గోల్డెన్ లెగ్స్! | Golden Legs, Ravi Srivastava, Manish Pandey, Kiran kanojiya | Sakshi
Sakshi News home page

గోల్డెన్ లెగ్స్!

Published Mon, Oct 21 2013 10:58 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Golden Legs, Ravi Srivastava, Manish Pandey, Kiran kanojiya

 పవన్ చల్లా...
 జీవితం సడెన్‌గా బ్రేక్ కొడితే ఒక్కొక్కరూ...
 ఒక్కోలా ఎగిరిపడినవాళ్లు!
 అంత జరిగిందా...
 ఒక్కరి ఆత్మవిశ్వాసమూ చెక్కుచెదర్లేదు!
 ఒంటికాలితోనే లక్ష్యంవైపు అడుగులు వేస్తున్నారు.
 పరుగులు తీస్తున్నారు.
 ఎగిరి దూకుతున్నారు.
 వైకల్యాన్ని ‘గోల్డెన్ లెగ్’ గా బిగించుకుని
 అన్నీ బాగున్న వారికి సైతం
 స్ఫూర్తిగా,ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఏడాదిన్నర క్రితం బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వస్తూ, అనంతపూర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యార రవి శ్రీవాత్సవ. ఆయనది హైదరాబాద్‌లోని నాగోల్. మధ్యవయసులో, సంసారమనే నావను నడిపే సారధిగా ఉన్నప్పుడు ఎదురైన అంగవైకల్యం ఆయనను కొంతకాలం నిశ్చేష్టుడ్ని చేసింది. రవి తండ్రి హార్టీ కల్చరిస్ట్. ఆయన హృద్రోగం కారణంగా రవి, అతని సోదరుడు ఇద్దరూ పన్నెండేళ్ల వయసు నుంచే దినసరి వేతనానికి వెళ్లేవారు. తమ రెక్కల కష్టంతో ఇంటిని నడుపుతూనే, చదువుకునేవారు. తండ్రిని కోల్పోయేనాటికే చెల్లి, సోదరుడు తనూ కాస్త స్థిరపడుతుండగా  ప్రమాదం కారణంగా మోకాలి కింద వరకూ కాలు పోగొట్టుకున్నారు రవి. దాదాపు ఐదు సర్జరీలు, రక రకాల థెరపీలు జరిగాక తేరుకున్నారు. ఇప్పుడు ఆయన వయసు 37 సంవత్సరాలు. భార్య అండతో, వైద్యుల సహకారంతో వైకల్యం లేనివారికన్నా బాగా నడ వడం మాత్రమే కాదు, పరుగు పోటీల్లో సైతం పాల్గొనే స్థాయికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్‌టెల్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. విప్రో 5కెలో కూడా పాల్గొన్నారు. వచ్చే డిసెంబరు 1న చెన్నైలో, 15న ఢిల్లీలో, 25న చత్తీస్‌ఘడ్‌లో జరిగే మారథాన్‌లలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నారు. రోజూ పొద్దున్న మూడు గంటలు, సాయంత్రం రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తున్న రవి తనకు మరిన్ని మారథాన్‌లలో పాల్గొనాలని ఉందని చెప్తున్నారు.
   
విజయవాడలో ఉంటున్న శ్రీనివాసనాయుడిది ఇంకో స్ఫూర్తిగాథ. మొదట అందరూ ఆయన ఉద్యోగం చేయలేడన్నారు. చేశారు. ‘అయ్యో పాపం, పెళ్లి ఎలా అవుతుంది’ అన్నారు. అయ్యింది. అంతమాత్రాన తన ను తాను నిరూపించుకోవడానికి మరేమీ లేదని శ్రీనివాసనాయుడు అనుకోవడం లేదు. ప్రస్తుతం ఎం.కాం. చదువుతున్న 41 ఏళ్ల శ్రీనివాసనాయుడికి పదవ తరగతి చదువుతున్న సమయంలో క్రికెట్‌బాల్  తగిలి  కాలు వాచింది. అది అలా అలా ముదిరి ఆఖరికి మోకాలిపై వరకు కాలిని తొలగించే వరకూ వచ్చింది.  అయితే ఆయన తన దురదృష్టాన్ని నిందించుకుంటూ చక్రాల కుర్చీకి పరిమితం కాలేదు. అలాగే చదువుకుని సెంట్రల్‌గవర్న్‌మెంట్ జాబ్ సాధించారు. పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కన్నారు.  అన్నీ బావున్నవాళ్లు కూడా హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని బండి లాగించేయాలని భావించే మధ్య వయసులో...  తనకెంతో నచ్చిన స్విమ్మింగ్‌ను నేర్చుకోవడంపై దృష్టి పెట్టారు.  విఎంసి స్విమ్మింగ్‌పూల్‌లో జేరి ఈత నేర్చుకున్నారు. అదే సంవత్సరం మిగిలిన సాధారణ వ్యక్తులతో కలిసి మాస్టర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. కన్సొలేషన్ ప్రైజ్ గెలుపొందారు. రిపబ్లిక్‌డే సందర్బంగా కృష్ణానదిలో జరిగిన కృష్ణా రివర్ క్రాస్ ఈవెంట్‌లో అంగవైకల్యం లేని సాధారణ వ్యక్తులతో కలిసి పాల్గొన్నారు. నగదు బహుమతి గెలుచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ట్రైథ్లాన్‌లో పాల్గొని 30 నిమిషాల్లో 750 మీటర్ల ఈతను పూర్తి  చేసి వహ్వా అనిపించారు. తన వయసు దాటిపోయింది కానీ లేకపోతే వికలాంగుల కోసం నిర్వహించే పారా ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పాల్గొనాలని అందనీ శ్రీనివాసనాయుడు అంటున్నారు.
   
హర్యానాలోని ఫరీదాబాద్‌నుంచి కెరీర్‌ను వెదుక్కుంటూ హైదరాబాద్‌కి వచ్చిన కిరణ్ కనోజియా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగిగా చేరి ఒక్కోమెట్టు ఎక్కుతున్న తరుణంలో... నడిచే రైలు నుంచి జారిపడి కాలు విరగ్గొట్టుకున్నారు. ఆ సంఘటన గురించి వివరిస్తూ... తానెంతో ముచ్చటపడి నెల ముందే బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి కొన్న బంగారు నగను బ్యాగ్‌లో భద్రంగా పెట్టుకుని రైల్లో కిటికీ దగ్గర కూర్చున్నానని, ఆ బ్యాగ్‌ను ఇద్దరు వ్యక్తులు లాక్కోని పరిగెత్తుతుంటే వారిని పట్టుకునే ప్రయత్నంలో  కాలు జారి అప్పుడే కదిలిన రైలు కింద పడిపోయానని గుర్తు చేసుకున్నారామె. ఆ సంఘటనలో ఆమె కేవలం బంగారునగను మాత్రమే కాదు అంతుకు మించిన విలువైన అవయవాన్ని కూడా కోల్పోయారు. ‘‘అమ్మానాన్న ఇంటికి తీసుకెళ్లారు. కొన్నినెలలు అక్కడున్నాను. సుధాచంద్రన్ లాంటివాళ్లను జ్ఞాపకం చేసుకున్నాను. పిచ్చి పట్టుదల వచ్చింది. ఇంట్లోవాళ్లు వారిస్తున్నా వినకుండా మళ్లీ హైదరాబాద్ వచ్చాను. మళ్లీ అంతకు ముందు పనిచేసిన కంపెనీకి వెళ్లాను. ఉద్యోగం చేస్తానని చెప్పి ఒప్పించాను. కంపెనీ వాళ్లు కూడా మాన వత్వంతో స్పందించి అంతకుముందు చేసిన ఉద్యోగాన్నే అదే జీతంతో తిరిగి ఇచ్చారు’’ అని చెప్పారు కిరణ్. అలా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇప్పుడామె మారథాన్ రన్నర్‌గా మారారు. అద్భుతమైన భవిష్యత్తువైపు నడవడమే కాదు, ఏకంగా పరుగులు తీస్తున్నారు.
   
‘‘బస్ దిగి, రోడ్డు క్రాస్ చేస్తుంటే లారీ వచ్చి గుద్దేసిందండీ’’  అంటూ కాలికి బ్లేడ్ బిగించుకుంటున్న పవన్‌ని చూసినప్పుడు అంగవైకల్యం ఉందన్న భావనే ఆయనలో కనిపించలేదు. హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటారు పవన్.   ‘‘లోపం అని భావిస్తేనే కదా సమస్య?’’అని ప్రశ్నించే రవి ఆ భావనను అధిగమించడం మాత్రమే కాదు, అంతకు మించిన విజయాలను సాధించే దిశగా దూసుకుపోతున్నారు. కొడుకు పరిస్థితికి తగ్గట్టుగా, కూచుని పని చేసుకునేందుకు వీలు అవుతుందని సినిమా ఎడిటర్‌గా అవ్వమని తండ్రి  ఇచ్చిన సూచనను పాటించిన పవన్ అంతటితో ఆగిపోలేదు. తనను తను నిరూపించుకునేందుకు కఠినమైన క్రీడలవైపు ప్రయాణిస్తున్నాడు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో బ్లేడ్న్న్రర్‌గా ఎవరూ లేరు. అందుకే ఆ క్రీడను నేను ఎంచుకున్నాను’’ అని చెప్పారు పవన్.
   
రెండేళ్లక్రితం భారతదేశం ప్రపంచకప్ సాధించింది. ఆ మ్యాచ్ చూడాలనే ఆదుర్దాతో బయలుదేరిన మనీష్‌పాండే ఒక కాలు పోగొట్టుకున్నాడు. ‘‘ఎప్పుడూ బస్‌లో వెళ్లేవాడ్ని. మ్యాచ్ టైమ్‌కి ఇంటికి చేరుకోవాలని  రెలైక్కా. బాగా రద్దీగా ఉంది. తోపులాటలో కిందపడిపోయా’’నని గుర్తుచేసుకున్నాడీ చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన రాయ్‌పూర్ కుర్రాడు. పైలట్ కావాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న మనీష్ ఆ సంఘటన తర్వాత కొంతకాలం తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యాడు.  ఆ తర్వాత తేరుకుని లక్ష్యాన్ని మార్చుకున్నాడు. అందుకు అనుగుణంగా క్రీడలవైపు లాంగ్‌జంప్ చేశాడు. జాతీయస్థాయి లాంగ్‌జంపింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అంతేకాదు బ్లేడ్న్న్రర్‌గానూ రాణిస్తున్నాడు. పారాఒలింపిక్స్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు.  

 జీవితమనే రహదారిలోని మలుపుల్ని ఏ గూగుల్‌మ్యాప్ కూడా పసిగట్టలేదు. అందుకేనేమో అవి అంత తీవ్రప్రభావాన్ని చూపుతాయి. తమ కాళ్ల మీద తాము నిలబడాలని తపించేవారిని ఆత్మవిశ్వాసం ఉన్నవారంటాం. ఒక కాలు కోల్పోయినా... ఆ ప్రభావాన్ని దరిచేరనీయని ధైర్యం చూపేవారిని ఆకాశమంత ఆత్మవిశ్వాసం ఉన్నవారనాలేమో.
 
 - ఎస్.సత్యబాబు
 
‘‘అంగవికలుర క్రీడల కోసం ప్రత్యేక అకాడమీ రావాల్సిన అవసరం ఉంది’’ అంటు న్నారు ఆదిత్యమెహతా. వైకల్యంపై పైచేయి సాధించిన వారందరినీ సమన్వయపరుస్తూ వస్తున్న ఆదిత్య కూడా అంగవికలురే. గత మే నెల 28 న లండన్‌లో తన ఒంటికాలితోనే దాదాపు 500 కి.మీ ప్రతిష్టాత్మక చాలెంజ్‌ను మూడున్నర రోజుల్లో పూర్తి చేసి అందులో పాల్గొన్న తొలి అంగవికలుడైన సైక్లిస్ట్‌గా ఘనత సాధించారు ఆదిత్యామెహతా. కాలేజీ సరదాలు, కుర్రవయసు హుషారులతో జీవితం పరుగులు తీస్తున్నప్పుడు... బైక్ మీద వెళుతుంటే హైదరాబాద్, బాలానగర్ సమీపంలో ఆదిత్యను ఆరీ్టిసీబస్సు వెనుకనుంచి గుద్దేసింది. కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉండి... అతి కష్టమ్మీద కళ్లు తెరిచి కాళ్లు కదిలించబోతే...  అర్థమైంది.

తనకు ఓ కాలు లేదని, వికలాంగుడిగా మిగిలానని. పిచ్చిగా అరిచాడు. చచ్చిపోవాలనుకున్నాడు. ఒక్కసారిగా ఆలోచనల్లేని అంధకారంలోకి జారిపోయాడు. కొన్ని రోజుల పాటు అయిన వాళ్లంతా ఇచ్చిన మద్దతుతో మెల్లగా మామూలు మనిషయ్యాడు. కృత్రిమకాలు అమర్చుకుని నడవడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రోత్సాహంతో కిలోమీటరు మొదలుకుని 11కి.మీ దాకా నడిచే స్థాయికి చేరాడు. అదే ఊపులో సైకిలెక్కాడు.  హైదరాబాద్‌లో జరిగిన కొన్ని చిన్నచిన్న సైకిల్‌రేస్‌లలో పాల్గొన్నాడు.
 
తిరిగే చక్రం... రికార్డులే గమ్యం...

 వేగంగా 100 కి.మీ (5.5 గంటల్లో) పూర్తి చేసిన అంగవైకల్యం కలిగిన సైక్లిస్ట్‌గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కాడు ఆదిత్య. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు అంటే 540 కి.మీ దూరాన్ని  కేవలం 3 రోజుల్లో  సైకిల్ మీద చేరుకున్నాడు. ఏషియన్ పారా సైకిల్ ఛాంపియన్ షిప్‌లో 2 రజత పతకాలు గెలుచుకున్నాడు. తాజాగా లండన్-ప్యారిస్ సైక్లింగ్ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. మొత్తం మీద గత ఏడాదిన్నరగా తాను సైక్లింగ్ చేసిన దూరాన్ని లెక్కిస్తే దాదాపు 17 వేలకి.మీ వస్తుందని చెప్పాడు ఆదిత్య. ఏ మనిషికైనా ఆలోచనల్లో లోపం లేకపోతే అవయవ లోపం అనేది లోపమే కాదంటాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement