జమ్మూ శివారులో తావి నదిపై ఆర్మీ నిర్మించిన తాత్కాలిక వంతెనపై నుంచి వెళుతున్న ప్రజలు
జమ్మూ: వరదల కారణంగా జమ్మూకాశ్మీర్‌లో వ్యాధుల ముప్పు పొంచిఉంది. యుద్ధప్రాతిపదికన వైద్యసహాయానికి ఏర్పాట్లు చేశారు. వరదనీరు క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికీ వరదనీటిలోనే లక్ష మంది ప్రజలు ఉన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రెండు వేల 500 రోడ్లు, 163 చిన్న వంతెనలు దెబ్బతిన్నాయి. సాయం అందక వరద బాధితులు హెలికాప్టర్లపై రాళ్లదాడులు చేస్తున్నారు. భద్రతలో భాగంగా సిబ్బంది ఆకాశం నుంచే సహాయ సామాగ్రి జారవిడుస్తున్నారు. శాంతి భద్రతల కోసం జమ్మూ నుంచి శ్రీనగర్ మార్గంలోకి రెండు బెటాలియన్ల సాయుధ బలగాలను తరలించారు. కాశ్మీర్‌లో విద్యుత్ వ్యవస్థ 65 శాతం మెరుగుపడింది. సెల్‌ఫోన్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. వరదల కారణంగా 6 వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.
13 టన్నుల మందులు, రోజుకు లక్షా 20వేల మంచినీటి బాటిళ్ల పంపిణీ చేస్తున్నారు. లక్ష క్లోరిన్ టాబ్లెట్లు కూడా సరఫరా చేశారు. హెలికాప్టర్ ద్వారా 22,500 మంది రోగులను తరలించారు. కాశ్మీర్ వరదల ప్రభావం వల్ల మాంసం చవగ్గా లభిస్తోంది. అయితే కూరగాయల ధరలు మాత్రం బాగా పెరిగిపోయాయి. ఉల్లిపాయల కన్నా చికెన్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. కిలో చికెన్ 50 రూపాయలకే ఇస్తున్నారు. వరదల కారణంగా వేల సంఖ్యలో పెళ్లిళ్లు రద్దయ్యాయి.
**