వృద్ధాప్య క్లినిక్ మాజీ సీనియర్ సలహాదారు ప్రొఫెసర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వృద్ధాప్యం కోసం, ప్రజలు సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరమని అన్నారు. అనారోగ్యకరమైన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామం రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాల పాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలని, తగినంతసేపు నిద్రించాలని సలహా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు
Comments
Please login to add a commentAdd a comment