మహేశ్ అగర్వాల్‌తో జాగ్రత్తగా ఉండాలి!
పిట్టలకీ, పాములకి మనిషి రక్తం సెట్ కాదు కాబట్టి మనల్ని వదిలేశారు కానీ... లేకుంటే వాటిక్కూడా మనచేత రక్తదానం
చేయించేవారు! అంత ప్రేమ ఆయనకి... మూగజీవులంటే!
పందేల కోసం కోళ్లని, జోస్యాల కోసం చిలకల్ని, పతంగులు ఎగరేసి పక్షుల్నీ...
టార్చర్ పెడుతుంటే ఈ న్యాయవాది అస్సలు సహించలేరు.
ముందు... వాటికి మందు రాస్తారు. తర్వాత... వాటి తరఫున వాదిస్తారు.
ఎనిమిదేళ్లుగా ఆయనకు ఇదే పని. ఇప్పుడూ ఈ పని మీదే సింగపూర్
వెళుతున్నారు. ‘మనుషుల బారి నుంచి మూగప్రాణుల్ని కాపాడ్డం ఎలా?’ అని
ప్రసంగించబోతున్నారు. ఆయన మాటల్ని చెవికెక్కించుకుంటే చాలు...
మానవ కారుణ్యానికి సంకేతాల్లా వన్యప్రాణులు పదికాలాల పాటు హాయిగా జీవిస్తాయి. ఇదే ఈవారం ‘ప్రజాంశం’.
సంక్రాంతి పండగ వస్తోందంటే.. ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటాలు మన కళ్ల ముందుంటాయి. కాని మహేశ్ అగర్వాల్‌కి మాత్రం గాలిపటాలకు ఉపయోగించే మాంజా దారాల మధ్య చిక్కుకున్న పక్షులు కనిపిస్తాయి. గాయాలపాలైన పక్షుల వివరాలు తెలిసిన వెంటనే ఆగమేఘాలమీద వచ్చి వాలిపోయి, వాటికి ప్రథమ చికిత్స చేసి, అవి మళ్లీ గాల్లోకి ఎగిరేవరకూ నిద్రపోడు. అలాగే ఎక్కడైనా పాము ఉందని తెలిసినా వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. బందీలుగా ఉన్న రామచిలుకలు, పాలపిట్టలు, కుందేళ్లు, తాబేళ్లు... వేటి గురించి తెలిసినా మహేశ్ అగర్వాల్ ‘రెస్క్యూ ఆపరేషన్’ మొదలవుతుంది. వాటిని మళ్లీ వాటి వాటి స్థానాలకు చేర్చిన తర్వాత అతని పని పూర్తవుతుంది. పసితనం నుంచే వన్యప్రాణుల్ని ప్రేమించిన మహేశ్ వాటి మనుగడ కోసం కూడా కృషి చేస్తున్నారు.
వన్యప్రాణుల్ని చంపినవారు... పాతికవేలు జరిమానా చెల్లించి, మూడేళ్లు జైలుశిక్ష అనుభవించాలి. అంతేకాదు, వీరికి బెయిల్ కూడా దొరకదు. ఇంత కఠిన చట్టాలున్నా చాలాచోట్ల వీటి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీరు రంగంలోకి దిగకముందు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది... అంటారు మహేశ్ అగర్వాల్. ‘‘పదేళ్లక్రితం మార్కెట్‌లో కూరగాయలతో పాటు కుందేళ్లు, ఉడుములు, పావురాలు, రామచిలుకలు, తాబేళ్లను అమ్మేవారు. మేం కేసులు పెట్టడం మొదలెట్టాక పరిస్థితి మారింది. 2005లో భారత ప్రాణమిత్ర సంఘ్‌లో సభ్యుడిగా చేరాను. అంతకు ముందువరకూ ఒంటరిగానే పనిచేసేవాడిని. ప్రస్తుతం ఈ సంస్థలో 200 మంది వరకూ సభ్యులున్నారు. రాష్ర్టంలోని అన్నిప్రాంతాల్లో మావాళ్లు అందుబాటులో ఉంటారు. వన్యప్రాణికి హాని జరుగుతోందన్న విషయం తెలిసిన నిమిషాల్లోనే, ఎంతటి మారుమూల గ్రామానికైనా మా వాళ్లు అందుబాటులోకి వస్తారు. మా నెట్‌వర్క్ వల్ల ఇప్పటివరకూ 1100 పాముల్ని, 93 పాలపిట్టల్ని, 8000 పావురాల్ని రక్షించాం. వీటితో పాటు వందల సంఖ్యలో రామచిలుకలు, నెమళ్లు, కుందేళ్లు, అడవిపందుల్ని కూడా రక్షించాం. మేం వెళ్లేసరికి వాటిని చంపేసినా, బంధించినా వారిపై కేసుల్ని పెట్టించి శిక్ష పడేవరకూ పోరాడాం’’ అని చెప్పారు మహేశ్ అగర్వాల్.
ఎడ్వకేట్ కమ్ సేవ...
హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మహేశ్‌కి చిన్నప్పటి నుంచీ పక్షులంటే ప్రాణం. ఆ ప్రేమే ఆయనను ఈ సేవాపథంలోకి నడిపించింది. భారత ప్రాణమిత్ర సంఘ్, సహయోగ్ వంటి స్వచ్ఛందసంస్థలలో ఈయన చేస్తున్న సేవల్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. ‘‘వన్యప్రాణులకు హాని కలిగించకూడదన్న విషయం అందరికీ తెలుసు. కాని వాటికి సంబంధించిన చట్టాల గురించి చాలామందికి తెలియదు. ముందుగా అందరికీ అవగాహన రావడం కోసం ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాం. గాలిపటాలకు మాంజా దారం వాడడం వల్ల ఎన్ని పిట్టలకు గాయాలవుతున్నాయో తెలిపేందుకు చాలా స్కూళ్లకు తిరిగి కౌన్సెలింగ్ ఇచ్చాం. ఎక్కడైనా పాము కనిపించినా మాకు వెంటనే ఫోన్‌కాల్ వస్తుంది. మా రెస్క్యూ టీం వాటిని పట్టుకుని, అటవీశాఖ అధికారులు సూచించిన ప్రాంతాలలో విడిచిపెడుతుంది’’ అంటూ ఈ ప్రాణి ప్రేమికుడు చెప్పే మాటలు చాలామందిని ఆలోచింపజేశాయి. ఆ ప్రభావమే కావొచ్చు ఇప్పుడు చాలామంది ఇళ్లలో చిలకల పెంపకం తగ్గిపోయింది.
పాలపిట్ట...రామచిలుక
ఏటా దసరా పండక్కి పాలపిట్టని చూస్తే మంచి జరుగుతుందనే నమ్మకం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఆ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవాలనుకునేవారు అడవిలోని పాలపిట్టల్ని పట్టుకొచ్చి చెట్టుకి కట్టేసి అందరికీ చూపించి డబ్బులు తీసుకుంటున్నారు. ‘‘పాలపిట్ట మన రాష్ట్ర పక్షి. పచ్చని చెట్లమధ్య హాయిగా తిరిగే ఈ పక్షి... మనిషి చేతుల్లో పడిందంటే రోజుల వ్యవధిలోనే చనిపోతుంది. చాలామంది వేటగాళ్లు దసరాపండగ ఒక్కరోజు డబ్బు సంపాదనకోసం వాటిని వాడుకుని పడేస్తున్నారు. అందుకే దసరా వచ్చిందంటే మా టీమ్ చాలా అలర్ట్‌గా ఉంటుంది. వీటితోపాటు రామచిలుకల రెక్కలు కత్తిరించి, కాళ్లకు ఫెవిక్విక్ అంటించి, వాటిని జోస్యం చెప్పడానికి ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించేవారు మన కంటపడుతుంటారు. ఆ సమాచారం మాకు అందగానే, వాళ్లను అరెస్టు చేసేవరకూ వదలం. ప్రమాదంలో ఉన్న వన్యప్రాణుల్ని రక్షించి మా చెంతకు చేర్చినవారికి ట్రావెల్ ఖర్చులు ఇచ్చేస్తాం. అలాగే రెగ్యులర్‌గా ఇలాంటి సమాచారం అందించేవారిని ప్రాణమిత్రలో సభ్యులుగా చేర్చుకుంటాం’’ అని వివరించారు మహేశ్.
కోడిపందేలు... జంతుబలులు...
సంక్రాంతికి గోదావరి జిల్లాలలో జరిగే కోడిపందేల గురించి తెలిసిందే. ఆ జూదగాళ్లపై కేసులు పెట్టాలన్న ఆలోచన ఆచరణలోకి వచ్చేవరకు మహేశ్ అగర్వాల్ నిద్రపోలేదు. ‘‘ఒక పక్క ప్రాణమిత్ర సంఘ్, మరో పక్క సహయోగ్, ఏపి వైల్డ్‌లైఫ్ క్రైమ్ బ్యూరో ఇంకోపక్క... వన్యప్రాణి సంరక్షణ కోసం పూర్తిస్థాయిలో పోరాడుతున్నాయి. అయినా అక్కడక్కడా దారుణాలు జరిగిపోతున్నాయి. వీటి సంగతి ఇలా ఉంటే జాతర పేరుతో చేసే జంతుబలులు మరో వైపు... వరంగల్‌లోని సమ్మక్క సారక్క జాతరలో వందల సంఖ్యలో జంతుబలులు ఉంటాయి. ఒకసారి జాతర సమయంలో మా టీమ్ అక్కడ ఏర్పాటు చేసిన ఓ వినూత్న కార్యక్రమం అందరినీ ఆలోచింపచేసింది. ‘ప్రాణి రక్తం చిందించడం వల్లే దేవుడు కరుణిస్తాడనుకుంటే మేకల్ని, దున్నపోతుల్ని బలి ఇవ్వడం దేనికి? మీరే స్వయంగా రక్తదానం చేస్తే మరింత మంచి ఫలితాలను చూస్తారు’ అని చెప్పి అక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. మా మాటల్ని అర్థం చేసుకున్న కొందరు యువకులు రక్తదానం చేశారు’’ అని చెబుతున్న ఈ న్యాయవాది మాటలు విన్నవారికి వన్యప్రాణులపై తప్పకుండా ప్రేమ పెరుగుతుంది.
సింగపూర్ వేదికగా...
ఈ నెల 13న సింగపూర్‌లో జరగబోయే ‘ఏసియా ఫర్ యానిమల్స్’ కార్యక్రమానికి మన రాష్ర్టంలో మహేశ్ అగర్వాల్‌కు ఆహ్వానం వచ్చింది. ‘‘భవిష్యత్తులో వన్యప్రాణిపై ఎవరి చెయ్యీ పడకుండా ఉండేందుకు మా వంతు కృషి చేస్తాం. మాతో మీరు కూడా చేయి కలిపితే ఆ మూగజీవుల మనుగడకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు... అంటున్న మహేశ్ అగర్వాల్‌తో మనం కూడా చేయి కలిపి, వన్యప్రాణుల సంరక్షణలో పాలుపంచుకుందాం.
- భువనేశ్వరి
రెండు రోజులక్రితం అనంతపురం నుంచి ఎవరో అడవిపందుల్ని పట్టుకుని అమ్ముతున్నట్టు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ కోసం అక్కడ లోకల్‌గా పనిచేసే వారికి మహేశ్ సమాచారం అందించారు. వారు రెస్క్యూ చేసి అడవిపందుల్ని పట్టుకున్నవారిని అరెస్టు చేయించారు. మనిషికి పాతికవేలు చొప్పున ముగ్గురు నిందితులు 75 వేల రూపాయల జరిమానా చెల్లించారు.
కారుణ్యవాది
Published Mon, Jan 6 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement