అండమాన్ జంతువులకు ఆప్తురాలు... | Andaman and weak animals ... | Sakshi
Sakshi News home page

అండమాన్ జంతువులకు ఆప్తురాలు...

Published Thu, Feb 13 2014 11:42 PM | Last Updated on Fri, Jun 1 2018 9:35 PM

అండమాన్ జంతువులకు ఆప్తురాలు... - Sakshi

అండమాన్ జంతువులకు ఆప్తురాలు...

‘‘ఏయ్ సొనాలీ! ఇటు రా! ఏయ్ చిక్కీ! బుద్ధిగా కూర్చో’’ అంటూ అచ్చం మనుషుల్ని పిలిచినట్టే, బెదిరించినట్టే ఆమె మాట్లాడుతుంటే... ఆశ్చర్యపోతాం. అండమాన్‌లో ఉండే మనుషులకు ఆమె అందరిలో ఒకరు కావచ్చు కాని అక్కడి వన్యప్రాణులకు మాత్రం ఆమె ఒకే ఒక్కరు. ‘‘పదిహేనేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. వీటితో నాకు పెనవేసుకుపోయిన అనుబంధం ఎలాంటిదంటే... వీటి అడుగుల చప్పుడు వినని రోజు నాకు నిద్రకూడా పట్టదు’’ అంటారు అనురాధారావ్.

ఈ మధ్యవయస్కురాలు ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు అక్కడ ఉంటున్నారో తెలిసిన స్థానికులు చాలా తక్కువ. అయితే అండమాన్ దీవులకు వెళ్లే పర్యాటకులు తప్పకుండా చూసి తీరే రోజ్ ఐలాండ్‌లో గైడ్‌గా ఆమె గురించి తెలిసినవారు చాలా ఎక్కువ. ఉద్యోగరీత్యా పర్యాటకులకు గైడ్ అయిన ఆమె స్వచ్ఛందంగా అక్కడి వన్యప్రాణుల ఆలనాపాలనా చూస్తున్నారు.

లేడిపిల్లలు, దీవికి సంబంధించిన చారిత్రక విశేషాలు చెబుతూనే జింకలు, బుల్‌బుల్‌పిట్టలు, కుందేళ్లు, నెమళ్లు...  ఇలా అక్కడ సంచరించే సకల జీవులతోనూ ఆమె హిందీలో సంభాషిస్తారు. విచిత్రమేమిటంటే... జాతులకు అతీతంగా ఆ వన్యప్రాణులు కూడా ఆమె పిలుపులకు అద్భుతంగా స్పందిస్తాయి.

అంతే ఆపేక్షగా ఆమె చెప్పే ఆదేశాల్ని తు.చ తప్పకుండా పాటిస్తాయి. ‘‘మనుషులతో మాట్లాడినట్టే వీటితో మాట్లాడగలను. ఇక్కడికి వచ్చిన పర్యాటకులను అటు వెళ్లకండి... ఇటు వెళ్లకండి అని చెప్పినా వినరేమో గాని ఇవి చక్కగా వింటాయి’’ అంటూ తన ఆప్తుల గురించి వివరిస్తారామె. అవసరం లేకపోయినా తన బాధ్యత కాకపోయినా... ఆ వన్యప్రాణుల జీవనవిధానాన్ని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని  మనకు తెలియజేస్తారామె.

పర్యాటకులు ఏవి పడితే అవి వాటి మీదకు విసరకుండా, వారు ఇవ్వాలనుకున్నవాటిలో బ్రెడ్స్ కొన్నింటికి, పప్పులు వంటివి మరికొన్నింటికి ఇలా విభజించి అవి భుజించేలా చేస్తారామె. కుందేలు పిల్లలనైతే చంటిపిల్లలను దాచుకున్న తల్లిలాగ తన దుస్తుల్లోనే పెట్టుకుని తనతో పాటే తిప్పుతుంటారు. రోజ్‌ఐలాండ్‌కు వెళ్లిన పర్యాటకులకు ఆమె ఓ ప్రాణం ఉన్న కదిలే జ్ఞాపకంగా మిగిలిపోవడానికి ప్రధాన కారణం ఆమె చెప్పే దీవి విశేషాలు కాదు... ఆమె చూపే వన్యప్రాణి ప్రియత్వం.

- ఎస్.సత్యబాబు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement