కేక్ కట్ చేస్తారు...హార్ట్ టచ్ చేస్తారు | Heart Touch is made ​​to cut the cake ... | Sakshi
Sakshi News home page

కేక్ కట్ చేస్తారు...హార్ట్ టచ్ చేస్తారు

Published Mon, Dec 16 2013 11:46 PM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

కేక్ కట్ చేస్తారు...హార్ట్ టచ్ చేస్తారు - Sakshi

కేక్ కట్ చేస్తారు...హార్ట్ టచ్ చేస్తారు

జీవితం ఒక తియ్యని వేడుక.
 అందరికీనా?
 అవును. పిల్లల మధ్య గడిపేవారందరికీ!
 పిల్లల్లో కలిసిపోతే...
 పెద్దవాళ్లక్కూడా ఆడిపాడాలనిపిస్తుంది.
 స్ఫూర్తి హోమ్ పిల్లలతో కలిస్తే మాత్రం...
 ఆటపాటలతో పాటుబర్త్‌డే కూడా జరుపుకోవాలనిపిస్తుంది.
 అంత తియ్యగా సెలబ్రేట్ చేస్తారు వారు!
 సంతోషాన్ని పంచాలని వచ్చే విజిటర్స్...
 చివరికి పిల్లలు పంచిన సంతోషాన్ని తమ గుండెల్లో నింపుకుని వెళతారంటే చూడండి...
 అరేంజ్‌మెంట్స్ ఎలా ఉంటాయో!
 ఆ అనాథ పిల్లలు జరిపే ఆత్మీయ వేడుకలే ఈవారం ‘ప్రజాంశం’.

 
అనాథపిల్లలు, అనాథ వృద్ధుల సమక్షంలో ఆనందంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అరుదైన సంగతేమీ కాదు. ఎందుకంటే అనాథాశ్రమాల్లో మనం పుట్టినరోజు చేసుకుంటున్నామంటే... ఆ పిల్లలు మనబోటి అతిథులు తెచ్చే చాక్లెట్ల కోసం ఎదురుచూస్తారని, కొత్తబట్టిలిస్తే ఆనందపడతారని అనుకుంటాం. అయితే ‘స్ఫూర్తి ఆర్ఫన్ హోమ్’ లోని పిల్లలు మాత్రం వచ్చిన అతిథిని ఎలా సంతోషపరచాలా అని ఆలోచిస్తారు. అతిథి పుట్టినరోజు వచ్చిందంటే చాలు వారి ఆశ్రమాన్ని అందంగా అలంకరించేస్తారు. ఇటువంటి ఆర్ఫన్‌హోమ్స్ గురించి చాలామందికి తెలియదు. ‘స్ఫూర్తి’ ఫౌండేషన్ హోమ్‌లో జరిగే అతిథుల పుట్టినరోజు వేడుకల వెనక ఉన్న ఉత్సాహం గురించి ఉల్లాసంగా చెప్పేదే ఈ కథనం...
 
సినిమారంగం, రాజకీయరంగం, ఐటి ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు... చాలామందికి ‘స్ఫూర్తి’ ఆశ్రమంలోని పిల్లల సన్నిధి నచ్చుతుంది. ఓ గంట కాలక్షేపం చేసి వెళ్లిపోదాం అనుకుని వచ్చినవారు అక్కడ నుంచి వెంటనే కదలలేకపోతారు. లంచ్ టైమ్‌కి వచ్చినవాళ్లు డిన్నర్ కూడా చేసి వెళతారు. ఆ పిల్లల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే... ‘సెలబ్రేషన్’ అంటారు ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీవ్యాల్. ‘‘మా హోమ్‌లో పుట్టినరోజు జరుపుకునేవారు ముందుగానే ఫోన్ చేస్తారు. దాంతో మా పిల్లలు ఆ రోజు సాయంత్రానికల్లా హోమ్‌ని అందంగా అలంకరించేస్తారు.

క్యాండిల్ దగ్గర నుంచి వెల్‌కమ్ బెలూన్ల వరకూ అన్నీ సిద్ధం చేస్తారు. ఒకవేళ వచ్చేది పెద్ద సెలబ్రెటీ అయితే, వెల్‌కమ్ బ్యానర్లు కూడా సిద్ధం చేస్తారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి నా ప్రమేయం ఏమీ ఉండదు. అంతా మా పిల్లలే చూసుకుంటారు. పాటలు, డ్యాన్సులు... అన్ని ఏర్పాట్లూ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. పుట్టినరోజు జరుపుకునేవారు చిన్న పిల్లలైతే... బెలూన్లు, బొమ్మలతో అలంకరిస్తారు. అదే పెద్దవాళ్లయితే రంగురంగుల పూలు, మంచిమంచి వాక్యాలతో అలంకరిస్తారు. ఇవీన్న చూసి వచ్చిన అతిథులు ఆనందిస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్.
 
 స్కూలు ఆలోచన...
 
అమెరికాలో ఎమ్‌ఏ చదువుకున్న శ్రీవ్యాల్‌కి అనాథాశ్రమం స్థాపించాలన్న ఆలోచన రావడం వెనుక ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. చదువు పూర్తయ్యాక పేదపిల్లల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాలను స్థాపిద్దామనుకున్నాను. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాక కొంతకాలం ఉద్యోగం చేశాను. ‘అన్నమో రామచంద్రా!’ అంటూ అన్నం కోసం అల్లాడే అనాథపిల్లలు కొందరు కంటపడడంతో, పాఠశాల కంటె ముందు, అనాథాశ్రమం స్థాపించాలనుకున్నాను. 2006లో హైదరాబాద్ చర్లపల్లి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ‘స్ఫూర్తి’ పేరుతో ఆశ్రమం ప్రారంభించాను. ముగ్గురు పిల్లలతో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పుడు 192 మంది అనాథ పిల్లలున్నారు.
 
మొదట్లో నా ఆలోచనకు కేవలం నలుగురు స్నేహితులు మాత్రమే అండగా నిలబడ్డారు. రోజులు గడిచేకొద్దీ నన్ను అర్థం చేసుకునేవారి సంఖ్య పెరిగింది. కొందరు ఎన్నారై మిత్రులతోబాటు ఇక్కడిస్నేహితులు, బంధువులు, ప్రైవేటు స్కూలు టీచర్లు... ఇలా దాతల సర్కిల్ పెంచుకున్నాను. మా హోమ్‌లో పిల్లల్ని చేర్పించడానికి... పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పరిచయస్థులు ఫోన్లు చేస్తూనే ఉంటారు’’ అన్నారు శ్రీవ్యాల్. ఆయన చెప్పే మాటలకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి ఆ హోమ్ గోడలపై ఉన్న పెయింటింగ్స్. ఈ ఏడాది జూన్‌లో ఈ హోమ్ పిల్లలు వేసిన పెయింటింగ్స్‌ని బంజారాహిల్స్‌లోని ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రం ఫొటో ఎగ్జిబిషన్ గా ప్రదర్శించింది.
 
 ఫస్ట్ బర్త్‌డే ప్రత్యేకత
 
 ‘‘మా హోమ్‌లో వారానికొక గెస్ట్ పుట్టినరోజు తప్పనిసరిగా ఉంటుంది. తమ చిన్నారుల మొదటిపుట్టినరోజు మాతో కలసి చేసుకోవాలనుకునేవారు నెలకు, రెండు నెలలకు ఒకసారి వస్తుంటారు. ఫస్ట్ బర్త్‌డే అనగానే మా పిల్లలకు ఎక్కడిలేని సంతోషం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చే అతిథులు మా పిల్లలకు కొత్తబట్టలు తేవడం, మధ్యాహ్నం స్పెషల్ భోజనం... చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇవ్వడం వంటి ప్రత్యేకతలుంటాయి. ఇక సెలబ్రిటీలైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు తమతో గడపడమే పెద్ద బహుమతిగా భావిస్తారు మావాళ్లు. వీరు గాక కాలేజీ పిల్లలు, ఐటి ఉద్యోగులు కూడా వచ్చి, దాదాపు వీకెండ్స్ అంతా ఇక్కడే గడుపుతారు. ఈ పిల్లలతో క్యారమ్స్, ఫుట్‌బాల్, క్రికెట్... వంటి ఆటలు ఆడుతూ టైమ్‌పాస్ చేస్తారు’’ అని చెప్పారు శ్రీవ్యాల్.
 
తల్లిదండ్రులు లేని పిల్లలను అక్కున చేర్చుకోవడం బాగానే ఉంటుంది. కాని వారు ఆశ్రమంలో ఉన్నంతకాలం వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ఆనందంగా ఉంచడం చాలా కష్టం. ఆ కష్టాన్ని శ్రీవ్యాల్ అధిగమించారనే చెప్పాలి. పిల్లల్ని చదివించడంతో పాటు, ఆడిస్తుంటారు. అప్పుడప్పుడు జూపార్క్‌కి, సినిమాలకు, పార్కులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు తీసుకెళ్తారు. మరి అంతమందిని బయటికి తీసుకెళ్లడమంటే మాటలు కాదు. అందుకే తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సాయం చేస్తామని ముందుకొచ్చినవారితో ‘‘మా పిల్లలు ఫలానా ప్రోగ్రామ్ చూడాలంటున్నారు’ అని మాత్రం చెబుతారు. ఇష్టమైనవారు దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారు. లేదంటే నేనే చేసుకుంటాను’’ అంటారు శ్రీవ్యాల్.
 
 అనాథ పిల్లలను సొంత పిల్లల్లా అక్కున చేర్చుకుని నిరంతరం వారిని ఉత్సాహంగా ఉంచుతున్న శ్రీవ్యాల్ సేవలు అభినందనీయం.
 
 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు దాతల దొడ్డమనసు
 ‘‘ప్రస్తుతం మా హోమ్ పిల్లలంతా ప్రైవేటు స్కూల్స్‌లో చదువుకుంటున్నారు. వీరి కోసం భవిష్యత్తులో సొంతంగా స్కూలు నిర్మించాలనుకుంటున్నాను. మా హోమ్‌లో పిల్లలకే కాకుండా బయట పాఠశాలల్లోని 30మంది పేద విద్యార్థులకు స్కూలు ఫీజు చెల్లిస్తున్నాను. ఈ డబ్బంతా నా కష్టార్జితం కాదు. దాతల దొడ్డమనసు. స్ఫూర్తి పిల్లలు పదిమందికి స్ఫూర్తిగా ఎదగాలని కోరుకునేవారి కోరిక ఫలితమే మా పిల్లల కళ్లలోని వెలుగుల రహస్యం’’
  - శ్రీవ్యాల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement