నిజమైన తపస్వి విద్యాసాగరులు | Sakshi Guest Column On Jain social class And Vidyasagarji | Sakshi
Sakshi News home page

నిజమైన తపస్వి విద్యాసాగరులు

Published Wed, Feb 21 2024 4:57 AM | Last Updated on Wed, Feb 21 2024 4:57 AM

Sakshi Guest Column On Jain social class And Vidyasagarji

సంత్‌ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్‌ జీ మహరాజ్‌: అభివాదం చేస్తున్న నరేంద్ర మోదీ (ఫైల్‌ ఫొటో)

సంత్‌ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్‌ జీ మహరాజ్‌ జీ సమాధిని పొంది మనందరినీ విషాదంలో ముంచెత్తారు. జ్ఞానం, కరుణ, సేవల త్రివేణీ సంగమంగా పూజ్య ఆచార్యులు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన నిజమైన తపస్వి. ఆయన జీవితం భగవాన్‌ మహావీరుని ఆదర్శాలకు ప్రతీక. జైన సామాజిక వర్గంలో ఆయన ఉన్నత స్థానంలో నిలిచినప్పటికీ ఆయన ప్రభావం, పలుకుబడి కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితం కాలేదు. మతాలు, ప్రాంతాలు, సంస్కృతులకు అతీతంగా ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు. ప్రకృతికి నష్టాన్ని తగ్గించే జీవన విధానానికి ఆయన పిలుపునిచ్చారు. నిబద్ధత పునాదులపైనే ఒక బలమైన దేశం నిర్మితమవుతుందని విశ్వసించారు.

లోతైన జ్ఞానం, ఎల్లలెరు గని దయ, మానవాళిని ఉద్ధరించాలన్న అచంచలమైన నిబద్ధతతో ఆచార్య విద్యాసాగర్‌ జీ (10 అక్టోబర్‌ 1946 – 18 ఫిబ్రవరి 2024) జీవితం ఆధ్యాత్మికంగా సుసంపన్నం అయింది. అనేక సందర్భాల్లో ఆయన ఆశీస్సులు అందుకున్న గౌరవం నాకు దక్కింది. అందువలన, నాతో సహా లెక్కలేనన్ని ఆత్మలకు మార్గాన్ని ప్రకాశవంతం చేసిన మార్గదర్శక కాంతిని కోల్పోయినట్లుగా నేను తీవ్రమైన లోటును అనుభవిస్తున్నాను. ఆయన అనురాగం, ఆప్యా యత, ఆశీస్సులు కేవలం సుహృద్భావ సంకేతాలు మాత్రమే కాదు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన అదృష్టవంతులందరి మీదా ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసి, స్ఫూర్తిని కలిగిస్తాయి.

ఆయన జీవితం జైన మత మూల సూత్రాలకు ఉదాహరణగా నిలిచింది. దాని ఆదర్శాలను తన సొంత చర్యలు, బోధనల ద్వారా ప్రతిబింబింప జేశారు. సకల జీవరాశుల పట్ల ఆయనకున్న శ్రద్ధ, జైన మతానికి జీవితం పట్ల ఉన్న అమితమైన గౌరవానికి అద్దం పట్టింది. ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో నిజాయితీకి జైన మతం ఇచ్చిన ప్రాధా న్యాన్ని ప్రతిబింబిస్తూ ఆయన తన జీవితాన్ని గడిపారు. సరళమైన జీవనశైలిని అనుసరించారు. జైనమతం, భగవాన్‌ మహావీరుని జీవితం నుంచి ప్రపంచం ప్రేరణ పొందడానికి ఆయన వంటి మహా నుభావులే కారణం. ఆధ్యాత్మిక జాగృతికి, ముఖ్యంగా యువతలో ఆధ్యాత్మిక జాగృతికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. 

విద్య ఆయన హృదయానికి చాలా దగ్గరైన రంగం. విద్యాధర్‌ (ఆయన చిన్ననాటి పేరు) నుండి విద్యాసాగర్‌ వరకు ఆయన చేసిన ప్రయాణం జ్ఞానాన్ని సంపాదించడం, అందించడంలో లోతైన నిబద్ధతతో సాగింది. న్యాయమైన, జ్ఞానవంతమైన సమాజానికి విద్య మూలస్తంభమని ఆయన ప్రగాఢ విశ్వాసం. వ్యక్తులను శక్తిమంతం చేయడానికీ, లక్ష్యం, సహకారంతో కూడిన జీవితాలను గడపడానికీ వీలు కల్పించే సాధనంగా ఆయన జ్ఞానాన్ని సమర్థించారు. విద్యను వ్యక్తులకు సాధికారత కల్పించి ఒక ప్రయోజనం, సేవాభావంతో జీవితం గడిపేందుకు దోహదపడే సాధనంగా ఆయన భావించారు. వారి బోధనలు స్వీయ అధ్యయనం, స్వీయ అవగాహన ప్రాము ఖ్యతను నిజమైన జ్ఞానానికి మార్గాలుగా నొక్కిచెప్పాయి. జీవితకాల అభ్యాసం, ఆధ్యాత్మిక ఎదుగుదలలో నిమగ్నం కావాలని వారి అనుచరులకు ప్రబోధించాయి.

మన సాంస్కృతిక విలువలతో ముడిపడిన విద్యను మన యువత పొందాలని విద్యాసాగర్‌ జీ ఆకాంక్షించారు. నీటి ఎద్దడి వంటి కీలక సవాళ్లకు పరిష్కారం కనుగొనలేక పోయామనీ, గతం నుంచి నేర్చుకున్న పాఠాలకు దూరంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనీ ఆయన తరచూ చెప్పేవారు. సంపూర్ణ విద్య అనేది నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించేదిగా ఉంటుందని ఆయన విశ్వసించారు. భారతదేశ భాషా వైవిధ్యం పట్ల ఆయన ఎంతో గర్వ పడ్డారు. భారతీయ భాషలను నేర్చుకోవడానికి యువతను ప్రోత్స హించారు. పూజ్య ఆచార్యులు స్వయంగా సంస్కృతం, ప్రాకృతం, హిందీలో విస్తృతంగా రచనలు చేశారు. ఒక సాధువుగా చేరుకున్న శిఖరాలు, భూమిపై ఎంతగా నిలదొక్కుకున్నారు అనేవి ఆయన ప్రతిష్ఠాత్మక రచన ‘మూక్‌మతి’లో స్పష్టంగా కనిపిస్తుంది. తన రచనల ద్వారా అణగారిన వర్గాలకు గళం అందించారు. 

ఆరోగ్య సంరక్షణ రంగంలో కూడా ఆచార్యుల కృషి చిరస్మరణీయం. ముఖ్యంగా నిరుపేదల నివాస ప్రాంతాల్లో ఆయన అనేక ప్రయత్నాల్లో పాలుపంచుకున్నారు. ఆరోగ్య సంరక్షణ పట్ల ఆయన విధానం సంపూర్ణమైనది. శారీరక శ్రేయస్సును ఆధ్యాత్మిక శ్రేయస్సుతో మిళితం చేస్తుంది. తద్వారా వ్యక్తి మొత్తం అవసరాలను తీరుస్తుంది.

విద్యాసాగర్‌ జీ దేశ నిర్మాణం పట్ల చూపిన నిబద్ధత గురించి రాబోయే తరాలు విస్తృతంగా అధ్యయనం చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. పక్షపాత ఆలోచనలకు అతీతంగా జాతీయ ప్రయోజనాలపై దృష్టి సారించాలని ఆయన ప్రజలను ఎల్లప్పుడూ కోరేవారు. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వామ్య వ్యక్తీకరణగా భావించిన ఓటును బలంగా విశ్వసించేవారిలో ఆయన ఒకరు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన రాజకీయాలను సమర్థించారు. విధాన రూపకల్పన ప్రజా సంక్షేమం గురించి ఉండాలి కానీ స్వప్రయోజనాల గురించి కాదనీ అనేవారు.

పౌరులకు తమ పట్ల, తమ కుటుంబాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల ఉండే బాధ్యతల నిబద్ధత పునాదులపైనే ఒక బలమైన దేశం నిర్మితమవుతుందని ఆయన విశ్వసించారు. నిజాయితీ, చిత్త శుద్ధి, స్వావలంబన వంటి సుగుణాలను పెంపొందించుకోవాలని వ్యక్తులను ప్రోత్సహించారు. న్యాయమైన, దయగల, అభివృద్ధి చెందు తున్న సమాజ నిర్మాణానికి అవి అవసరమని భావించారు. మనం వికసిత్‌ భారత్‌ నిర్మాణం కోసం కృషి చేస్తున్నందున విధుల పట్ల ఈ ప్రాధాన్యత చాలా ముఖ్యం.

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ క్షీణత తీవ్రంగా ఉన్న ఈ కాలంలో, పూజ్య ఆచార్యులు ప్రకృతికి నష్టాన్ని తగ్గించే జీవన విధానా నికి పిలుపునిచ్చారు. అదేవిధంగా, మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసా యానికి ఉన్న అత్యంత ముఖ్యమైన పాత్రను ఆయన గుర్తించారు. వ్యవసాయాన్ని ఆధునికంగా, సుస్థిరంగా మార్చాలని నొక్కి చెప్పారు. జైలు ఖైదీల సంస్కరణకు ఆయన చేసిన కృషి కూడా చెప్పుకోదగినది.

వేల సంవత్సరాలుగా మన నేల ఇతరులకు వెలుగులు చూపించి మన సమాజాన్ని బాగు చేసిన మహానుభావులను అందించింది. సాధువులు, సంఘ సంస్కర్తల ఈ మహోన్నత పరంపరలో విద్యా సాగర్‌ జీ మహోన్నత వ్యక్తిగా నిలుస్తారు. ఆయన ఏం చేసినా వర్తమానం కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా చేసేవారు. గత ఏడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌గఢ్‌లో ఉన్న చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించే అవకాశం నాకు లభించింది. అప్పటి సంద ర్శనే ఆయనతో నా చివరి సమావేశం అవుతుందని నాకు తెలియదు. ఆ క్షణాలు చాలా ప్రత్యేకమైనవి.

ఆయన నాతో చాలాసేపు మాట్లాడి, దేశానికి సేవ చేయడంలో నేను చేసిన కృషిని ఆశీర్వదించారు. మన దేశం తీసుకుంటున్న దిశ, ప్రపంచ వేదికపై భారత్‌కు లభిస్తున్న గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తాను చేస్తున్న పని గురించి మాట్లాడేటప్పుడు ఉత్సాహం చూపించారు. అప్పుడూ, ఎప్పుడూ, వారి సున్నితమైన చూపులు, నిర్మలమైన చిరునవ్వు... శాంతి, సేవా భావనను కలిగిస్తాయి. ఆయన ఆశీస్సులు మనసుకు ఓదార్పునిచ్చే ఔషధంలా, మనలోని, చుట్టుపక్కల ఉన్న దైవిక ఉనికిని గుర్తుచేసేలా ఉంటాయి. 

సంత్‌ శిరోమణి ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్‌ జీ మహరాజ్‌ జీ లేని లోటును ఆయన గురించి తెలిసిన వారు, ఆయన బోధనలు,  జీవితం స్పృశించినవారు శూన్యంగా భావిస్తారు. అయితే, ఆయన వల్ల స్ఫూర్తి పొందినవారి హృదయాల్లో వారు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన స్మృత్యర్థం వారు బోధించిన విలువలను పాటించడానికి మేము కట్టుబడి ఉంటాము. ఈ విధంగా, మనం ఒక గొప్ప ఆత్మకు నివాళులు అర్పించడమే కాకుండా, మన దేశం కోసం, ప్రజల కోసం ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాము. 


నరేంద్ర మోదీ

భారత ప్రధాని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement