వైద్యుడిని దేవుడిలా చూస్తుంది సమాజం! సేవలో దేవుణ్ణి చూశారు, దేశాన్ని చూశారు ఈ వైద్యుడు!
ఎంతో పవిత్రమైనదని చెప్పే ఈ వృత్తిని... అంత పవిత్రంగానూ నిర్వర్తించారు ఈ డాక్టర్!!.
‘నీ కోసం చేసుకున్న గొప్ప పని కంటే ఇతరుల కోసం చేసిన మంచి పని ద్వారా కలిగేదే అసలైన ఆనందం’ అంటూ ఎన్‌సిసి నేర్పించిన పాఠాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన ఆచరణశీలి ఈయన.
కార్గిల్‌లో ఈయన చేసిన దేశసేవ మనకు అతిశయం.
మనలాంటి మానవులకు సేవ చేయడం ఈయన ఆశయం.
తాడికొండ గురుకులపాఠశాలలో చదువుకున్న పాఠాలే తన జీవితాన్ని నడిపించాయంటారు డాక్టర్ అశోక్. జీవితంలో అత్యంత ఆనందాన్నిచ్చేది దేశసేవ మాత్రమేనన్న ఈయన నమ్మకాన్ని అధ్యాపక వృత్తిలో ఉన్న అమ్మ సావిత్రి, నాన్న వైపీరావులు ప్రోత్సహించారు. డాక్టర్ అశోక్ 22 ఏళ్లు దేశరక్షణ వ్యవస్థలో పనిచేశారు. జమ్ము-కాశ్మీర్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్... అనేక రాష్ట్రాల్లో దేశ సరిహద్దులో ఉద్యోగం చేసి, చెన్నైలో లెఫ్టినెంట్ కల్నల్‌గా రిటైరయ్యారు. 1985 నుంచి 2007 వరకు సాగిన ఆర్మీ ప్రస్థానంలో కొన్ని సంఘటనలు, ఆర్మీలో జీవితానికి, సాధారణ పౌరుడుగా జీవితానికి మధ్య తేడా ఆయన మాటల్లోనే...
అప్పటి కాశ్మీర్!
‘‘మాది కృష్ణాజిల్లాలోని రేమల్లె గ్రామం. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత 1985లో ఆర్మీలో చేరాను. 1990 నుంచి కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి. నేను పూంచ్ సెక్టార్‌లో పని చేసిన రోజుల్లో ప్రతిరోజూ ఏదో ఒక ఉగ్రదాడి జరిగేది. ఆ ఘాట్‌రోడ్లలో ఏ నిమిషమైనా, ఎక్కడైనా మందుపాతర పేలవచ్చు. వాటికి వెరవకుండా ఉద్యోగం చేయడమే ప్రధానం. సైనికులకు వైద్యం చేయడం మా ఉద్యోగం. యుద్ధం లేనప్పుడు సైనికులు వార్ ఎక్సర్‌సైజ్ చేస్తారు, అందులో గాయపడిన వారికీ వైద్యం అందాలి. కాబట్టి ఆర్మీ డాక్టరు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, స్థానికులకు వైద్యం చేయడం మా విధి కాదు కానీ ఆసక్తి ఉంటే చేయవచ్చు. నా డ్యూటీ పూర్తయిన తర్వాత గ్రామాలకు వెళ్లి వైద్యం చేసేవాడిని. నేను అనస్థీషియాలజిస్ట్‌ని, కానీ ఎంతోమందికి పురుడుపోశాను. ప్రాణాపాయంలో ఉన్న వారికి చికిత్స చేశాను. చేయగలిగినంత చేయాలనే తృష్ణతో చేశాను.
పొరుగుదేశ సైనికుడైనా ప్రాణం పోయాల్సిందే!
మాకు కూడా మిలటరీ ట్రైనింగ్ ఇస్తారు. మిలటరీ వ్యక్తులకు వైద్యం చేయడం విధ్యుక్తధర్మం, స్థానికులకు సేవ చేయడం ద్వారా సైన్యం పట్ల వారిలో విశ్వాసాన్ని పెంచవచ్చు. పొరుగుదేశపు సైనికుడికైనా సరే వైద్యం చేయాల్సిందే... ఇందులో మొదటిది మనిషి ప్రాణం కాపాడడం డాక్టర్ ధర్మం. ప్రాణం కాపాడితే ఆ కృతజ్ఞత వారికి ఉంటుంది. ఆ వ్యక్తితో స్నేహసంబంధాలు పెంచుకుంటూ ఉగ్రవాద కార్యకలాపాల వివరాలు సేకరించవచ్చు. దేశరక్షణలో ఇదో భాగం.
యూనిఫామ్‌కు దూరం!
నా కళ్లు చెమర్చిన రోజది. 2007, డిసెంబర్ 16 వతేదీ వరకు పనిచేశాను, 17న మా పై అధికారి... ‘మీరు రిటైర్ అయ్యారు, ఇక యూనిఫాం ధరించక్కర్లేద’ని చెప్పినప్పుడు కళ్లనీళ్లొచ్చాయి. నేను రిటైర్ కావాలనే నిర్ణయం తీసుకునేటప్పటికి లెఫ్టినెంట్ కల్నల్ నుంచి కల్నల్‌గా ప్రమోషన్‌కు నా పేరు ఖరారైంది. కల్నల్ అయితే వైద్యం చేయడానికి వీలుండదు, కార్యనిర్వహణ విధులకే పరిమితం కావాలి. అదే సమయంలో మా పేరెంట్స్ దూరమయ్యారు. ఆ సమయంలో రక్షణ రంగాన్ని వదులుకున్నాను.
సామాన్య పౌరునిగా...
అదేరోజు తడ చెక్‌పోస్టు దగ్గర అలవాటుగా ఐడీకార్డు చూపించాను. ‘ఇది ఎక్స్‌సర్వీస్‌మన్ కార్డు, రాయితీలు ఉండవు’ అన్నారు. నేను చెల్లించాల్సింది పాతిక రూపాయలే కానీ నేను సాధారణ పౌరుడిని అని తెలియచెప్పిన సంఘటన అది. నిన్నటి వరకు నేను పొందిన గౌరవం నా యూనిఫామ్‌దే తప్ప నాది కాదు. ఇక నాకు నేనుగా నన్నో గౌరవప్రదమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చుకున్నాను. నాలోని ప్రత్యేకతలకు మెరుగుపెట్టాను. పిల్లల్లో, పెద్దవాళ్లలో దేశభక్తిని పెంపొందించే ప్రశ్నోత్తర పోటీలు (క్విజ్) నిర్వహిస్తున్నాను.
లావాదేవీ లేని బంధం!
పేషెంటుకి, డాక్టర్‌కి మధ్య మంచి సంబంధాలు ఉండాలంటే వారి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండకూడదు. నేను రక్షణ వ్యవస్థలో ఉద్యోగానికి వెళ్లడానికి ఇది కూడా ఒక కారణమే. ఆర్మీలో విపరీతమైన ఎండలు, గడ్డకట్టుకుపోయే చలి, ఎప్పుడైనా దాడి జరిగే నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని ఉద్విగ్నత మధ్య జీవిస్తాం. ఎవరికైనా ప్రమాదం అంచుల్లో ఉన్నప్పుడు పక్కవారితో విభేదాలు ఉండవు. ఒకవేళ అప్పటి వరకు ఉన్నా వాటిని ఆ క్షణంలో మరచిపోయి స్నేహితులవుతారు. పండుగలను అందరూ కలిసి చేసుకుంటారు. పుట్టిన రోజులకు ఇరుగుపొరుగు కూడా హడావిడి చేసేవారు. అదే ఇక్కడ పుట్టినరోజు చేసుకుంటే ‘ఇన్నేళ్లు వచ్చాక ఇంకా పుట్టినరోజు చేసుకోవడమేంటి’ అని నవ్వుకుంటారు. మన ఇంట్లో లేనివి వాళ్ల ఇంట్లో ఏమేమి ఉన్నాయో బేరీజు వేసుకుని స్నేహం చేసే వాతావరణం అక్కడ ఉండదు. ‘ఆర్మీలో ఉన్నప్పుడే బాగుంది’ అని నా భార్య విజయలక్ష్మి ఇప్పటికీ అంటోంది. నా పిల్లలు స్నిగ్ధ, స్పందన కూడా అప్పటి జీవితాన్ని ఆనందక్షణాల్లాగా గుర్తు చేసుకుంటుంటారు’’.
డబ్బుసంపాదనలో మునిగిపోతే ఇన్ని ఆనందాలను కోల్పోయేవాడినంటారు డాక్టర్ అశోక్. జ్ఞానాన్ని సంపాదించుకోవడం, దానిని పంచడం ఆయన సిద్ధాంతం.
- వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
అది 2000 సంవత్సరం డిసెంబర్... సురాన్‌కోట్ గ్రామం. అర్ధరాత్రి రెండు గంటలప్పుడు నొప్పులు పడుతోన్న మహిళను మంచం మీద తెచ్చారు. బిడ్డ అడ్డం తిరిగింది. సిజేరియన్ చేస్తే తప్ప తల్లీబిడ్డా బతకరు. మాకు గైనకాలజీ విభాగం ఉండదు. ఆ కేసు తీసుకోవడానికి ఆర్మీ సర్జన్ సుముఖంగా లేరు. ‘నేను అనస్థీషియా నిపుణుడిగా చాలా సిజేరియన్ కేసులు చూశాను. ప్రతి స్టెప్ చెప్తాను చేయండి’ అని భరోసా ఇచ్చాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీశాం. అప్పుడా గ్రామస్థుల సంతోషం అంతా ఇంతా కాదు.
- డాక్టర్ అశోక్,
రక్షణ వ్యవస్థ మాజీ ఉద్యోగి
మానవసేవే...మహాసేవ..!
Published Mon, Dec 9 2013 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement