ఆరునూరైనా ‘ఆరు’ పలకాల్సిందేనా...
ఉత్తరాదిలో శేఖర్ సుమన్ తొలిసారి తెచ్చిన ట్రెండ్‌ను ఓం శాంతి ఓం అంటూ బాలీవుడ్ బాద్‌షా సిల్వర్ స్క్రీన్‌పై ‘తెరంగేట్రం చేయించాడు. ఇక అంతే, అప్పటి నుంచి ఇప్పటిదాకా కుర్రకారుని ‘ఆరు’ క్రేజ్ పట్టి కుదిపేస్తోంది. ఇంతింతై, కండలవింతై తెరవేల్పులకే వేల్పుగా మారింది. అలా అలా దేశముదురు సాక్షిగా టాలీవుడ్‌కి వచ్చేసిన ఈ సరికొత్త ‘ప్యాకే’జీకి హీరోలందరూ ‘జీ హుజూర్’ అంటున్నారు. నిన్న నితిన్, సూర్య, సునీల్... నేడు మహేష్‌బాబు... ఇలా హీరోలంతా ‘సిక్స్‌ప్యాక్’ జపం చేస్తూంటే, వారి బాటలో మేముసైతం అంటూ కుర్రాళ్ళంతా వ్యాయామవీరులైపోయారు. నగరాలు పట్టణాలు అని తేడా లేకుండా కళాశాల విద్యార్థులు, మోడల్స్, విభిన్న రంగాలకు చెందిన యువత గ్రీకువీరులకు నకలుగా తయారవ్వాలని కలలు కంటున్నారు. ‘ఆరూ’పం అపురూపం అంటున్నారు. దానికోసం తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సిక్స్‌ప్యాక్ అనేది చూడడానికి అందంగా ఉన్నమాట వాస్తవమే కాని, అందరికీ అందేది కాదని, ఇందుకోసం చాలా వ్యయప్రయాసలు అవసరమని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ఈ సిక్సీ లుక్స్ గురించిన విశేషాలు, సూచనలు...
ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉండే మజిల్ కండరాలే సిక్స్‌ప్యాక్. అయితే ఫ్యాట్ కారణంగా కవర్ అయిపోయి బయటకి కనపడకుండా పోతాయి. తీవ్రమైన వ్యాయామం, ఫ్యాట్ బర్నింగ్ ద్వారా అవి వెలుగులోకి వస్తాయి.
వీటిని సాధించడం మాత్రమే కాదు కాపాడుకోవడం కూడా కష్టమే. కొన్ని రోజులపాటు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే చాలు మాయమైపోతాయి.
బాడీ బిల్డర్‌లకు ఇవి అత్యవ్యవవసరం. పోటీలపుడు మాత్రం వీటిపై శ్రద్ధ వహించి తిరిగి మామూలు సమయాల్లో పట్టించుకోని అనారోగ్యకరధోరణిని చాలామంది బాడీబిల్డర్‌లు అనుసరిస్తుంటారు.
కనీసం 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు వయసు సిక్స్‌ప్యాక్ సాధనకు అనుకూలం. ఆ తర్వాత కూడా సాధించవచ్చు కానీ... మరిన్ని రెట్లు ఎక్కువ కష్టపడాలి.
కనీసం 4 నుంచి 8 (ఎయిట్ ప్యాక్) దాకా మజిల్స్‌ను బిల్డప్ చేయవచ్చు. ఇది సాధారణంగా హైట్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది.
కొన్ని సూచనలు
క్రమబద్ధమైన వ్యాయామం తప్పనిసరి.
శిక్షకుల పర్యవేక్షణలో చేయాలి. చేసేవిధానంలో లోపాలుంటే మరిన్ని రకాల శారీరకసమస్యలకది దోహదపడుతుంది.
బలవర్ధకమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
వ్యక్తి దేహం తీరుని బట్టి ఈ కండరాలు వెల్లడవడానికి సమయం తీసుకుంటాయి. ఆత్రపడిపోయి సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ వాడడం ప్రమాదకరం.
బాగా వ్యాయామం చేసే అలవాటు ఉన్నవాళ్ళు, డైట్ విషయంలో నియంత్రణ పాటించగల్గినవాళ్ళు మాత్రమే ప్రయత్నించవచ్చు.
సిక్స్ ప్యాక్ ద్వారా ప్రత్యేకంగా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఏవీ కలగవని, పైగా దేహాన్ని విపరీతమైన, అలవాటు లేని శ్రమకు గురిచేయడం వల్ల ఇతరత్రా సమస్యలు ఏర్పడవచ్చునని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిక్స్‌ప్యాక్ సాధనలో ముఖవర్చస్సు దెబ్బతినే ప్రమాదం తప్పనిసరిగా ఉంది. సినిమా నటులు దీనికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి వారి విషయంలో ఇది అంత ప్రభావం చూపకపోవచ్చు.
- ఎస్.సత్యబాబు
పురుషులే కాదు స్త్రీలూ సాధించవచ్చు...
ఫిజిక్‌ని అద్భుతంగా చూపించడంలో సిక్స్‌ప్యాక్‌ది ప్రధానపాత్ర. ప్రస్తుత ఆధునిక ఆహారపు అలవాట్ల నేపధ్యంలో ఇది కాస్త కష్టతరమైనదే అయినా అసాధ్యం మాత్రం కాదు. మరో విషయం ఏమిటంటే... సిక్స్‌ప్యాక్ అనేది పురుషుల స్వంతం మాత్రమే అనుకోనక్కర్లేదు. సరైన రీతిలో వ్యాయామాలు చేస్తే మహిళలు కూడా దీనిని స్వంతం చేసుకోవచ్చు. ఇది నిరూపించడానికే నేను సిక్స్‌ప్యాక్ సాధించాను. అయితే నన్ను చూసి మిగిలినవారు ఫాలో కావాలని కాదు. మహిళల్లో ఆరోగ్యస్పౄహ పెంచడానికి మాత్రమే నా ప్రయత్నం.
-కిరణ్‌డెంబ్లా
బాగా తినాలి... ఫ్యాట్ పెరగకూడదు...
సిక్స్‌ప్యాక్ సాధన కఠినమైన ఆహారనియమాలతో మాత్రమే సాధ్యం. పూర్తిగా నూనె, ఉప్పు, కారం లేని ప్రొటీన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాయామాలు ఒక ఎత్తయితే ఆహారపు అలవాట్లు మరీ ముఖ్యం. ఆహారం బాగా తీసుకోవాలి. అదే సమయంలో ఫ్యాట్ ఏ మాత్రం పెంచనివి మాత్రమే వినియోగించాలి. వెజిటబుల్స్, పండ్లరసాలు, చికెన్... ఇవన్నీ డైట్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడ ఉన్నా ఆహారవిహారాల్లో మార్పు రాకూడదు. ప్రాంతాలకు అతీతంగా అన్నిచోట్లా ఒకేరకమైన ఆహారపదార్థాలు అందించే ‘సబ్‌వే’ వంటి బ్రాండెడ్ ఫుడ్‌ని అలవాటు చేసుకోవడం మంచిది.
-ఖలీల్, సినీ స్టార్ల ఫిట్‌నెస్ ట్రైనర్