హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు భారత్‌లో 2024 నవంబర్‌లో 15.9 లక్షల టన్నులు నమోదైంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఇది 38.5 శాతం అధికం. ముఖ్యంగా విదేశాల నుంచి ముడి పొద్దుతిరుగుడు నూనె, ముడి సోయాబీన్ నూనెలు భారత్‌కు వెల్లువెత్తడం ఇందుకు కారణం.
సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) ప్రకారం.. 2024–25 నవంబర్–అక్టోబర్ ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరం మొదటి నెలలో వివిధ దేశాల నుంచి భారత్‌కు వెజిటబుల్ ఆయిల్స్ సరఫరా 40 శాతం అధికమై 16,27,642 టన్నులకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం 11,60,590 టన్నులుగా ఉంది. 2023 నవంబర్‌లో నమోదైన 12,498 టన్నులతో పోలిస్తే నాన్ ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి గత నెలలో 37,341 టన్నులకు పెరిగింది. ఆర్‌బీడీ పామోలిన్ 1,71,069 టన్నుల నుంచి 2,84,537 టన్నులకు ఎగసింది. ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ 1,28,707 టన్నుల నుంచి 3,40,660 టన్నులకు చేరింది.
పెరిగిన సాఫ్ట్ ఆయిల్స్..
గత నెలలో భారత్‌కు ముడి సోయాబీన్ ఆయిల్ రాక 1,49,894 టన్నుల నుంచి 4,07,648 ట న్నులకు దూసుకెళ్లింది. విదేశాల నుంచి భారత్‌కు ముడి పామాయిల్ సరఫరా 6,92,423 టన్నుల నుంచి గత నెలలో 5,47,309 టన్నులకు పడిపోయింది. గత నెలలో ముడి, శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతి 8,69,491 టన్నుల నుండి 8,41,993 టన్నులకు వచ్చి చేరింది. విదేశాల నుంచి భారత్‌కు సాఫ్ట్ ఆయిల్ సరఫరా 2023 నవంబర్‌తో పోలిస్తే 2024 నవంబర్‌లో 2,78,601 టన్నుల నుంచి ఏకంగా 7,48,308 టన్నులకు దూసుకెళ్లింది.
పామాయిల్ వాటా 76% నుంచి 53 శాతానికి పడిపోయింది. సాఫ్ట్ ఆయిల్స్ 24 నుంచి 47 శాతానికి పెరిగాయి. ఇండోనేషియా, మలేషియా నుంచి ఆర్‌బీడీ పామోలిన్, ముడి పామాయిల్ ప్రధానంగా సరఫరా అవు తోంది. సోయాబీన్ నూనె ప్రధానంగా అర్జెంటీ నా, బ్రెజిల్, రష్యా నుండి, సన్‌ఫ్లవర్ ఆయిల్ ర ష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా నుండి భారత్‌కు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment