కాశ్మీర్‌లో వర్ష బీభత్సం
శ్రీనగర్/జమ్మూ: గత 50 సంవత్సరాలలో ఎన్నడూ కనీవినీ ఎరుగని వర్షాలు, వరదలతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమైంది. ఈ బీభత్సానికి మరణించిన వారి సంఖ్య 20కి చేరగా, తాజాగా రాజౌరి జిల్లాలో వరదప్రవాహంలో పెళ్లి బృందం బస్సు కొట్టుకుపోయిన దుర్ఘటనలో ఏకంగా 50మంది మరణించినట్టు భావిస్తున్నారు. రాష్ట్రంలో చాలావరకు నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాజౌరి జిల్లాలో ని గంభీర్ నది వరదప్రవాహంలో కొట్టుకుపోయిన బస్పు ప్రమాదంలో ముగ్గురిని మాత్రమే ప్రాణాలతో రక్షించగలిగామని, మిగతావారంతా మరణించి ఉండవచ్చని మంత్రి అబ్దుల్ రహీం రాథర్ చెప్పారు. విద్యాసంస్థలను మూడురోజుల పాటు సెలవులిచ్చారు. కాగా, కాశ్మీర్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.