S.. Satyababu
-
షవర్...బ్యాచిలర్ పార్టీ లాగే
గంటకోసారి ఫోన్ కబుర్లు, నిమిషానికోసారి టెక్స్ట్ మెసేజ్‌లు, రోజుకోసారి ఎఫ్బీ అప్డేట్లూ... ఇలా అనుక్షణం మనతోనే మన కోసమే అన్నట్టున్న మన క్లోజ్ ఫ్రెండ్ మరికొన్ని క్షణాల్లో మరొకరి జీవిత భాగస్వామి. మన కోసం వెచ్చించిన టైమ్ ఇక తన లైఫ్ పార్ట్నర్ కోసం ఖర్చు చేయాలి. మనకు చెప్పిన స్వీట్‌నథింగ్స్ తన మనిషితో పంచుకోవాలి. ఇంత దూరాన్ని భరించాలంటే దానికి ముందు ఎంత దగ్గరితనం అనుభవించాలి? అందుకే మగవాళ్ల కోసం పుట్టుకొచ్చాయి బ్యాచిలర్ పార్టీలు. అదే కోవలో అమ్మాయిలు అమ్మాయిల కోసం పుట్టించిన పార్టీలే ‘బ్రైడల్ షవర్’లు. పెళ్లికూతురు కాబోతున్న అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పేందుకు, బహుమతులు అందించేందుకు పెళ్లి రోజు దాకా ఆగాలా? ఆమెకు ప్రాణంలా మెలిగిన వారు కూడా పెళ్లిరోజునో, రిసెప్షన్ రోజునో వెళ్లి, గుంపులో గోవిందా అన్నట్టు ఓ గిఫ్ట్ప్యాకెట్ చేతిలో పెట్టేసి తిరిగి వచ్చేయాలా? ఠాట్... కుదరదంటే కుదరదనుకుంటున్నారు నవతరం. అందుకే బ్రైడల్ షవర్ పార్టీలకు హుషారుగా పచ్చజెండా ఊపేస్తున్నారు. చారిత్రక మూలాలూ... పెళ్లి పీటలు ఎక్కకుండానే ఏర్పాటు చేసే వేదికే బ్రైడల్ షవర్. చాలా కాలం కిందటే అంటే దాదాపు 1890 ప్రాంతం నుంచే నెదర్లాండ్స్, బెల్జియంలలో దీని ఆనవాళ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా కట్నకానుకల వంటి ఆచారాల సమస్యలను ఎదుర్కోవడానికి వచ్చిందట. పెళ్లి కూతురికి కావల్సినవి అందించలేక తండ్రి చేతులెత్తేసినప్పుడు, లేదా తనకు ఇష్టం లేని వివాహం చేసుకుంటున్న కూతురిని తల్లిదండ్రులు పట్టించుకోనప్పుడు... స్నేహితులే చొరవ తీసుకుని ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించేవారట. పెళ్లి చేసుకుంటున్నవారికి కావల్సిన వస్తువుల్ని, వారి సంసారానికి అవసరమైనవి సేకరించడానికి దీన్ని ఒక మార్గంగా ఆచారంలోకి తెచ్చారట. అదే కోవలో ఇంగ్లండ్‌లో బ్రైడ్ ఏలె పేరుతో కూడా ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించేవారు. పెళ్లికూతురు, ఆమె స్నేహితులు కలిసి బీరు తయారు చేసి దాన్ని విక్రయించేవారట. తద్వారా వచ్చిన డబ్బులతో పెళ్లి ఖర్చులు పెట్టుకునేవారట. ఇది పెళ్లికి ఒక్కరోజు ముందు నిర్వహించేవారట. ఏదైతేనేం... మరింత ఆధునికతను సంతరించుకున్న ఈ సరదా సందడి... ఇటీవలి కాలంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి... సహజంగానే అక్కడ నుంచి మన దేశానికి అలా మన కాస్మొపాలిటన్ సిటీకి కూడా వచ్చేసింది. వెళ్లిరావమ్మా... పెళ్లికూతురా... నగరంలో బ్రైడల్ షవర్లు ప్రారంభమై ఏడాది కావస్తోంది. ఇప్పుడిప్పుడే ఇవి ఊపందుకుంటున్నాయి. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని తెలియగానే... ఆమె స్నేహితులంతా కలిసి చర్చించుకుని ఆ అమ్మాయి కోసం ఒక సర్ప్రైజ్ పార్టీని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీలో ఆడి పాడడం, జ్ఞాపకాలు పంచుకోవడం, బహుమతులు అందించడం వంటివన్నీ సందడిగా సాగిపోతున్నాయి. వేడుక ముగిసే సమయానికి అందరూ కలిసి ఆమెను సాదరంగా సాగనంపడం కూడా. ఈ సందర్భంలో కొన్ని జతల కళ్లు చెమర్చడం వంటి సన్నివేశాలూ ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. నగరంలోని పలు రెస్టారెంట్స్, కాఫీషాప్స్, పబ్స్, క్లబ్స్... వంటివి ఈ తరహా బ్రైడల్ షవర్లకు ప్రస్తుతం వేదికలుగా మారాయి. పలువురు ఈవెంట్ మేనేజర్లు వీటిని నిర్వహించేందుకు ఉత్సుకత చూపుతున్నారు. ప్రస్తుతం ఈ తరహా పార్టీలకు మగవాళ్లను అనుమతించడం కనపడనప్పటికీ భవిష్యత్తులో ఈ నిబంధన మాయమవ్వొచ్చునని భావిస్తున్నారు. ఇటీవలే నగరానికి చెందిన మోడల్ సిపిక ఖండేల్వాల్ స్నేహితులు గత ఏడాదే ఆమె కోసం బ్రైడల్ షవర్ నిర్వహించారు. గ్లామర్ రంగ యువత ద్వారా ఇలాంటి కార్యక్రమాలకు వస్తున్న ప్రచారం మరింతమందికి స్ఫూర్తినిస్తోంది. సో.. బ్యాచిలర్ పార్టీల్లానే నగరం నలుమూలలా బ్రైడల్ షవర్లు కూడా పార్టీ ప్రియుల్ని తడిపి ముద్దచేయడం ఖాయం. ఎస్.సత్యబాబు -
అండమాన్ జంతువులకు ఆప్తురాలు...
‘‘ఏయ్ సొనాలీ! ఇటు రా! ఏయ్ చిక్కీ! బుద్ధిగా కూర్చో’’ అంటూ అచ్చం మనుషుల్ని పిలిచినట్టే, బెదిరించినట్టే ఆమె మాట్లాడుతుంటే... ఆశ్చర్యపోతాం. అండమాన్‌లో ఉండే మనుషులకు ఆమె అందరిలో ఒకరు కావచ్చు కాని అక్కడి వన్యప్రాణులకు మాత్రం ఆమె ఒకే ఒక్కరు. ‘‘పదిహేనేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. వీటితో నాకు పెనవేసుకుపోయిన అనుబంధం ఎలాంటిదంటే... వీటి అడుగుల చప్పుడు వినని రోజు నాకు నిద్రకూడా పట్టదు’’ అంటారు అనురాధారావ్. ఈ మధ్యవయస్కురాలు ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు అక్కడ ఉంటున్నారో తెలిసిన స్థానికులు చాలా తక్కువ. అయితే అండమాన్ దీవులకు వెళ్లే పర్యాటకులు తప్పకుండా చూసి తీరే రోజ్ ఐలాండ్‌లో గైడ్‌గా ఆమె గురించి తెలిసినవారు చాలా ఎక్కువ. ఉద్యోగరీత్యా పర్యాటకులకు గైడ్ అయిన ఆమె స్వచ్ఛందంగా అక్కడి వన్యప్రాణుల ఆలనాపాలనా చూస్తున్నారు. లేడిపిల్లలు, దీవికి సంబంధించిన చారిత్రక విశేషాలు చెబుతూనే జింకలు, బుల్బుల్పిట్టలు, కుందేళ్లు, నెమళ్లు... ఇలా అక్కడ సంచరించే సకల జీవులతోనూ ఆమె హిందీలో సంభాషిస్తారు. విచిత్రమేమిటంటే... జాతులకు అతీతంగా ఆ వన్యప్రాణులు కూడా ఆమె పిలుపులకు అద్భుతంగా స్పందిస్తాయి. అంతే ఆపేక్షగా ఆమె చెప్పే ఆదేశాల్ని తు.చ తప్పకుండా పాటిస్తాయి. ‘‘మనుషులతో మాట్లాడినట్టే వీటితో మాట్లాడగలను. ఇక్కడికి వచ్చిన పర్యాటకులను అటు వెళ్లకండి... ఇటు వెళ్లకండి అని చెప్పినా వినరేమో గాని ఇవి చక్కగా వింటాయి’’ అంటూ తన ఆప్తుల గురించి వివరిస్తారామె. అవసరం లేకపోయినా తన బాధ్యత కాకపోయినా... ఆ వన్యప్రాణుల జీవనవిధానాన్ని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని మనకు తెలియజేస్తారామె. పర్యాటకులు ఏవి పడితే అవి వాటి మీదకు విసరకుండా, వారు ఇవ్వాలనుకున్నవాటిలో బ్రెడ్స్ కొన్నింటికి, పప్పులు వంటివి మరికొన్నింటికి ఇలా విభజించి అవి భుజించేలా చేస్తారామె. కుందేలు పిల్లలనైతే చంటిపిల్లలను దాచుకున్న తల్లిలాగ తన దుస్తుల్లోనే పెట్టుకుని తనతో పాటే తిప్పుతుంటారు. రోజ్ఐలాండ్కు వెళ్లిన పర్యాటకులకు ఆమె ఓ ప్రాణం ఉన్న కదిలే జ్ఞాపకంగా మిగిలిపోవడానికి ప్రధాన కారణం ఆమె చెప్పే దీవి విశేషాలు కాదు... ఆమె చూపే వన్యప్రాణి ప్రియత్వం. - ఎస్.సత్యబాబు -
బిగ్షాట్ల భిక్షాటన!
కోట్ల రూపాయలున్నాయి. కానీ డబ్బులతో అయ్యే పని కాదు! ఏసీ రూములున్నాయి. కానీ చల్లదనంతో తీరే తాపం కాదు! ఖరీదైన కార్లు ఉన్నాయి. కానీ టైర్లు వెళ్లగలిగిన దారి కాదు! సూట్లు, బూట్లు ఉన్నాయి. కానీ ఏవీ సూటయ్యేవి కాదు! దీక్షాదక్షతలున్నాయి. కానీ మాటల వ్యాపారం కాదు! కాదు... కాదు... కాదు... కాదు!! ఇన్ని ఉండి... ఎందుక్కాదు? ఎందుకంటే అది... ‘సాధుజీవితం’! అందుకే వాళ్లు అన్నీ వదులుకున్నారు! ఒక్కరోజైనా ‘సాధు సంపన్నంగా’... ఉండాలనుకున్నారు. నోటికి వస్త్రం కట్టుకుని... మౌనంగా భిక్షాటనకు బయల్దేరారు. చివరికి ఏం సాధించారు? చదవండి... ఈవారం ‘ప్రజాంశం’లో. మడత నలగని సూట్లూ, కాలికి మట్టి అంటనివ్వని కార్లూ, కాస్తయినా చెమటపట్టనివ్వని ఎయిర్కండిషనర్లూ, మెత్తని డబుల్కాట్లూ... ఇన్నిరకాల సౌకర్యాల మధ్య అత్యంత ‘ఖరీదైన’ జీవితం గడిపే ఆ సంపన్నులు...తాము ధనవంతులమని మరిచిపోయారు. ధవళవస్త్రాలు ధరించారు. కార్లు వదిలారు. కాలిబాట పట్టారు. ‘బిజీ’నెస్ వదిలి రోజంతా భిక్షాటన చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే సన్యసించారు. ఈ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఓ పూటంతా మౌనవ్రతం ఉండమంటే ప్రాణం పోయినట్టు ఫీలైపోయేవాళ్లుంటారు. టీవీ చూడకుండా క్షణం గడపలేని వాళ్లు, గంటసేపు సెల్‌ఫోన్ మోగకపోతే గిలగిలలాడేవాళ్లు సగటుమనుషుల్లోనే ఎందరో! అలాంటిది కోట్లరూపాయల వ్యాపారాలు చేసే సంపన్నుల సంగతి ఇక చెప్పేదేముంది... కాలాన్ని కాసుల్తో లెక్కించే ఈ రోజుల్లో... వ్యాపారం నుంచి కాస్త విరామం తీసుకోవడానికే విలవిల్లాడే పరిస్థితుల్లో ఒక బిజినెస్ పర్సన్ రోజంతా అన్నింటికీ దూరంగా గడపడమంటే మాటలు కాదు. అటువంటిది ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా వెయ్యిమంది అదే పనిచేస్తే... కోట్లరూపాయల లావాదేవీలు స్తంభించడం అటుంచి... కార్లు, ఏసీలు ఆఖరికి ఫ్యాన్లూ కూడా లేకుండా ఒక రోజంతా గడపడం, ఏమీ లేనితనాన్ని అనుభవిస్తూ యాచించడం... సాధ్యమేనా? ‘భిక్షూదయ’ దీన్ని సాధ్యం చేసింది. ఏమిటీ ‘భిక్షూదయ’? మన సంప్రదాయంలో సన్యాసులకు, సాధుపుంగవులకు విశిష్ట స్థానం ఉంది. వారి జీవనశైలిని గొప్పగా కీర్తిస్తాం కానీ, అనుసరించలేం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి... కుటుంబాన్ని, సౌకర్యాలను వదిలి పూర్తిగా ఒక సాధువుగా మారలేడు. ఈ నేపథ్యంలో జైన్ కమ్యూనిటీ... ప్రస్తుత జైనుల పండుగ రోజుల్ని పురస్కరించుకుని... ఓ వైవిధ్యభరితమైన ఆలోచన చేసింది. వ్యాపారం, లాభనష్టాలు అంటూ అందులో కూరుకుపోతూ... సాధువులు, సన్యాసులు, ప్రవక్తలు వచ్చినప్పుడు మాత్రం ఇంటికి తీసుకువచ్చి వారిని పూజించి దీవెనలు అందుకోవడంతో సరిపెట్టుకోకుండా... ఒక సాధువు జీవితంలోని నిజమైన అనుభూతిని ఆస్వాదించే అవకాశాన్ని ఆధునికులకు అందించాలని జైన్ సమాజం తలచింది. ఒక్కరోజైనా పూర్తిగా సాధు జీవితాన్ని అనుభవించే అవకాశమది. దానికి పెట్టిన పేరే భిక్షూదయ. క్షణం తీరిక లేకుండా వ్యాపార వ్యవహారాల్లో మునిగితేలే వారిని ఒప్పించి అరుదైన విన్యాసానికి తెరతీసింది భిక్షూదయ. ఈ కార్యక్రమానికి వందమంది వచ్చినా చాలనుకుంటే... అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, వెయ్యిమంది సంపన్నులు సాధువులుగా మారి ఇందులో భాగస్వాములయ్యారు. దీంతో ఒక అద్భుతమైన, అపురూపమైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా అందర్నీ ఆకట్టుకుంది. బొల్లారంలోని సదార్ బజార్, బర్టన్ రోడ్లో ఉన్న శివ్కుశాల్ గార్డెన్‌లోని ఓ ఇల్లు. ఆ ఇంట్లో... కోట్లరూపాయల వ్యాపారం చేసే వ్యాపారులు, పెద్ద పెద్ద కంపెనీల సిఈఓలు, వృత్తి నిపుణులు... అన్నీ త్యజించి (తాత్కాలికంగా) సన్యాసులుగా మారి, ఒకచోటకు చేరారు. ప్రార్థనా మందిరంగా పిలువబడే ఈ భవనంలో అత్యంత నిరాడంబరంగా, ఆధునికతకు ఎటువంటి అవకాశమూ ఉండకూడదని ఎటువంటి విద్యుత్ సౌకర్యాలూ లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలా గడిచింది? ఆ రోజు ప్రార్థన, శాంతి ర్యాలీలతో ప్రారంభమైంది. పాదరక్షలు లేకుండా, చోల్పాట, దుపట్టి అని పిలిచే దుస్తులను ధరించారు. ముహపటి పేరుతో పిలిచే మాస్క్‌లాంటిది నోటికి కట్టుకున్నారు. అనంతరం భిక్షువులుగా మారారు. (ఆ రోజున భిక్షువులు కోరికలతో, ఆకాంక్షలతో ఉన్న అనుబంధాల్ని, హద్దులను తెంచుకునేందుకున్న అడ్డంకుల్ని అధిగమించి ఆత్మకు స్వేచ్ఛను ప్రసాదిస్తారు. మానవులెవరి హానికీ తాము కారణం కాకుండా ఉండడం ఎలాగో నేర్చుకుంటారు. అంతర్గత ఆలోచనల నియంత్రణ సాధించేందుకు అవసరమైన ‘సమైక్య’ పేరిట ధ్యానం, బ్రహ్మచర్యం అలవరచుకుంటారు) అడగడం అలవాటే లేని వీరు... భిక్షాటనకు సైతం వెరవక సమీప ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి యాచించారు. అదీ మౌనవ్రతం పాటిస్తూనే. అలావచ్చిన భిక్ష ‘గోచారి’ని ప్రార్థనామందిరంలో పంచుకున్నారు. ఇందులో ఒక్క మెతుకు కూడా వృథా పోనీయకుండా, తినగా మిగిలిన ఆహారం ఏమైనా ఉంటే... అన్నార్తులకు అందజేశారు. ప్రతిక్రమణ్ (సకల చరాచర జీవుల పాపాలను క్షమించాలని చేసే ప్రార్థన)తో ఈ దీక్ష ముగిసింది. అనంతరం ‘తమ జీవిత కాలంలో భూమి మీద నివసించే ఏ ప్రాణికీ ఎటువంటి హానీ తలపెట్టము’ అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన వెయ్యి భిక్షపాత్రల్ని ఉచితంగా అందించడంతో పాటు వీరందరితో కలిసి ఆధ్యాత్మిక ఆస్వాదన చేయడం ప్రశాంత చిత్తాన్ని అందించిందని, ఇది తనకు అంతర్గతంగా ఎంతో శక్తిని అందించిన భావన కలుగుతోందని, దీని ప్రభావం తనమీద కనీసం మరో ఆరు నెలలైనా బలంగా ఉంటుందని వీరికి అవసరమైన భిక్షాపాత్రల్ని సమకూర్చడమేగాక, ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్న ఆదర్శ్గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కేవల్‌చంద్ రాథోడ్ ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపసంహారం... ఏమీ లేకుండా ఈ లోకంలోకి వచ్చే మనం, ఏమీ లేకుండానే ఇక్కడినుంచి నిష్ర్కమిస్తాం. ఎందరో మనుషులు, ఎన్నెన్నో అనుబంధాలు, ఆశలు, ఆకాంక్షలు, జయాపజయాలు... ఇవన్నీ ఆగమనానికి, నిష్ర్కమణకు మధ్య చోటు చేసుకుంటాయి. ఇదంతా మెలకువ రాగానే మాయమయ్యే కలలాంటిదేనని తెలిసినా అందులోనే కూరుకుపోతాం. నిద్రావస్థ నుంచి... అప్పుడప్పుడైనా మేలుకోవడం అవసరం. ఆ తరహా మేలుకొలుపే ‘భిక్షూదయ’. అశాశ్వతంగా ఎన్నున్నా... శాశ్వతమైన ఏమీలేనితనాన్ని అంగీకరించగల సామ ర్థ్యాన్ని సంతరింపజేసే ఇలాంటి కార్యక్రమాల అవసరం ఈ ఆధునిక కాలంలో ఎంతైనా ఉంది. - ఎస్.సత్యబాబు కంటి ఆసుపత్రి నిర్మాణం కోసం... జైనగురు శ్రీ గౌతమ్ మునీజీ మహరాజ్, ఆయన శిష్యుడు శ్రీ వైభవ్ మునీజీలు చెన్నై నుంచి ఈ కార్యక్రమం కోసం విచ్చేశారు. దీని ద్వారా సేకరించిన నిధులతో హైదరాబాద్‌లోని బొల్లారం చుట్టుపక్కల ఉన్న నిరుపేదల కోసం అన్ని సదుపాయాలు ఉండేలా అత్యాధునికమైన కంటి ఆసుపత్రిని నిర్మిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అద్భుతమైన అనుభవం... ఒక నియమబద్ధత కలిగిన సన్యాసి జీవితం అత్యంత కఠినమైనది. అయితే ఇది మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని అందించడమే కాక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి చేరువ చేస్తుంది. స్వయంగా సాధు జీవనం ఆస్వాదించడం అనేది నాకు ఒక పూర్తి భిన్నమైన, అద్భుతమైన అనుభవం. - మనోజ్ కొఠారి, కొఠారి క్రెడిట్ కార్పొరేషన్ నన్ను నేను తరచి చూసుకునేందుకు... నాలో నేను తరచి చూసుకునేందుకు ఈ సాధు జీవితం అరుదైన అవకాశాన్ని అందించింది. ఆధునిక ప్రపంచపు ప్రభావానికి ఎంతగా లోనవుతున్నా... మనల్ని మనం సమీక్షించుకునేందుకు ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ముఖ్యం గా యువతకు ఇటువంటివి చాలా అవసరమని నా అభిప్రాయం. - మంగిలాల్ సురానా, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ -
ఆరునూరైనా ‘ఆరు’ పలకాల్సిందేనా...
ఉత్తరాదిలో శేఖర్ సుమన్ తొలిసారి తెచ్చిన ట్రెండ్‌ను ఓం శాంతి ఓం అంటూ బాలీవుడ్ బాద్షా సిల్వర్ స్క్రీన్‌పై ‘తెరంగేట్రం చేయించాడు. ఇక అంతే, అప్పటి నుంచి ఇప్పటిదాకా కుర్రకారుని ‘ఆరు’ క్రేజ్ పట్టి కుదిపేస్తోంది. ఇంతింతై, కండలవింతై తెరవేల్పులకే వేల్పుగా మారింది. అలా అలా దేశముదురు సాక్షిగా టాలీవుడ్‌కి వచ్చేసిన ఈ సరికొత్త ‘ప్యాకే’జీకి హీరోలందరూ ‘జీ హుజూర్’ అంటున్నారు. నిన్న నితిన్, సూర్య, సునీల్... నేడు మహేష్‌బాబు... ఇలా హీరోలంతా ‘సిక్స్‌ప్యాక్’ జపం చేస్తూంటే, వారి బాటలో మేముసైతం అంటూ కుర్రాళ్ళంతా వ్యాయామవీరులైపోయారు. నగరాలు పట్టణాలు అని తేడా లేకుండా కళాశాల విద్యార్థులు, మోడల్స్, విభిన్న రంగాలకు చెందిన యువత గ్రీకువీరులకు నకలుగా తయారవ్వాలని కలలు కంటున్నారు. ‘ఆరూ’పం అపురూపం అంటున్నారు. దానికోసం తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సిక్స్‌ప్యాక్ అనేది చూడడానికి అందంగా ఉన్నమాట వాస్తవమే కాని, అందరికీ అందేది కాదని, ఇందుకోసం చాలా వ్యయప్రయాసలు అవసరమని ఫిట్నెస్ నిపుణులు అంటున్నారు. ఈ సిక్సీ లుక్స్ గురించిన విశేషాలు, సూచనలు... ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉండే మజిల్ కండరాలే సిక్స్‌ప్యాక్. అయితే ఫ్యాట్ కారణంగా కవర్ అయిపోయి బయటకి కనపడకుండా పోతాయి. తీవ్రమైన వ్యాయామం, ఫ్యాట్ బర్నింగ్ ద్వారా అవి వెలుగులోకి వస్తాయి. వీటిని సాధించడం మాత్రమే కాదు కాపాడుకోవడం కూడా కష్టమే. కొన్ని రోజులపాటు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే చాలు మాయమైపోతాయి. బాడీ బిల్డర్లకు ఇవి అత్యవ్యవవసరం. పోటీలపుడు మాత్రం వీటిపై శ్రద్ధ వహించి తిరిగి మామూలు సమయాల్లో పట్టించుకోని అనారోగ్యకరధోరణిని చాలామంది బాడీబిల్డర్లు అనుసరిస్తుంటారు. కనీసం 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు వయసు సిక్స్‌ప్యాక్ సాధనకు అనుకూలం. ఆ తర్వాత కూడా సాధించవచ్చు కానీ... మరిన్ని రెట్లు ఎక్కువ కష్టపడాలి. కనీసం 4 నుంచి 8 (ఎయిట్ ప్యాక్) దాకా మజిల్స్‌ను బిల్డప్ చేయవచ్చు. ఇది సాధారణంగా హైట్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని సూచనలు క్రమబద్ధమైన వ్యాయామం తప్పనిసరి. శిక్షకుల పర్యవేక్షణలో చేయాలి. చేసేవిధానంలో లోపాలుంటే మరిన్ని రకాల శారీరకసమస్యలకది దోహదపడుతుంది. బలవర్ధకమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యక్తి దేహం తీరుని బట్టి ఈ కండరాలు వెల్లడవడానికి సమయం తీసుకుంటాయి. ఆత్రపడిపోయి సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వాడడం ప్రమాదకరం. బాగా వ్యాయామం చేసే అలవాటు ఉన్నవాళ్ళు, డైట్ విషయంలో నియంత్రణ పాటించగల్గినవాళ్ళు మాత్రమే ప్రయత్నించవచ్చు. సిక్స్ ప్యాక్ ద్వారా ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఏవీ కలగవని, పైగా దేహాన్ని విపరీతమైన, అలవాటు లేని శ్రమకు గురిచేయడం వల్ల ఇతరత్రా సమస్యలు ఏర్పడవచ్చునని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సిక్స్‌ప్యాక్ సాధనలో ముఖవర్చస్సు దెబ్బతినే ప్రమాదం తప్పనిసరిగా ఉంది. సినిమా నటులు దీనికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి వారి విషయంలో ఇది అంత ప్రభావం చూపకపోవచ్చు. - ఎస్.సత్యబాబు పురుషులే కాదు స్త్రీలూ సాధించవచ్చు... ఫిజిక్‌ని అద్భుతంగా చూపించడంలో సిక్స్ప్యాక్ది ప్రధానపాత్ర. ప్రస్తుత ఆధునిక ఆహారపు అలవాట్ల నేపధ్యంలో ఇది కాస్త కష్టతరమైనదే అయినా అసాధ్యం మాత్రం కాదు. మరో విషయం ఏమిటంటే... సిక్స్‌ప్యాక్ అనేది పురుషుల స్వంతం మాత్రమే అనుకోనక్కర్లేదు. సరైన రీతిలో వ్యాయామాలు చేస్తే మహిళలు కూడా దీనిని స్వంతం చేసుకోవచ్చు. ఇది నిరూపించడానికే నేను సిక్స్‌ప్యాక్ సాధించాను. అయితే నన్ను చూసి మిగిలినవారు ఫాలో కావాలని కాదు. మహిళల్లో ఆరోగ్యస్పౄహ పెంచడానికి మాత్రమే నా ప్రయత్నం. -కిరణ్డెంబ్లా బాగా తినాలి... ఫ్యాట్ పెరగకూడదు... సిక్స్‌ప్యాక్ సాధన కఠినమైన ఆహారనియమాలతో మాత్రమే సాధ్యం. పూర్తిగా నూనె, ఉప్పు, కారం లేని ప్రొటీన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామాలు ఒక ఎత్తయితే ఆహారపు అలవాట్లు మరీ ముఖ్యం. ఆహారం బాగా తీసుకోవాలి. అదే సమయంలో ఫ్యాట్ ఏ మాత్రం పెంచనివి మాత్రమే వినియోగించాలి. వెజిటబుల్స్, పండ్లరసాలు, చికెన్... ఇవన్నీ డైట్లో తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడ ఉన్నా ఆహారవిహారాల్లో మార్పు రాకూడదు. ప్రాంతాలకు అతీతంగా అన్నిచోట్లా ఒకేరకమైన ఆహారపదార్థాలు అందించే ‘సబ్వే’ వంటి బ్రాండెడ్ ఫుడ్‌ని అలవాటు చేసుకోవడం మంచిది. -ఖలీల్, సినీ స్టార్ల ఫిట్నెస్ ట్రైనర్