eswar rao
-
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్ను మూశారు. మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా అక్టోబర్ 31న మృతి చెందారు. ఆయన స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. తన కెరీర్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. (ఇది చదవండి: తమిళనాట సూపర్ స్టార్ ఎవరు.. క్లారిటీ ఇచ్చిన విజయ్) తొలి సినిమా స్వర్గం నరకం హిట్ అందుకున్న ఆయన కాంస్య నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత దేవతలారా దీవించండి, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. చివరిసారిగా చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కనిపించారు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా షేర్ చేసిన వీడియో.. ట్రోల్ అవుతున్న రిషబ్ పంత్) -
పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్.. ఆయన చిత్రం సజీవం
ప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్ కొసనా ఈశ్వరరావు (ఈశ్వర్) ఇక లేరు. మంగళవారం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్ వయసు 84 ఏళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు ప్రాంతం ఆయన స్వస్థలం. ప్రముఖ డిజైనర్ కేతా శిష్యుడిగా మొదలై, బాపు దర్శకత్వంలోని ‘సాక్షి’ (1967)తో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్ శుభారంభం పలికారు. అనంతరం హిందీ చిత్రం ‘రామ్ ఔర్ శ్యామ్’కి పబ్లిసిటీ పనులను ‘విజయా’ విశ్వనాథ రెడ్డి ఆయనకు అప్పగించారు. వాటర్ కలర్లో రూపొందించిన ఈ పోస్టర్లు ఆయిల్ పెయింట్ పోస్టర్ల కన్నా బాగున్నాయని ఆ చిత్రనిర్మాతల్లో ఒకరైన బి. నాగిరెడ్డి ప్రశంసించారు. వాటిని చూసిన రామానాయుడు ‘పాపకోసం’కి ఈశ్వర్‌కు అవకాశం ఇస్తే, బ్రష్ వాడకుండా నైఫ్ వర్క్ చేసి వాల్ పోస్టర్లు రూపొందించారు. తెలుగు, తమిళ, హిందీ ‘ప్రేమనగర్’ సినిమా పోస్టర్ల వినూత్న సృష్టికి మంచి ప్రాచుర్యం లభించింది. అప్పటి నుంచి ఒక లైన్ డ్రాయింగ్ ఉండేలా పోస్టర్లకు కొత్తదనం తీసుకొచ్చారు ఈశ్వర్. పబ్లిసిటీ డిజైనర్‌గా 40 ఏళ్ళు నిర్విరామంగా కృషి చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2600కుపైగా చిత్రాలకు పనిచేశారు ఈశ్వర్. విజయా, ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలకు పబ్లిసిటీ డిజైనర్‌గా చేశారాయన. కొత్తదనం కోసం పుస్తకాలూ, హిందీ పోస్టర్లూ పరిశీలిస్తూ నైపుణ్యాన్ని పెంచుకునేవారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఈశ్వర్ డిజైన్ చేశారు. అక్షరశిల్పిగా పేరు పొందిన తన తమ్ముడు బ్రహ్మంతో కలిసి ‘జయ’ యాడ్స్ పేరుతో కొన్ని కన్నడ సినిమాలకు సొంతంగా పబ్లిసిటీ డిజైన్లు రూపొందించడం మొదలెట్టారు ఈశ్వర్. ఆ తర్వాత ‘ఈశ్వర్’ పేరుతోనే సొంత పబ్లిసిటీ కంపెనీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగంలో వినియోగిస్తున్న తెలుగు అక్షరాలు (ఫాంట్) చాలా వరకు ఆయన తన తమ్ముడు బ్రహ్మంతో కలసి రూపొందించినవే. ఈశ్వర్ ఆఖరి చిత్రం ‘దేవుళ్లు’. ఈశ్వర్ గీసిన చిత్రాలు సజీవం. ఆ చిత్రాల ద్వారా ఈశ్వర్ కూడా సజీవమే. ఈశ్వర్ భార్య పేరు వరలక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈశ్వర్ మృతి పట్ల హీరో బాలకృష్ణ, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు, యువచిత్ర అధినేత మురారి, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రాతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం ఉదయం చెన్నైలో ఈశ్వర్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈశ్వర్ మంచి రచయిత కూడా. 2011లో ఆయన రాసిన ‘సినిమా పోస్టర్’కు నంది అవార్డు లభించింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారంతో ఈశ్వర్ని సత్కరించింది. అమితాబ్ నుంచి నంది అవార్డు అందుకుంటూ... అప్పటికి సినిమా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎక్కువగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కానీ, సాంకేతిక నిపుణుల్లో ఛాయాగ్రాహకుడు యం.ఎ. రహమాన్ (1983) తొలిసారి ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారాన్ని అందుకోగా, పబ్లిసిటీ రంగం నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి సాంకేతిక నిపుణులు ఈశ్వర్ కావడం విశేషం. ప్రముఖ తమిళ రాజకీయ నాయకుడు అణ్ణాదురై చిత్రాన్ని గీయాల్సిందిగా ఈశ్వర్ ఇంటికి నాటి ముఖ్యమంత్రి కరుణానిధి వెళ్లడం ఓ విశేషం. 1970 దీపావళి పండగకు ఆరు తమిళ సినిమాలు విడుదలయితే అన్నిటికీ పబ్లిసిటీ డిజైన్లు చేసినది ఈశ్వరే. తెలుగులో అగ్రహీరోల చిత్రాలకు పని చేసిన ఈశ్వర్ తమిళంలో యమ్జీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జయశంకర్, శివకుమార్ వంటి అగ్రశ్రేణి హీరోల సినిమాలకు పబ్లిసిటీ డిజైన్లు రూపొందించారు. ఈ అవకాశం దక్కింది ఒక్క ఈశ్వర్‌కే. ‘సౌత్ ఇండియన్ పబ్లిసిటీ డిజైనర్స్’ సంఘానికి ఈశ్వర్ పదేళ్లు అధ్యక్షులుగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈశ్వర్ చేత బాలాజీ నేత్రదర్శనం, అర్చనానంతర దర్శనం, పూలంగి సేవాదర్శనం చిత్రాలను వేయించి, వాటిని క్యాలండర్లుగా ప్రచురించాలనుకున్నారు. అందుకోసం కొన్ని రోజుల పాటు గర్భగుడిలో స్వామికి ఎదురుగా కూర్చుని స్కెచ్‌లు గీయడం తన జీవితంలో మరపురాని సందర్భం అనేవారు ఈశ్వర్. -
ఎమ్మెల్సీ ఇస్తామని.. సీఎం మోసగించారు
చిత్తూరు కార్పొరేషన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సేవలను వినియోగించుకొని.. ఇప్పుడు పూర్తిగా విస్మరించారని ఆ పార్టీ సీనియర్ నేత రావూరి ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఓ సమావేశానికి హాజరైన విలేకరులతో వివిధ అంశాలపై మాట్లాడారు. 2003లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరి జిల్లా ఉపాధ్యక్షుడిగా, బీసీ విభాగం రాష్ట్ర నాయకుడిగా పలు కార్యక్రమాలు చేసినట్లు వెల్లడిం చారు. రావూరి ఈశ్వరరావు ట్రస్ట్, యువసేనను స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేశానన్నారు. 750 వరకు పార్టీ కార్యక్రమాలు చేశానన్నారు. రూ.100 కోట్ల విలువైన ఎక్స్పోర్ట్ వ్యాపారంలో నష్టపోయినట్లు పేర్కొన్నారు. 2004, 2009లో ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని తిరుమలలో వెంకన్న సాక్షిగా చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను సైతం నిలబెట్టుకోలేదన్నారు. బీసీల్లో మంత్రి కాల్వశ్రీనివాసరావు తర్వాత రాయలసీమలో తానే ముఖ్య నాయకుడివని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తన సమస్యను మంత్రి అమరనాథ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేదన్నారు. తనను.. ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం పలకరించడం కూడా లేదన్నారు. టీడీపీలో బీసీలకు సముచిత స్థానం దక్కడం లేదన్నారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులు, రీయింబర్స్మెంట్ సక్రమంగా అందకపోవడం బాధాకరమని వాపోయారు. -
నిందితుడి ఆత్మహత్యాయత్నం
హత్యకేసులో దొరుతాననే భయమే కారణం అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించిన పోలీసులు పాలకొండ: ఓ మహిళ హత్యకేసులో నిందితుడిగా ఉంటూ తప్పించుకు తిరుగుతున్న అనుమానితుడు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు బ్లేడుతో చేయి కోసుకున్నాడు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణం నవోదయనగర్‌లో ఆమిటి ప్రమీల అనే మహిళ ఈ నెల 10న హత్యకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ హత్య జరిగిన నాటి నుంచి సమీప బంధువు గొడవ ఈశ్వర్రావు తప్పించుకు తిరుగుతున్నాడు. ఈశ్వర్ రావు వృత్తి రీత్యా వంట పని చేస్తాడు. విజయనగరం జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయనపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ మధ్య ఈశ్వర్ పోలీసులకు ఫోన్ చేసి 'ఈ హత్య నేనే చేశా.. దమ్ముంటే నన్ను పట్టుకోండి' అని పోలీసులకు సవాల్ విసిరాడు. ఈశ్వర్రావుతో పాటు అతడి బంధువుల ఇళ్లపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. బుధవారం రోజున ఈశ్వర్ సమీప బంధువుల ఇంటికి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. దొరుకుతాననే భయంతో ఈశ్వర్రావు చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈశ్వర్రావుని అరెస్ట్ చేసి చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. -
‘స్వీట్’గా నయం చేస్తారు
అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రదేశాల్లోనే జబ్బువస్తే నయం చేసుకోడానికి బోలెడు తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది ఆసుపత్రి అనే పదానికి అందనంత దూరంలో ఉండే మారుమూల కొండప్రాంతాల గిరిజనవాసులకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పరిస్థితి ఏంటి? ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే మలేరియా జబ్బు గ్రామాలను పట్టిపీడిస్తుంటే వారిని ఎవరు రక్షిస్తారు? గత ఇరవైఏళ్లుగా గిరిజన గ్రామాల్లో ఆరోగ్యసేవలందిస్తున్న ఈశ్వరరావుని పలకరిస్తే అడవిబిడ్డలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం ఏంటో అర్థమవుతుంది మనకు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో 49 గ్రామాల్లో గిరిజన ప్రజలు వర్షం పేరు చెబితే వణికిపోతారు. ఆ వణుకొచ్చేది వానతోపాటు వచ్చే చలివల్ల కాదు. వర్షం వచ్చినపుడు కొండప్రాంతాల నుంచి వచ్చే కలుషితనీటి వల్ల. గిరిజనవాడలంటేనే శుభ్రత అంతంతమాత్రం. దానికి తోడు ఇళ్ల ముందుండే పశువుల కొట్టాలు. కారణాలేవైతేనేం, చినుకు పడడంతోటే జ్వరాలు మొదలవుతాయి. వచ్చింది మలేరియా అని తెలిస్తే ఎలాగోలా ఆసుపత్రికెళ్లి వైద్యం చేయించుకుని బతికి బట్టకడతారు. కాని, తమకు వచ్చిన జబ్బేమిటనేది కూడా వారికి అవగాహన లేకపోతే ఏం చేస్తారు..! ఆ సమయంలో ఈశ్వరరావుకు ఒక ఆలోచన వచ్చింది. గిరిజన ప్రాంతాల్లోని మహిళలు, ఆరోగ్యం అనే అంశాలపై సేవ చేయాలనుకున్నారు. ‘స్వీట్’ (సొసైటీ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రైనింగ్) పేరుతో స్వచ్ఛందకార్యకర్తల సాయంతో ఆ గ్రామాలకెళ్లి ‘మలేరియా’పై పోరాడుతున్నారు. అవగాహన, వైద్యం... ‘‘చైతన్య యువజన సేవాసంఘం పేరుతో 1991లో గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి, నాకు చేతనైనంత సేవ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మారుమూల గ్రామాల్లో మలేరియా వల్ల గిరిజనులు బాగా ఇబ్బందిపడుతున్నారని తెలిసి వారికి అందుబాటులో ఉండాలనుకున్నాను. అందుకే 1997లో ‘స్వీట్’ ఆర్గనైజేషన్ స్థాపించాను. 49 గ్రామాల్లో... గ్రామానికి ఒకరు చొప్పున వాలంటీర్లను ఏర్పాటుచేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాను. వర్షం చినుకులు పడడంతోటే గ్రామాల్లోని ప్రజలకు వైద్యపరీక్షలు మొదలుపెట్టేస్తాం. మలేరియా వచ్చినవారికి దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తాం. వీటన్నిటికంటే ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యపరంగా అభివృద్ధి ఉన్న గ్రామాల్లో మార్పు తేవడం కొంతవరకూ సులువు. కాని ఇక్కడ గిరిజన గ్రామాల ప్రజల జీవనవిధానాల్లో మార్పులు తేవడం అంత తేలిక కాదు. ఇలా ఇరవై ఏళ్ల నుంచి ఇంటింటికీ తిరుగుతుంటే... ఎట్టకేలకు వారిలో కొద్దిపాటి మార్పు వచ్చింది’’ అని చెప్పారు ఈశ్వరరావు. ‘స్వీట్’ చేస్తున్న సేవాకార్యక్రమాలను గుర్తించి ‘వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థ మలేరియా నిర్మూలన ప్రాజెక్టును వీరికి అప్పగించింది. కుష్ఠు రోగులకు కూడా... సీజనల్‌గా వచ్చే మలేరియా వంటి జబ్బులొక్కటే కాకుండా కుష్ఠువ్యాధి బాధితులపైన కూడా ‘స్వీట్’ దృష్టి పెట్టింది. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’ వారి సహకారంతో ఆ గ్రామాల్లో కుష్ఠువ్యాధి గ్రస్థులకు వైద్యం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. విద్య, వైద్యసౌకర్యాలు అందుబాటులో లేనిచోట ఎన్నిరకాల జబ్బులైనా వస్తాయి. గ్రామాల్లో ఆ రెండింటినీ ఏర్పాటుచేస్తే తప్ప ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరకదు. మా సంస్థ లక్ష్యాల్లో మరొకటి మహిళా సంక్షేమం. వారికి ఉపాధి అవకాశాల్లో భాగంగా అరటినారతో బ్యాగుల్ని తయారుచేయడంలో శిక్షణ ఇప్పిస్తున్నాం’’ అని ముగించారు ఈశ్వరరావు. ‘స్వీట్’ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. - భువనేశ్వరి