వేస్ట్ వారీయర్స్
ఆదివారం ఉదయం.. మారథాన్‌లో వేల మంది హైదరాబాదీలు పరుగులు తీస్తుంటే.. వారిని అనుసరిస్తూ మీడియా కెమెరాలు, ఉత్సాహపరుస్తూ రోడ్డుకిరువైపులా సిటీజనులు.. అయితే ఈ సందడికి దూరంగా చేతిలో డిస్పోజబుల్ బ్యాగ్స్ పట్టుకుని కొందరు తమ పని చేసుకుపోయారు. 20 చెక్‌పాయింట్ల దగ్గర నుంచుని వీరు చేసిన పని.. ఈ ఈవెంట్ పుట్టించిన కిలోల కొద్దీ వేస్ట్‌ని సేకరించడం, దానిని సమర్థంగా మేనేజ్ చేయడం.. ఇంతకూ వారెవరు? వేస్ట్ వారియర్స్!
-ఎస్.సత్యబాబు
‘గచ్చిబౌలి స్టేడియం చాలా విశాలంగా, అందంగా ఉంది. కానీ ఇక్కడ సరైన వేస్ట్ డిస్పోజబుల్ సిస్టమ్ లేదు. ఈ ప్రాంతంలో కొంతకాలం క్రితం జీహెచ్‌ఎంసీ సిబ్బంది చెత్తను తగలబెట్టడం చూసి షాక్ తిన్నాం. అలాంటి పనులు పర్యావరణానికి చేటు చేస్తాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు జోడి అండర్‌హిల్ అనే బ్రిటిష్ వనిత. ఈ వేస్ట్ వారియర్స్ వ్యవస్థాపకురాలు ఆ మహిళే.
హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొని వేస్ట్ పని పట్టిన వాలంటీర్లకు స్ఫూర్తి ఈమే. 2008 డిసెంబర్‌లో జోడి ఇండియా వచ్చారు. టూరిస్ట్‌గా దేశంలో పర్యటించే సమయంలోనే వేస్టేజ్ సమస్య గుర్తించారు. ఓ ఏడాది తర్వాత రంగంలోకి దిగారు. ధర్మశాలలోని దలైలామా ఇంటిని ఆమె తొలిసారి శుభ్రపరిచారు.
ఈ పనిలో ఓ వందమంది ఆమెకు తోడయ్యారు. పరిశుభ్ర భారత్‌ను తానొక్కదాన్నే కాదు.. ఇంకెందరో కోరుకుంటున్నారని అప్పుడామెకు అర్థమైంది. వెంటనే సేవే లక్ష్యంగా మౌంటైన్ క్లీనర్స్ సంస్థ ప్రారంభించారు. మారుమూల కొండప్రాంతం ట్రిండ్‌లో పని మొదలు పెట్టారు. ప్రస్తుతం అత్యంత శుభ్రమైన పర్వత ప్రాంతంగా ట్రిండ్ మారిందంటే అది జోడి అండ్ కో పుణ్యమే. అలా చెత్త ఏరివేసే ఈ యాక్టివిటీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఇండియాలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ క్లీన్ అండ్ నీట్‌గా మార్చాలన్న వారి సంకల్పంతో 2012లో వేస్ట్ వారియర్స్ అవతరించింది.
సిటీకి పరిచితులే..
ఈ సంస్థకు సిటీలో శాశ్వత సభ్యులున్నారు. 200 మంది విద్యార్థులు మారథాన్ క్లీనింగ్‌లో పాల్గొన్నారు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌మేరీస్, సెయింట్ పీటర్స్, ఎంఎల్‌ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, రూట్స్ బిజినెస్ స్కూల్స్, ఐసీబీఎమ్, ఎన్‌ఐటీహెచ్‌ఎమ్, ఎమ్‌జే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. వంటి విద్యాసంస్థల విద్యార్థులు ఈ పనిలో పాల్గొన్నారు. ‘గతేడాది కూడా మా టీమ్ హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొంది. అప్పుడు సేకరించిన వేస్టేజ్‌లో 98 శాతం ఈ బృందం సమర్థవంతంగా రీసైకిల్ చేసింది. ఈసారి మారథాన్‌లో రన్నర్ల సంఖ్య బాగా పెరిగింది. వేస్టేజ్ కూడా రెట్టింపు పోగైంది. 3 డీసీఎంలు నిండాయ’ని జోడి చెప్పారు. 42 కిలోమీటర్ల మారథాన్ మార్గాన్ని శుభ్రపరచడం అంత సులభమైన విషయం కాదన ్న జోడి.. ఈ పనిలో సిటీ యూత్ సమర్థవంతంగా పనిచేశారన్నారు.
ఆ నమ్మకం ఉంది..
హైదరాబాద్‌లో వేస్ట్ డిస్పోజల్ అనే కాన్సెప్ట్ ఇంకా విస్తరించాల్సి ఉందంటారు బృంద సభ్యురాలు, సిటీవాసి శ్వేత దండపాణి. ‘చాలా మందికి వేస్ట్ డిస్పోజల్ అంటే చెత్త కుప్పలో వేయడం వరకు మాత్రమే తెలుసు. వేస్టేజ్ తగ్గించడం, రీసైకిల్‌పై అవగాహన కల్పిస్తున్నామ’ని తెలిపారు. క్రికెట్ మ్యాచ్‌లు, సన్‌బర్న్ వంటి ఈవెంట్లలో పని చేసిన అనుభవం వేస్ట్ వారియర్స్‌కు ఉంది. పరిశుభ్రమైన హైదరాబాద్‌ను చాలామంది కోరుకుంటున్నారని తెలిపిన జోడి.. వచ్చే ఏడాది మారథాన్ ఈవెంట్‌లో వేస్ట్ మేనేజ్‌మెంట్ మరింత సక్సెస్ అవుతుందంటున్నారు.