చదివింది ఎంటెక్‌... చేసేది చీటింగ్స్‌! | task force team arrested the accused | Sakshi
Sakshi News home page

చదివింది ఎంటెక్‌... చేసేది చీటింగ్స్‌!

Published Tue, Feb 18 2025 9:22 AM | Last Updated on Tue, Feb 18 2025 10:50 AM

 task force team arrested the accused

 మోసాల కోసం ఐటీ కంపెనీనే స్థాపించిన వైనం 

ఉద్యోగాల పేరుతో పలువురికి ఎర 

అడ్వాన్సులు, డిపాజిట్లంటూ భారీగా వసూళ్లు 

నిందితుడిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంటెక్‌ చదివిన ఓ వ్యక్తి కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పని చేసి వాటిలో జరిగే ఎంపిక ప్రక్రియ తెలుసుకున్నాడు. ఆపై తానే సొంతంగా ఓ డమ్మీ కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో ఎర వేశాడు. నిరుద్యోగుల నుంచి అందినకాడికి దండుకుని నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లతో మోసం చేశాడు. ఇతడిపై ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదు కావడంతో సెంట్రల్‌ జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సోమవారం టాస్‌్కఫోర్స్‌ వైవీఎస్‌ సు«దీంద్ర వివరాలు వెల్లడించారు. చింతల్‌ వెంకటేశ్వర నగర్‌కు చెందిన కె.భార్గవ్‌ ఎంటెక్‌ పూర్తి చేసి కొన్ని ఐటీ కంపెనీల్లో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పని చేశాడు. ఇలా ఇతడికి ఆయా కంపెనీల్లో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియపై పూర్తి అవగాహన ఏర్పడింది. దీనిని క్యాష్‌ చేసుకోవాలని భావించిన అతను ఐటీ ఉద్యోగాల పేరుతో మోసాలకు తెరలేపాడు. ఇందులో భాగంగా హైటెక్‌ సిటీ వద్ద ఓ కార్యాలయాన్నీ అద్దెకు తీసుకుని అందులో నియోజీన్‌ సాఫ్ట్‌టెక్‌ పేరుతో కార్పొరేట్‌ లుక్‌తో ఆఫీస్‌ ఏర్పాటు చేశాడు. అందులో కొందరిని ఉద్యోగులుగా నియమించడంతో పాటు ప్రత్యేక వెబ్‌సైట్‌ డిజైన్‌ చేశాడు. తన కార్యాలయం ఫొటోలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచాడు. 

క్లౌడ్‌ సరీ్వసెస్, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్, వెబ్‌ అప్లికేషన్స్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో వివిధ ఉద్యోగాలు ఉన్నట్లు ఆన్‌లైన్‌లోనే ప్రకటన ఇచ్చాడు. జూనియర్‌ డెవలపర్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్స్‌ తదతర ఉద్యోగాలకు ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తామని పేర్కొన్నాడు. కొందరు ఉద్యోగార్థులు ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేసి ఈ కంపెనీ వెబ్‌సైట్, అందులో ఉన్న ఫొటోలు చూసి పెద్ద కంపెనీగా భావించారు. దరఖాస్తు చేసిన వారికి కన్సల్టెంట్స్‌ ద్వారా శిక్షణ కూడా ఇప్పించాడు. ఆపై ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి కొందరు ఎంపికైనట్లు ప్రకటించాడు. వీరికి ఈ–మెయిల్‌ ద్వారా జాబ్‌ ఆఫరింగ్‌ లెటర్లు పంపి... వారి నుంచి అడ్వాన్సులు, డిపాజిట్ల పేరుతో రూ.లక్ష, రూ.2 లక్షలు చొప్పున వసూలు చేశాడు. భారీ మొత్తం దండుకున్న తర్వాత తన కార్యాలయం మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

 ఇతడి చేతిలో మోసపోయిన వారి ఫిర్యాదుతో లాలాగూడ, జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. భార్గవ్‌ ఆచూకీ కనిపెట్టడానికి మధ్య మండల టాస్‌్కఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  రూ.లక్ష నగదు, నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లు, గుర్తింపుకార్డులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని లాలాగూడ పోలీసులకు అప్పగించారు. ఈ మోసాలు చేయడంలో ఇతడికి సహకరించిన వారు మరికొందరు ఉన్నారని గుర్తించిన టాస్‌్కఫోర్స్‌ వారి కోసం గాలిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement