హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆహారోత్పత్తుల రంగంలో ఉన్న యూఎస్ దిగ్గజం కార్గిల్ తాజాగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని వంట నూనెల శుద్ధి కేంద్రాన్ని కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్ట్ వద్ద ఉన్న ఈ రిఫైనరీని దక్కించుకోవడానికి, అలాగే ఆధునీకరణకు మొత్తం సుమారు రూ.262.5 కోట్లు వెచ్చిస్తున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. 2022 మే నాటికి ఈ ఫెసిలిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని సంస్థ అంచనా వేస్తోంది. తద్వారా దక్షిణాదిన సంస్థ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, కంపెనీ విస్తరణకు దోహదం చేస్తుందని కార్గిల్ వంట నూనెల విభాగం భారత ఎండీ పియూష్ పట్నాయక్ తెలిపారు. 2001లో భారత్‌లో అడుగుపెట్టిన కార్గిల్ ప్రస్తుతం నేచుర్‌ఫ్రెష్, జెమిని, స్వీకార్, లియోనార్డో, సన్‌ఫ్లవర్ వంటి బ్రాండ్లలో వంట నూనెలు, కొవ్వుల వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. దేశీయంగా 10 కోట్ల మందికిపైగా కస్టమర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment