అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రదేశాల్లోనే జబ్బువస్తే నయం చేసుకోడానికి బోలెడు తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది ఆసుపత్రి అనే పదానికి అందనంత దూరంలో ఉండే మారుమూల కొండప్రాంతాల గిరిజనవాసులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పరిస్థితి ఏంటి? ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే మలేరియా జబ్బు గ్రామాలను పట్టిపీడిస్తుంటే వారిని ఎవరు రక్షిస్తారు? గత ఇరవైఏళ్లుగా గిరిజన గ్రామాల్లో ఆరోగ్యసేవలందిస్తున్న ఈశ్వరరావుని పలకరిస్తే అడవిబిడ్డలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం ఏంటో అర్థమవుతుంది మనకు.
విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో 49 గ్రామాల్లో గిరిజన ప్రజలు వర్షం పేరు చెబితే వణికిపోతారు. ఆ వణుకొచ్చేది వానతోపాటు వచ్చే చలివల్ల కాదు. వర్షం వచ్చినపుడు కొండప్రాంతాల నుంచి వచ్చే కలుషితనీటి వల్ల. గిరిజనవాడలంటేనే శుభ్రత అంతంతమాత్రం. దానికి తోడు ఇళ్ల ముందుండే పశువుల కొట్టాలు. కారణాలేవైతేనేం, చినుకు పడడంతోటే జ్వరాలు మొదలవుతాయి. వచ్చింది మలేరియా అని తెలిస్తే ఎలాగోలా ఆసుపత్రికెళ్లి వైద్యం చేయించుకుని బతికి బట్టకడతారు.
కాని, తమకు వచ్చిన జబ్బేమిటనేది కూడా వారికి అవగాహన లేకపోతే ఏం చేస్తారు..! ఆ సమయంలో ఈశ్వరరావుకు ఒక ఆలోచన వచ్చింది. గిరిజన ప్రాంతాల్లోని మహిళలు, ఆరోగ్యం అనే అంశాలపై సేవ చేయాలనుకున్నారు. ‘స్వీట్’ (సొసైటీ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ట్రైనింగ్) పేరుతో స్వచ్ఛందకార్యకర్తల సాయంతో ఆ గ్రామాలకెళ్లి ‘మలేరియా’పై పోరాడుతున్నారు.
అవగాహన, వైద్యం...
‘‘చైతన్య యువజన సేవాసంఘం పేరుతో 1991లో గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి, నాకు చేతనైనంత సేవ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మారుమూల గ్రామాల్లో మలేరియా వల్ల గిరిజనులు బాగా ఇబ్బందిపడుతున్నారని తెలిసి వారికి అందుబాటులో ఉండాలనుకున్నాను. అందుకే 1997లో ‘స్వీట్’ ఆర్గనైజేషన్ స్థాపించాను. 49 గ్రామాల్లో... గ్రామానికి ఒకరు చొప్పున వాలంటీర్లను ఏర్పాటుచేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాను. వర్షం చినుకులు పడడంతోటే గ్రామాల్లోని ప్రజలకు వైద్యపరీక్షలు మొదలుపెట్టేస్తాం.
మలేరియా వచ్చినవారికి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తాం. వీటన్నిటికంటే ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యపరంగా అభివృద్ధి ఉన్న గ్రామాల్లో మార్పు తేవడం కొంతవరకూ సులువు. కాని ఇక్కడ గిరిజన గ్రామాల ప్రజల జీవనవిధానాల్లో మార్పులు తేవడం అంత తేలిక కాదు. ఇలా ఇరవై ఏళ్ల నుంచి ఇంటింటికీ తిరుగుతుంటే... ఎట్టకేలకు వారిలో కొద్దిపాటి మార్పు వచ్చింది’’ అని చెప్పారు ఈశ్వరరావు. ‘స్వీట్’ చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించి ‘వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ మలేరియా నిర్మూలన ప్రాజెక్టును వీరికి అప్పగించింది.
కుష్ఠు రోగులకు కూడా...
సీజనల్‌గా వచ్చే మలేరియా వంటి జబ్బులొక్కటే కాకుండా కుష్ఠువ్యాధి బాధితులపైన కూడా ‘స్వీట్’ దృష్టి పెట్టింది. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’ వారి సహకారంతో ఆ గ్రామాల్లో కుష్ఠువ్యాధి గ్రస్థులకు వైద్యం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. విద్య, వైద్యసౌకర్యాలు అందుబాటులో లేనిచోట ఎన్నిరకాల జబ్బులైనా వస్తాయి. గ్రామాల్లో ఆ రెండింటినీ ఏర్పాటుచేస్తే తప్ప ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరకదు. మా సంస్థ లక్ష్యాల్లో మరొకటి మహిళా సంక్షేమం. వారికి ఉపాధి అవకాశాల్లో భాగంగా అరటినారతో బ్యాగుల్ని తయారుచేయడంలో శిక్షణ ఇప్పిస్తున్నాం’’ అని ముగించారు ఈశ్వరరావు. ‘స్వీట్’ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం.
- భువనేశ్వరి
‘స్వీట్’గా నయం చేస్తారు
Published Mon, Dec 9 2013 11:54 PM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
Advertisement