బిగ్‌షాట్‌ల భిక్షాటన! | బిగ్‌షాట్‌ల భిక్షాటన! | Sakshi
Sakshi News home page

బిగ్‌షాట్‌ల భిక్షాటన!

Published Mon, Sep 2 2013 11:32 PM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

బిగ్‌షాట్‌ల భిక్షాటన!

బిగ్‌షాట్‌ల భిక్షాటన!

కోట్ల రూపాయలున్నాయి.
 కానీ డబ్బులతో అయ్యే పని కాదు!
 ఏసీ రూములున్నాయి.
 కానీ చల్లదనంతో తీరే తాపం కాదు!
 ఖరీదైన కార్లు ఉన్నాయి.
 కానీ టైర్లు వెళ్లగలిగిన దారి కాదు!
 సూట్లు, బూట్లు ఉన్నాయి.
 కానీ ఏవీ సూటయ్యేవి కాదు!
 దీక్షాదక్షతలున్నాయి.
 కానీ మాటల వ్యాపారం కాదు!
 కాదు... కాదు... కాదు... కాదు!!
 ఇన్ని ఉండి... ఎందుక్కాదు?
 ఎందుకంటే అది... ‘సాధుజీవితం’!
 అందుకే వాళ్లు అన్నీ వదులుకున్నారు!
 ఒక్కరోజైనా ‘సాధు సంపన్నంగా’...
 ఉండాలనుకున్నారు.
 నోటికి వస్త్రం కట్టుకుని...
 మౌనంగా భిక్షాటనకు బయల్దేరారు.
 చివరికి ఏం సాధించారు?
 చదవండి... ఈవారం ‘ప్రజాంశం’లో.

 
 మడత నలగని సూట్లూ, కాలికి మట్టి అంటనివ్వని కార్లూ, కాస్తయినా చెమటపట్టనివ్వని ఎయిర్‌కండిషనర్లూ, మెత్తని డబుల్‌కాట్‌లూ... ఇన్నిరకాల సౌకర్యాల మధ్య అత్యంత ‘ఖరీదైన’ జీవితం గడిపే ఆ సంపన్నులు...తాము ధనవంతులమని మరిచిపోయారు. ధవళవస్త్రాలు ధరించారు. కార్లు వదిలారు. కాలిబాట పట్టారు. ‘బిజీ’నెస్ వదిలి రోజంతా భిక్షాటన చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే సన్యసించారు. ఈ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.
 
 ఓ పూటంతా మౌనవ్రతం ఉండమంటే ప్రాణం పోయినట్టు ఫీలైపోయేవాళ్లుంటారు. టీవీ చూడకుండా క్షణం గడపలేని వాళ్లు,  గంటసేపు సెల్‌ఫోన్ మోగకపోతే గిలగిలలాడేవాళ్లు సగటుమనుషుల్లోనే ఎందరో! అలాంటిది కోట్లరూపాయల వ్యాపారాలు చేసే సంపన్నుల సంగతి ఇక చెప్పేదేముంది... కాలాన్ని కాసుల్తో లెక్కించే ఈ రోజుల్లో... వ్యాపారం నుంచి కాస్త విరామం తీసుకోవడానికే విలవిల్లాడే పరిస్థితుల్లో ఒక బిజినెస్ పర్సన్ రోజంతా అన్నింటికీ దూరంగా గడపడమంటే మాటలు కాదు. అటువంటిది ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా వెయ్యిమంది అదే పనిచేస్తే... కోట్లరూపాయల లావాదేవీలు స్తంభించడం అటుంచి... కార్లు, ఏసీలు ఆఖరికి ఫ్యాన్లూ కూడా లేకుండా ఒక రోజంతా గడపడం, ఏమీ లేనితనాన్ని అనుభవిస్తూ  యాచించడం... సాధ్యమేనా? ‘భిక్షూదయ’ దీన్ని సాధ్యం చేసింది.
 
 ఏమిటీ ‘భిక్షూదయ’?

 
 మన సంప్రదాయంలో సన్యాసులకు, సాధుపుంగవులకు విశిష్ట స్థానం ఉంది. వారి జీవనశైలిని గొప్పగా కీర్తిస్తాం కానీ, అనుసరించలేం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి... కుటుంబాన్ని, సౌకర్యాలను వదిలి పూర్తిగా ఒక సాధువుగా మారలేడు. ఈ నేపథ్యంలో జైన్ కమ్యూనిటీ... ప్రస్తుత జైనుల పండుగ రోజుల్ని పురస్కరించుకుని... ఓ వైవిధ్యభరితమైన ఆలోచన చేసింది. వ్యాపారం, లాభనష్టాలు అంటూ అందులో కూరుకుపోతూ... సాధువులు, సన్యాసులు, ప్రవక్తలు వచ్చినప్పుడు మాత్రం ఇంటికి తీసుకువచ్చి వారిని పూజించి దీవెనలు అందుకోవడంతో సరిపెట్టుకోకుండా... ఒక సాధువు జీవితంలోని నిజమైన అనుభూతిని ఆస్వాదించే అవకాశాన్ని ఆధునికులకు అందించాలని జైన్ సమాజం తలచింది. ఒక్కరోజైనా పూర్తిగా  సాధు జీవితాన్ని అనుభవించే అవకాశమది. దానికి పెట్టిన పేరే భిక్షూదయ. క్షణం తీరిక లేకుండా వ్యాపార వ్యవహారాల్లో మునిగితేలే వారిని ఒప్పించి అరుదైన విన్యాసానికి తెరతీసింది భిక్షూదయ. ఈ కార్యక్రమానికి వందమంది వచ్చినా చాలనుకుంటే... అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, వెయ్యిమంది సంపన్నులు సాధువులుగా మారి ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఒక అద్భుతమైన, అపురూపమైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా అందర్నీ ఆకట్టుకుంది.
 
 బొల్లారంలోని సదార్ బజార్, బర్టన్ రోడ్‌లో ఉన్న శివ్‌కుశాల్ గార్డెన్‌లోని ఓ ఇల్లు. ఆ ఇంట్లో... కోట్లరూపాయల వ్యాపారం చేసే వ్యాపారులు, పెద్ద పెద్ద కంపెనీల సిఈఓలు, వృత్తి నిపుణులు... అన్నీ త్యజించి (తాత్కాలికంగా) సన్యాసులుగా మారి, ఒకచోటకు చేరారు. ప్రార్థనా మందిరంగా పిలువబడే ఈ భవనంలో అత్యంత నిరాడంబరంగా, ఆధునికతకు ఎటువంటి అవకాశమూ ఉండకూడదని ఎటువంటి విద్యుత్ సౌకర్యాలూ లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు.
 
 ఎలా గడిచింది?
 
 ఆ రోజు ప్రార్థన, శాంతి ర్యాలీలతో ప్రారంభమైంది. పాదరక్షలు లేకుండా, చోల్‌పాట, దుపట్టి అని పిలిచే దుస్తులను ధరించారు. ముహపటి పేరుతో పిలిచే మాస్క్‌లాంటిది నోటికి కట్టుకున్నారు. అనంతరం భిక్షువులుగా మారారు. (ఆ రోజున భిక్షువులు కోరికలతో, ఆకాంక్షలతో ఉన్న అనుబంధాల్ని, హద్దులను తెంచుకునేందుకున్న అడ్డంకుల్ని అధిగమించి ఆత్మకు స్వేచ్ఛను ప్రసాదిస్తారు. మానవులెవరి హానికీ తాము కారణం కాకుండా ఉండడం ఎలాగో నేర్చుకుంటారు. అంతర్గత ఆలోచనల నియంత్రణ  సాధించేందుకు అవసరమైన ‘సమైక్య’ పేరిట ధ్యానం, బ్రహ్మచర్యం అలవరచుకుంటారు) అడగడం అలవాటే లేని వీరు... భిక్షాటనకు సైతం వెరవక సమీప ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి యాచించారు. అదీ మౌనవ్రతం పాటిస్తూనే. అలావచ్చిన భిక్ష ‘గోచారి’ని ప్రార్థనామందిరంలో పంచుకున్నారు. ఇందులో ఒక్క మెతుకు కూడా వృథా పోనీయకుండా, తినగా మిగిలిన ఆహారం ఏమైనా ఉంటే... అన్నార్తులకు అందజేశారు. ప్రతిక్రమణ్ (సకల చరాచర జీవుల పాపాలను క్షమించాలని చేసే ప్రార్థన)తో ఈ దీక్ష ముగిసింది. అనంతరం ‘తమ జీవిత కాలంలో భూమి మీద నివసించే ఏ ప్రాణికీ ఎటువంటి హానీ తలపెట్టము’ అని ప్రతిజ్ఞ చేశారు.
 
 ఈ కార్యక్రమానికి అవసరమైన వెయ్యి భిక్షపాత్రల్ని ఉచితంగా అందించడంతో పాటు వీరందరితో కలిసి ఆధ్యాత్మిక ఆస్వాదన చేయడం ప్రశాంత చిత్తాన్ని అందించిందని, ఇది తనకు అంతర్గతంగా ఎంతో శక్తిని అందించిన  భావన కలుగుతోందని, దీని ప్రభావం తనమీద కనీసం మరో ఆరు నెలలైనా బలంగా ఉంటుందని వీరికి అవసరమైన భిక్షాపాత్రల్ని సమకూర్చడమేగాక, ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న ఆదర్శ్‌గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కేవల్‌చంద్ రాథోడ్ ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
 
 ఉపసంహారం...
 
 ఏమీ లేకుండా ఈ లోకంలోకి వచ్చే మనం, ఏమీ లేకుండానే ఇక్కడినుంచి నిష్ర్కమిస్తాం. ఎందరో మనుషులు, ఎన్నెన్నో అనుబంధాలు, ఆశలు, ఆకాంక్షలు, జయాపజయాలు... ఇవన్నీ ఆగమనానికి, నిష్ర్కమణకు మధ్య చోటు చేసుకుంటాయి. ఇదంతా మెలకువ రాగానే మాయమయ్యే కలలాంటిదేనని తెలిసినా అందులోనే కూరుకుపోతాం. నిద్రావస్థ నుంచి... అప్పుడప్పుడైనా మేలుకోవడం అవసరం. ఆ తరహా మేలుకొలుపే ‘భిక్షూదయ’. అశాశ్వతంగా ఎన్నున్నా... శాశ్వతమైన ఏమీలేనితనాన్ని అంగీకరించగల సామ ర్థ్యాన్ని సంతరింపజేసే ఇలాంటి కార్యక్రమాల అవసరం ఈ ఆధునిక కాలంలో ఎంతైనా ఉంది.    
 
 - ఎస్.సత్యబాబు
 
 కంటి ఆసుపత్రి నిర్మాణం కోసం...

 జైనగురు శ్రీ గౌతమ్ మునీజీ మహరాజ్, ఆయన శిష్యుడు శ్రీ వైభవ్ మునీజీలు చెన్నై నుంచి ఈ కార్యక్రమం కోసం విచ్చేశారు. దీని ద్వారా సేకరించిన నిధులతో హైదరాబాద్‌లోని బొల్లారం చుట్టుపక్కల ఉన్న నిరుపేదల కోసం అన్ని సదుపాయాలు ఉండేలా అత్యాధునికమైన కంటి ఆసుపత్రిని నిర్మిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
 
 అద్భుతమైన అనుభవం...
 ఒక నియమబద్ధత కలిగిన సన్యాసి జీవితం అత్యంత కఠినమైనది. అయితే ఇది మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని అందించడమే కాక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి చేరువ చేస్తుంది. స్వయంగా సాధు జీవనం ఆస్వాదించడం అనేది నాకు ఒక పూర్తి భిన్నమైన, అద్భుతమైన అనుభవం.
 - మనోజ్ కొఠారి, కొఠారి క్రెడిట్ కార్పొరేషన్
 
 నన్ను నేను తరచి చూసుకునేందుకు...
 నాలో నేను తరచి చూసుకునేందుకు ఈ సాధు జీవితం అరుదైన అవకాశాన్ని అందించింది. ఆధునిక ప్రపంచపు ప్రభావానికి ఎంతగా లోనవుతున్నా... మనల్ని మనం సమీక్షించుకునేందుకు ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ముఖ్యం గా యువతకు ఇటువంటివి చాలా అవసరమని నా అభిప్రాయం.
 - మంగిలాల్ సురానా, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement