
దేశంలో మూడు విశ్వవిద్యాలయాలకే ఈ గుర్తింపు
దక్షిణాదిలో హెచ్‌సీయూ ఒకదానికే మాత్రమే..
ప్రపంచంలోనే అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఆధునికీకరణకు మరిన్ని నిధులు అవసరం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం 2019లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి (Hyderabad Central University) అత్యుత్తమ హోదాను అందించింది. వర్సిటీకి ‘ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’ (ఐఓఈ) హోదా లభించి అయిదేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి హెచ్‌సీయూ (HCU)లో మౌలిక వసతులు దశల వారీగా మెరుగుపడుతున్నా మరింత ఆధునికీకరించేందుకు మరిన్ని నిధులు మంజూరు చేయాల్సిన ఆవశ్యకతను కేంద్రం గుర్తించాల్సిన అవసరముంది.
దేశంలో మూడు వర్సిటీలకే..
‘ఐఓఈ’ హోదాను దేశంలో మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలకే కేంద్రం గుర్తింపు ఇచ్చింది. వీటిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఉంది. మూడోది 2019లో హెచ్‌సీయూకి కల్పించడం విశేషం. దక్షిణ భారతంలో కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక యూనివర్సిటీగా హెచ్‌సీయూ గుర్తింపు పొందడం గమనార్హం.
టాప్–500లో భాగమే లక్ష్యం..
జాతీయ అవసరాలు, ప్రపంచస్థాయి ప్రమాణాల అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి, విద్యా, ఆర్థిక, పరిపాలనాపరమైన మద్దతు ఇవ్వడమే ‘ఐఓఈ’ లక్ష్యం. ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందడమే ఐఓఈ ధ్యేయంగా సిబ్బంది పని చేస్తున్నారు.
ఇప్పటివరకు రూ.500 కోట్లతో..
మానవ వనరుల అభివృద్ది కేంద్రం, 50 గదుల ప్రత్యేక గెస్ట్ హౌస్, 400 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఒక్కో వసతి గృహం, కొత్త పరిపాలనా భవనం, నాంపల్లిలోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనాన్ని పునరుద్ధరించారు. రూ.60 కోట్లతో అత్యాధునిక స్థాయి ల్యాబ్‌లలో వినియోగించే పరికరాలు అందుబాటులో తెచ్చారు. 250 మందికిపైగా అధ్యాపకుల పరిశోధనలు, వృత్తిపరమైన అభివృద్దికి నిధులను సమకూర్చారు. 1,50,00 ఎస్‌ఎఫ్‌టీతో కూడిన ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, రీసెర్చ్ క్లస్టర్స్, కంప్యూటర్ ట్రైనింగ్ ల్యాబ్‌లు, ఒకొక్కటి 300 మంది కూర్చొనే సౌకర్యం కలిగిన 8 ఆడిటోరియాలను నిర్మించారు. వీటితో పాటు మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు.
చదవండి: జేఈఈ మెయిన్ నిర్వహణలో ఎన్‌టీఏ తీరుపై విమర్శలు
అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం..
హెచ్‌సీయూకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడమే ఐఓఈ లక్ష్యంగా పని చేస్తున్నాం. గత అయిదేళ్లలో ఎన్నో నిర్మాణాలు, శిక్షణలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించాం. ఇప్పటికే కొన్నింటిని అందుబాటులోకి తెచ్చాం. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజేరావు, రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ పర్యవేక్షణలో ఐఓఈ బృందం హెచ్‌సీయూ రూపురేఖలను మార్చనుంది.
– ప్రొఫెసర్ ఘనశ్యామ్‌కృష్ణ, హెచ్‌సీయూ ఐఓఈ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment