ఫ్యామిలీతో రన్‌డి | marathon running events will be held in August month | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీతో రన్‌డి

Published Thu, Jul 24 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

ఫ్యామిలీతో రన్‌డి

ఫ్యామిలీతో రన్‌డి

ఆగస్టు.. మిగిలినవారికి పన్నెండు నెలల్లో మరో నెల కావచ్చు. కానీ సిటీలోని పరుగు వీరులకు మాత్రం ఇది ప్రత్యేకమైన నెల. ప్రపంచవ్యాప్తంగా మారథాన్ ఈవెంట్లు మొదలయ్యేది ఆగస్టు నుంచే. అందుకే, ఇప్పుడు పరుగు వీరులు  పవర్‌‘ఫుల్’గా సమాయత్తమవుతున్నారు. సిటీలోనే కాదు.. దేశ విదేశాల్లో జరిగే మారథాన్‌లలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరి ఉత్సాహానికి నిర్వాహకుల ప్రోత్సాహం కూడా తోడవుతోంది. అందుకే.. మీరే కాదు, ఫ్యామిలీని కూడా తీసుకురండి అంటూ ఆహ్వానం పంపుతున్నారు. దీంతో చాలా ఫ్యామిలీలు కొత్త ట్రెండ్ వైపు పరుగు తీస్తున్నాయి.
 
 మేమిద్దరం.. మాకిద్దరు
 సిటీలో 2011లో జరిగిన మారథాన్‌లో వాలంటీరుగా సేవలందించాం. ఇదే స్ఫూర్తితో చెక్ రిపబ్లిక్‌లో జరిగిన ప్రాగ్ మారథాన్‌లో పిల్లలు మాయ (13), ఆదిత్య (9)తో కలసి పాల్గొని పతకాలు సాధించాం. హిమాలయాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండే సాంగ్లాలో మా పిల్లలు దాదాపు పది కిలోమీటర్ల మేర పరుగు తీశారు. అమెరికాలోని ఇండియానా పోలిస్ హాఫ్ మారథాన్‌లోనూ అందరం పాల్గొన్నాం.
 - విశ్వనాథ్, శ్రీలత
 
పరుగులో అన్నా‘దమ్ము’లు
కేవలం మూడు నెలల ప్రాక్టీసుతోనే హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నాం. తర్వాత ముంబై, పాండిచ్చేరిలోని అరోవిలే, కోయంబత్తూర్ మారథాన్‌లలో పాల్గొన్నాం. దేశంలో అతిపెద్ద మారథాన్‌లో దాదాపు 30 వేల మంది పాల్గొన్నారు. అక్కడ పరుగు తీసే సమయంలో ఒకే బ్రిడ్జి వస్తుంది. హైదరాబాద్‌లోనైతే ఎన్నో బ్రిడ్జిలు, కొండలు, వంపుల మధ్య పరుగు తీయాల్సి ఉంటుంది. అయితే, హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్ దీనిని సమర్థంగా నిర్వహిస్తోంది.
 - నవీన్, జానకీరాం
 
 గ్రీకులు, పర్షియన్ల నడుమ మారథాన్‌లో జరుగుతున్న యుద్ధంలో.. గ్రీకుసేనల విజయవార్తను చేరవేసేందుకు ఒక గ్రీకు దూత మారథాన్ నుంచి ఏథెన్స్‌కు పరుగు పరుగున వచ్చాడు. ‘మనం గెలిచాం’ అని చెబుతూనే అతడు ప్రాణాలు విడిచాడు. అతడి జ్ఞాపకార్థం మారథాన్ ఈవెంట్ సంప్రదాయంగా మారింది. మారథాన్ పరుగు నిర్ణీత దూరం 42.195 కి.మీ. (26 మైళ్ల 218 గజాలు). దీనిని పూర్తి చేసేందుకు కనీసం 4 గంటల నుంచి గరిష్టంగా 6.30 గంటల వ్యవధి నిర్ణయిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 500 మారథాన్‌లు జరుగుతున్నాయి. బోస్టన్, న్యూయార్క్, బెర్లిన్, షికాగో, లండన్, లాస్ ఏంజెలిస్ వంటి నగరాల్లో జరిగే మారథాన్‌లు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. మన దేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏటా మారథాన్‌లు జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రపంచస్థాయిలో టాప్-10 మారథాన్‌లను గుర్తించి, పురస్కారాలు కూడా ఇస్తున్నాయి.
 
 ఏడేళ్ల క్రితం..
 హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నగరంలో ఏడేళ్ల కిందట  మారథాన్‌లకు శ్రీకారం చుట్టింది. ‘అప్పట్లో  పాల్గొన్నవారి సంఖ్య వెయ్యికి లోపే.  ఈ ఏడాది మేం పదివేల మంది దాకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం’ అని సిటీలోని రన్నర్స్ క్లబ్ ప్రతినిధి జై భారతి అంటున్నారు. స్వల్పకాలంలోనే భారత్‌లో రెండో అతి పెద్ద మారథాన్‌గా పేరు సంపాదించింది హైదరాబాద్. సిటీలోనే కాదు, దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడ మారథాన్ ఈవెంట్ జరిగినా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే హాబీగా మారడం విశేషం. అలాగే నిర్వాహకులు కూడా సిటీ ఫ్యామిలీలకు ప్రత్యేక ఆహ్వానాలు కూడా పంపడం సంప్రదాయం.
 
 గిన్నిస్‌బుక్’లోకి దంపతుల రన్...
నా భర్త కృష్ణప్రసాద్, నేను ఇరవైకి పైగా మారథాన్‌లలో పాల్గొని, నగరంలోనే అత్యధిక మారథాన్‌లలో పాల్గొన్న ఘనత దక్కించుకున్నాం. మంచుతో నిండిన ఉత్తర ధ్రువ ప్రాంతంలో నిర్వహించిన మారథాన్‌లోనూ పాల్గొన్నాం. ఏడు నెలల వ్యవధిలోనే ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ మారథాన్‌లలో పాల్గొన్నందుకు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకున్నాం.
 - చిగురుపాటి ఉమ, జూబ్లీహిల్స్
 
 పతకాల కోసమే కాదు.. ఆరోగ్యం కోసం కూడా...
 రెండేళ్ల కిందట హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నాం. అదే స్ఫూర్తితో చెన్నైలో పాల్గొన్నాం. ఆ తర్వాత నాసిక్ మారథాన్‌లో సెకండ్ రన్నర్స్‌గా నిలిచాం. గోవా, ఆరోవెల్లి, ముంబై మారథాన్‌లలోనూ పాల్గొన్నాం. మా అమ్మాయి తాన్యా గోవాలో జరిగిన 10కే రన్‌లో పాల్గొంది. పతకాల కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా మారథాన్‌లో పరుగు తీస్తున్నాం.                               
  - శర్వాణి, శ్యామ్
 - ఎస్.సత్యబాబు/వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement