కామాఠి కలువ | Kamathipura girl Shweta Katti life Story | Sakshi
Sakshi News home page

కామాఠి కలువ

Published Fri, Aug 16 2013 12:00 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

కామాఠి కలువ

కామాఠి కలువ

మర్యాదస్తులు తప్పుకుని తిరిగే ‘కామాఠిపురా’ ప్రాంతానికి చరిత్రలోనే తొలిసారిగా గౌరవప్రదమైన గుర్తింపును తెచ్చిపెట్టిన శ్వేతాకట్టి... పడుపువృత్తిలో ఉన్నవారికే కాకుండా, యావత్ మహిళాలోకానికే స్ఫూర్తిదాయకం అనదగిన అడుగు వేసింది. చదువులో అసమానమైన ప్రతిభను కనబరిచి, దాదాపు ముప్పై లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌తో అందివచ్చిన ఆహ్వానంపై ఉన్నత విద్యకోసం ఇటీవలే అమెరికా వెళ్లింది! ఊహ తెలిసిన నాటి నుంచి నిత్యం జుగుప్సాకరమైన పరిస్థితుల మధ్య దుర్భర జీవనం సాగించిన శ్వేత జీవితంలో ఎన్ని మలుపులున్నాయి? మలుపు మలుపులో ఆమె మనోభావాలు ఎలా ఉన్నాయి? ఇదే ఈవారం ‘ప్రజాంశం’...
 
 ‘‘ఏయ్ పిల్లా... వస్తావా?’’... ఏ ఆడపిల్లా వినకూడని మాట ఇది. ఒక ఆడపిల్లని ఏ మగాడూ వేయకూడని ప్రశ్న ఇది. కానీ ఎంతోమంది మగాళ్లు నన్నా ప్రశ్న అడిగారు. పదకొండేళ్ల వయసులో... అరుగుమీద నిలబడి తల దువ్వుకుంటున్నప్పుడు... తొలిసారి విన్నానా ప్రశ్నని! ఏం జవాబివ్వాలో అంతుపట్టలేదు. చేతిలో దువ్వెనను వదిలేసి లోనికి పరుగెత్తుకుపోయాను. అప్పుడు నాకు తెలీదు... ఆ ప్రశ్న నుంచి నేను చాలాసార్లు పారిపోవాల్సి వస్తుందని.
 
 కామాఠిపురా... ఆసియాలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాల్లో రెండోది. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా, బాలీవుడ్ లాంటి ప్రతిష్టాత్మక విషయాలే కాదు... కామాఠిపురా లాంటి కారు చీకటి కమ్మిన ప్రదేశాలూ ఉన్నాయి. నాగరిక జనాలే కాదు... అనాగరికమైన ఆచారాల కారణంగా అట్టడుగుకు కూరుకుపోయిన జీవితాలూ ఉన్నాయి. దానికి నిలువెత్తు నిదర్శనం... మా అమ్మ వందన!
 
 అమ్మది కర్ణాటక. తాతయ్య బ్రోతల్ హౌస్ నడిపేవాడు. తాగి తాగి ఇల్లూ ఒళ్లూ గుల్ల చేసుకున్నాడు. సత్తువ చచ్చిపోయాక బ్రోతల్ హౌస్ చూసుకొమ్మని అమ్మమ్మకు చెప్పాడు. అప్పుడే అమ్మమ్మ ఆలోచనలో పడింది. తమ తర్వాత తన కూతురు మళ్లీ ఇదే పని చేయాలా అని ఆందోళన చెందింది. తన బిడ్డ జీవితం తనలా కాకూడదని, తనకో మంచి జీవితాన్ని ఇవ్వాలనీ అనుకుంది. కానీ, అమ్మ ఆ దిశగా ఆలోచించలేకపోయింది. ప్రేమలో పడింది. అది కూడా... అప్పటికే పెళ్లి కుదిరిన వ్యక్తితో.
 
 అతడెలాగూ తాళి కట్టడు కాబట్ట్టి... పెళ్లి కోసం ఆశపడలేదు అమ్మ. కానీ అతడి ప్రేమకు గుర్తుగా ఒక బిడ్డ కావాలనుకుంది. దాని ఫలితంగా పుట్టినదాన్ని నేను! అతడికి పెళ్లయిపోయింది. అమ్మమ్మ, తాతయ్యలు కూడా పోవడంతో అమ్మ కష్టాల్లో కూరుకుపోయింది. తనకవన్నీ అలవాటైపోయినా, నా కడుపు మాడ్చకూడదని, నాకోసం రాష్ట్రాన్ని దాటి, కామాఠిపురా చేరింది.
   
 జీవితం గురించి చాలామంది రచయితలు, కవులు అందంగా వర్ణిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారయినా కామాఠిపురాను చూసివుంటే వాళ్లలా రాసి ఉండేవారు కాదేమో! ఎందుకంటే, అక్కడ ఉన్నవాళ్లెవరికీ జీవితమే ఉండదు. ఏవేవో కారణాల చేత అక్కడకు వచ్చి, ఆ సాలెగూటి నుంచి బయటపడలేక విలవిల్లాడుతుంటారు. మనసు మొరాయిస్తున్నా పట్టెడన్నం తినాలంటే తనువు తనది కాదనుకోవాలి. మరో మార్గమే లేదు. అందుకే వారి జీవితాల్లో జీవం ఉండదు. అక్కడ పుట్టి పెరిగిన నాలాంటి అమ్మాయిల చెంపల్లో చారలు కట్టిన కన్నీళ్లు తప్ప గులాబీనిగ్గులు ఉండవు. అక్కడి తల్లుల కళ్లల్లో విషాదం తప్ప వెలుగన్నదే కనిపించదు. తాగి తూగి వాగే విటుల అరుపులు, నిస్సహాయ మహిళల ఆక్రందనలు, తల్లుల దారుల్లో నడవడం తప్ప మరో మార్గమే లేదనుకునే ఆడపిల్లలు, పేదరికం... ఇలాంటి భయంకరమైన వాతావరణంలో పెరిగాను నేను. దేవదాసీకి జన్మించిన ఆడపిల్లకి అంతకన్నా గొప్ప బాల్యం దక్కుతుందా?

 సెక్స్‌వర్కర్ల మధ్యే ఉన్నా మా అమ్మ సెక్స్ వర్కర్ కాదు. ముంబై వచ్చాక మరో వ్యక్తికి చేరువయ్యింది. అతనితోనే ఉండిపోయింది. కానీ పాపం... అమ్మకు సుఖమంటే ఏంటో తెలీదు. తాగి వచ్చి తూలనాడే నాన్న మాటల్ని మౌనంగా భరించడమే తనకు తెలుసు. తాగింది దిగేవరకూ చితకబాదుతుంటే చీరకొంగును నోట్లో కుక్కుకుని బాధను అణచుకోవడమే తెలుసు. నేను తనలా కాకుండా కాపాడుకోవడం కోసం రాత్రీపగలూ కష్టపడి పనిచేయడమే తెలుసు. తన అవస్థను, ఆవేదనను చూసి ఎప్పుడూ అనుకునేదాన్ని... ఎందుకీ పిచ్చి అమ్మ ఇవన్నీ భరిస్తోంది, నాన్నను వదిలేసి ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని. కానీ పిచ్చిది అమ్మ కాదు... నేను. మేము ఉంటున్న చోటు నుంచి కదలడం సాధ్యం కాదని, కదిలినా ఆదుకునే నాథుడే ఉండడని నాకు తెలీదు. ఆ నిజం తెలిసి రావడానికి నేను కొన్ని భయంకర అనుభవాలను చవిచూడాల్సి వచ్చింది.
 
 ఊహ తెలిసేనాటికి నాకు నాన్నగా ఉన్న వ్యక్తి... లోకం తెలిసేనాటికి నాన్న కాకుండా పోయాడు. అమ్మ అతడితో ఉండిపోయిందని, అతడు నాకు నాన్నలా వ్యవహరిస్తున్నాడని అర్థమయ్యింది. అప్పుడే తొలిసారి దేవదాసీ అన్న పదానికి నిర్వచనం తెలిసి వచ్చింది. అతడిని నేను నాన్న అనే అనుకున్నాను. అతడి నుండి నాన్న ప్రేమనే కోరుకున్నాను. కానీ అతడు మాత్రం నానుండి వేరేదో కోరుకున్నాడు. క్షోభపెట్టాడు. ‘‘నీ మనసు నీకంటే వికారంగా ఉంది’’... అతడన్న ఆ మాట నా మనసును ఎన్ని ముక్కలు చేసిందో నాకు మాత్రమే తెలుసు. అవును... నేను వికారంగానే ఉన్నాను.
 
 నల్లగానే ఉన్నాను. అందంగా లేను. కానీ అందులో నా తప్పేముంది! నా రూపాన్ని చూసి అంతా నవ్వేవాళ్లే. నల్లపిల్ల, నల్లమొద్దు, నల్లదిమ్మ... ఇవా నా పేర్లు? నల్లగా పుట్టాలని నేను కోరుకున్నానా! నల్లగా ఉన్నంత మాత్రాన నేను మనిషిని కాకుండా పోతానా! ఇంటి దగ్గర, బడిలోను, నా ఈడు పిల్లలంతా నన్ను ‘పేరులో తెలుపు... ఒళ్లంతా నలుపు’ అంటూ అవహేళన చేస్తుంటే ఎంత ఏడ్చానో నాకే తెలుసు. చివరకు తండ్రిలా భావించినవాడు కూడా అదే మాట అన్నాడు. అది కూడా ఎందుకు? అతడి వికారానికి నేను తలవంచనందుకు. ఏం... దేవదాసీ కూతురయితే ఇలాంటి వాటికి తలవంచి తీరాలా? గౌరవంగా బతకాలని అనుకోకూడదా?
   
 ‘‘ఏం చేయాలనుకుంటున్నావ్?’’... మా పక్కింటి ఆంటీ అడిగింది. ‘‘ఏముంది చేయడానికి?’’... లైట్‌గా తేల్చేశాను. ‘‘బాగా చదువుకో’’... చెప్పింది. ‘‘దానివల్ల ఏంటి ఉపయోగం!’’ అన్నాన్నేను. ‘‘అలా అనొద్దు శ్వేతా... చదువు గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తుంది. చదువు లేకపోవడం వల్లే మేమంతా ఇక్కడ మగ్గిపోతున్నాం.
 
 నాలుగక్షరాలు వచ్చివుంటే, మాకీ గతి పట్టేది కాదు’’... ఆమె మాటలు వింటూండిపోయాను నేను. వాళ్ల జీవితాలెలా నలిగిపోతున్నాయో, వారి నిస్సహాయత ఏమిటో బోధపడింది. నిరక్షరాస్యతే వారి నిస్సహాయత. నాకా పరిస్థితి రాకూడదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకుని తీరాలని నిర్ణయించుకున్నాను. నా కోరికను విని అమ్మ కళ్లనీళ్లు పెట్టుకుంది... ఆనందంతో! కామాఠిపురాకు దగ్గరలో ఉన్న ‘అప్నే ఆప్’ అనే బడిలో చేర్పించింది నన్ను. ఆ బడిని క్రాంతి అనే ఎన్జీవో నడుపుతోంది. దాని స్థాపకులు రాబిన్ చౌరాసియా, త్రినా తాలూక్‌దార్. వారి పరిచయం నా జీవితాన్నే మార్చేసింది.
 
 తమ సంస్థ ద్వారా సెక్స్ వర్కర్ల జీవితాలను బాగు చేయడానికి కృషి చేస్తున్నారు రాబిన్, త్రినాలు.  సెక్స్‌వర్కర్లను, వారి పిల్లలను తీసుకెళ్లి, కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. వాళ్లు నా కథ విన్నారు. చదువుకుంటేనే జీవితం ఉంటుంది అన్న నా అభిప్రాయం, పట్టుదల వారికి నచ్చాయి. కామాఠిపురా నుంచి నన్ను బయటకు తీసుకెళ్లారు. చదివించారు. నిర్భయ ఉదంతం జరిగినప్పుడు నేను రాసిన ఓ ఆర్టికల్‌ని, నా ప్రొఫైల్‌తో పాటు విదేశీ యూనివర్శిటీలకు పంపారు. అది చూసి ఇంప్రెస్ అయిన న్యూయార్క్‌లోని బార్డ్ యూనివర్శిటీ నాకు స్కాలర్‌షిప్‌ను మంజూరు చేసింది.
 
 నా జీవితం ఇప్పుడు నేను కోరుకున్నట్టుగా ఉంది. నా చుట్టూ డేగకళ్లు లేవు. అవమానాలు లేవు. అంతా ఆనందమే. కానీ నాలా బయటకు రాలేక పోతున్న వారి సంగతేంటి! వాళ్లకోసం ఏదైనా చేయాలి. గతాన్ని వదిలేసి భవిష్యత్తువైపు కొత్తగా అడుగులు వేయడమెలాగో వాళ్లకు చెప్పాలి. సైకాలజీయే చదవాలనుకోవడానికి కారణమదే. చదువు పూర్తి కాగానే వచ్చి, ఓ కౌన్సెలింగ్ సెంటర్ పెడతాను. ఏ అమ్మాయీ ఆ జీవితం వైపు వెళ్లకుండా చూస్తాను. ఒకవేళ వెళ్లినా బయటకు తీసుకొస్తాను. అంతా నేను అనుకున్నట్టు జరిగితే... నాలా మరికొందరు పట్టుదలగా ప్రయత్నిస్తే... కామాఠిపురాలే ఉండవు. వందనలు, శ్వేతలు కూడా ఉండరు. నా లక్ష్యం అదే!
 
 కూర్పు, కథనం: సమీర నేలపూడి
 
  నా చదువు, జీవితం వారికోసమే!
 సెక్స్ వర్కర్లన్నా, దేవదాసీలన్నా అందరూ చిన్న చూపు చూస్తారు. అది ఎంతమాత్రం సరికాదు. ఎందుకంటే, ఎవరూ కావాలని అలా అవ్వరు. పరిస్థితులు అటువైపు నడిపిస్తాయి. బల వంతంగా అందులోకి తోస్తాయి. వాళ్లూ అందరిలాంటి మనుషులే. వాళ్లకీ అందరు ఆడపిల్లల్లాగా ఆనందంగా బతకాలని ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ మురికికూపంలో దిగాక బయటపడటం తేలిక కాదు. ఒకవేళ బయటపడినా తమను ఎవరు ఆదరిస్తారు, ఎవరు గౌరవిస్తారు అనే సంశయం ఆ దిశగా ఆలోచించనివ్వదు. అందుకే వాళ్లు అందులోనే మగ్గిపోతుంటారు. ఇవన్నీ తెలిశాక నేను వాళ్ల గురించి ఆలోచించకపోతే ఎలా! మా అమ్మను, మా అమ్మలాంటి ఇతర స్త్రీలను, వారి కష్టాలనూ కన్నీళ్లనూ చూసిన తర్వాత కూడా నేను మౌనంగా ఉంటే ఎలా! అందుకే నా చదువు, జీవితం వాళ్ల కోసం, వాళ్ల బాగు కోసమే  అంకితం చేయాలనుకుంటున్నాను.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement