పేద మహిళల కోసంస్నేహ హస్తం | Friendly advice for poor women | Sakshi
Sakshi News home page

పేద మహిళల కోసంస్నేహ హస్తం

Published Thu, May 29 2014 10:32 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

పేద మహిళల కోసంస్నేహ హస్తం - Sakshi

పేద మహిళల కోసంస్నేహ హస్తం

 సఫా... అంటే స్వచ్ఛత, స్నేహం అని అర్థం. రుబీనా విజయానికి కారణాలు కూడా ఆ రెండే. ఓ సైనికుడి కడుపున పుట్టినందుకు తండ్రిలో ఉన్న సేవకుణ్ణి చూసి తోటివారికి సాయపడాలన్న ఆలోచన పుట్టిందామెకు. ఆ సేవ స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంది. అందుకే ‘సఫా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వందలమంది పేద మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఏ వ్యాపారైమైనా విజయవంతంగా ముందుకు సాగడానికి స్వచ్ఛత ఉంటే చాలని ‘సఫా’లోని సభ్యులంతా నిరూపించారు. ఈ విజయం వెనక రుబినాతో పాటు బలమైన ఆశయాలు, పట్టుదలతో కూడిన లక్ష్యాలు ఉన్నాయి.
 
 సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖలో ట్రావెల్ ఆపరేటర్‌గా తొమ్మిదేళ్లు పనిచేసిన రుబీనా నఫీస్ ఫాతిమా చిన్నతనం నుంచే సేవాకార్యక్రమాలంటే ఇష్టపడేది. హైదరాబాద్‌కి చెందిన మిలటరీ అధికారి సులేమాన్ అలాఖాన్ రెండవ సంతానం రుబీనా. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని అన్ని ప్రాంతాలను చూసిన రుబీనా తన జీవితంలో పేద మహిళల కోసం ఏదో ఒకటి చేయాలని చదువుకున్నరోజుల్లోనే ప్రణాళికలు తయారుచేసుకుంది. ‘‘సౌదీ నుంచి హైదరాబాద్ వచ్చాక ఇక్కడ వాడలన్నీ తిరిగి చూశాను. నిరుపేద కుటుంబాల్లో మహిళ దుఃస్థితి నా మనసును కలిచివేసింది. ముఖ్యంగా ముస్లిం వాడల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
 
 చదువు లేకపోవడం ఒక్కటే కారణం కాదు, పేదరికం, గృహహింసలకు బలైపోతున్న మహిళలు, వారికి వారసులుగా పిల్లలు. ఇలాంటివారిని ముందు ఆర్థికంగా నిలబెట్టడం ఒక్కటే పరిష్కారమనుకున్నాను. బంధువులు, స్నేహితులతో ఆలోచించి ‘సఫా’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాను. ‘సఫా’ అనేది ఉర్దూ పదం. స్వచ్ఛత, స్నేహం అని అర్థం. ఈ రెండు పదాలనే పెట్టుబడిగా పెట్టి గత ఎనిమిదేళ్లుగా మా ప్రయాణం కొనసాగుతోంది’’ అని చెప్పారు రుబీనా.
 
 శిక్షణ...: హైదరాబాద్‌లోని ఖాజానగర్, సయ్యద్‌నగర్, బోలానగర్, అహమద్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి పేదమహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి రకరకాల పనులకు సంబంధించి ఉచిత శిక్షణ ఇప్పించారు రుబీనా. బంజార్‌హిల్స్‌లోని బోలానగర్ సఫా సంస్థలో వీరికి శిక్షణకు కావాల్సిన ఏర్పాటు చేశారు. మెహెందీ, స్క్రీన్ ప్రింటింగ్, జ్యూట్ బ్యాగ్ మేకింగ్, ఎకో ఫ్రెండ్లీ బ్యాగులు, కొవ్వొత్తుల... ఇలా చాలా రకాల పనులు చేస్తున్నారక్కడ. ‘‘మొదట్లో నేనొక్కదాన్నే ఇళ్లకు తిరిగి నేను చేయబోయే పని గురించి చెప్పాను. చాలామంది నమ్మలేదు.
 
 ఓ ఇద్దరు ముగ్గురు మా సంస్థలో పని నేర్చుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నారని తెలిసాక ఒక్కొక్కరూ బయటికి రావడం మొదలుపెట్టారు. పైగా ఇంటి దగ్గరే పనిచేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చనే మాట చాలామంది ముస్లిం మహిళల్ని ‘సఫా’వైపు అడుగులు వేయించింది’’ అని చెప్పారు రుబీనా. వీరిలో గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలు కూడా ఉన్నారు. ఆర్థికంగా నిలబడి, పిల్లల్ని చదివించుకోవాలనే ధ్యేయంతో గడపదాటిన వీరికి ‘సఫా’ చక్కని మార్గంగా నిలిచింది.

మార్కెటింగ్...: తమను ఆశ్రయించిన మహిళలకు ఏ పనంటే ఇష్టమో కనుక్కొని దానిపై శిక్షణ ఇప్పించి చేతినిండా పని ఉండేలా ప్లాన్ చేయడంలో విజయం సాధించడం వెనక రుబీనా శ్రమ చాలా ఉంది.
 
వస్తువు తయారుచేయడం ఒకెత్తయితే, దాన్ని మార్కెట్ చేయడం మరొకెత్తు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో దీన్ని మించిన సవాలు మరొకటి లేదు. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా తయారుచేస్తున్న సఫాలోని ప్రతి వస్తువూ ఓ పేదమహిళ కడుపు నింపుతుందని తెలిస్తే మనసున్న ప్రతి ఒక్కరూ వాటిని కొనడానికి ముందుకొస్తారని చెప్పింది అక్కడ ఉపాధి పొందుతున్న హైమది బేగం.
 
 పేద పిల్లల కోసం...:  కొందరు అనాథ పిల్లలనూ తండ్రి లేక ఆసరా కోల్పోయిన పిల్లలు కొందరినీ రుబీనా ఉచితంగా చదివిస్తున్నారు. ‘‘బోలానగర్‌లోని 140 మంది పేద పిల్లల్ని స్కూల్లో చేర్పించాం. వారి బాగోగులు ‘సఫా’నే చూసుకుంటుంది. నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఉపాధి పొందడానికి వచ్చిన పేదమహిళలు కూడా పని సాయం చేసి పెడుతున్నారు. స్నేహితులు, బంధువులు చేతిసాయం చేస్తున్నారు. చాలావరకూ మా సంస్థలో తయారయిన సరుకు మార్కెటింగ్‌లో వచ్చిన లాభాలే మమ్మల్ని ముందుకు పంపుతున్నాయి. భవిష్యత్తులో మరింతమంది మహిళలకు శిక్షణలు ఇచ్చి, పెద్దఎత్తున వస్తువులను తయారు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం’’ అని చెప్పారు రుబీనా.
 
‘‘వేడుకలకు వెళ్లకపోయినా ఫరవాలేదు, ఎవరికైనా ఆపదొచ్చినప్పుడు వెంటనే పరుగులు పెట్టకపోతే మనం మనుషుల లెక్కల్లో లేనట్టే తల్లీ’’ అంటూ ఒళ్లో కూర్చోబెట్టుకుని తాతయ్య చెప్పిన మాటల్ని ఈరోజుకూ గుర్తుచేసుకుంటూ ఉంటారు రుబీనా. ఆమెనూ, ఆమె ఆశయాన్నీ ముందుకు నడిపిస్తున్నది అదే!
 - భువనేశ్వరి, ఫొటోలు: మోహన్
 
‘‘సౌదీ నుంచి హైదరాబాద్‌కి రాగానే ఇక్కడ ట్రావెల్ అండ్ టూరిజమ్ ట్రైనింగ్ సెంటర్‌ని స్థాపించాను.  చాలా రకాల కార్పొరేట్ సంస్థలతో నాకు పరిచయాలు ఏర్పాడ్డాయి. సఫాలో తయారుచేసిన జ్యూట్ బ్యాగులు, లాప్‌ట్యాప్ కవర్లు, హాండ్ బ్యాగులు, సెల్ పౌచ్‌లు, ట్రావెల్ బ్యాగులు, పెన్ స్టాండ్‌లను ఆ కంపెనీల్లో అమ్మేలా మార్కెటింగ్ చేసుకున్నాను. దీనికోసం ఆన్‌లైన్ సహకారం కూడా తీసుకుంటున్నాను. www.safaindia.org ద్వారా మా ‘సఫా’ ఉత్పత్తుల్ని చాలామంది కొనుగోలు చేస్తున్నారు’’ అని వివరించారు రుబీనా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement