బక్వా నాచే షురూ కరో | Bokwa Fitness in Hyderabad fitness Carnival | Sakshi
Sakshi News home page

బక్వా నాచే షురూ కరో

Published Mon, Mar 2 2015 12:28 AM | Last Updated on Fri, Sep 7 2018 5:34 PM

బక్వా నాచే షురూ కరో - Sakshi

బక్వా నాచే షురూ కరో

ఫిట్‌నెస్ త్రూ ఫన్.. సిటీలో ఇదీ ట్రెండ్. స్టెప్ ఎరోబిక్స్ నుంచి మొదలుపెట్టి సల్సా, బాల్‌రూమ్ స్టెప్స్, హిప్‌హాప్.. ఇవన్నీ సిటీలో నృత్యాభిలాషుల కన్నా ఆరోగ్యాభిలాషుల కారణంగానే ఆదరణ పొందుతున్నాయనేది నిర్వివాదం. ఇక జుంబా డ్యాన్స్ స్టైల్ అయితే ప్రతి జిమ్, ఫిట్‌నెస్ సెంటర్‌లో తప్పక జత చేయాల్సిన అంశంగా మారిపోయింది. ఇప్పుడు అదే కోవలో వచ్చేస్తోంది బక్వా.  
- ఎస్.సత్యబాబు


నెలన్నర క్రితం హైటెక్ సిటీలో నిర్వహించిన హైదరాబాద్ ఫిట్‌నెస్ కార్నివాల్ ద్వారా సిటీలో అరంగేట్రం చేసింది బక్వా డ్యాన్స్. సదరు ఈవెంట్‌కి మొత్తంగా వచ్చిన స్పందన కన్నా బక్వా యాక్టివిటీకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కొత్త కొత్త ఫిట్‌నెస్ మార్గాలు వెతుక్కునే సిటీజనులు ‘ఏమిటీ బక్వా’ అంటూ ఆరా తీయడం మొదలు పెడితే... అప్పటిదాకా దీనిపై అంతగా అవగాహన పెంచుకోని ట్రైనర్లు.. ఒక్కసారిగా నెట్‌లోకి వెళ్లి బ్లాగులూ, యూ ట్యూబ్ వీడియోలు సెర్చ్ చేసి దీని గురించి ప్రాథమిక పరిజ్ఞానం సంపాదించారు. ప్రస్తుతం సిటీలో జుంబా తదితర డ్యాన్స్ యాక్టివిటీల ద్వారా ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తున్న శిక్షకుల్లో పలువురిని బక్వా బాగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో సిటీలో బక్వా సందడి మొదలుకానుంది.
 
ఆఫ్రికా మూలాలు..
సిటీలో సందడి చేయనున్న బక్వా డ్యాన్స్ మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయి. సౌతాఫ్రికన్ వార్ డ్యాన్స్, క్యాపొయిరా, కిక్ బాక్సింగ్, లైట్ బాక్సింగ్, స్టెప్‌ల కలయిక బక్వా. ఇదొక ఫన్ వర్కవుట్ ప్రోగ్రామ్. లైట్ బాక్సింగ్‌ని సూచించే బీవో, సౌతాఫ్రికన్ వార్‌డ్యాన్స్, ట్రెడిషనల్  క్వైటోను సూచించే కేడబ్ల్యూఏ నుంచి బక్వా పేరు పుట్టింది. అంతర్జాతీయ ఫిట్‌నెస్ ప్రముఖుడు పాల్ మార్వి దీని సృష్టికర్త. ఏడేళ్ల కృషితో దీన్ని లాస్‌ఏంజెల్స్‌లో లాంచ్ చేశాడు. జన్మతః సౌతాఫ్రికాకు చెందిన మార్వి లాస్‌ఏంజెల్స్‌లో లీడింగ్ గ్రూప్ ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్. ఈ బక్వాను తన సొంత క్లాసుల గురించి ప్రత్యేకంగా క్రియేట్ చేసుకున్నాడు. తదనంతర కాలంలో ఇది ప్రపంచమంతా పాకింది.  తైవాన్, జపాన్, అమెరికా. గ్రీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి చోట్ల హెల్త్‌పబ్స్‌లో బక్వా ఇప్పుడు హాట్ వర్కవుట్.
 
విశేషాలెన్నో...
దీనిని నేర్చుకోవడానికి డ్యాన్స్‌లో ప్రాథమిక అంశాలు సైతం తెలియనక్కర్లేదు.  ప్రపంచంలో సైన్ లాంగ్వేజ్ వినియోగించే ఏకైక వర్కవుట్ ఇదే. అలాగే లెటర్స్, నంబర్స్, హ్యాండ్ సిగ్నల్స్, అమెరికన్ సైన్ లాంగ్వేజ్‌లు ఉపయోగించి చేసే వినూత్నమైన పోగ్రామ్ బక్వా.  ఈ యాక్టివిటీలో పాప్, లాటిన్, హౌస్ మ్యూజిక్‌లను బ్యాక్ గ్రౌండ్‌గా వినియోగిస్తారు. ఇందులో పార్టిసిపెంట్స్‌కి తర్వాతి మూవ్‌ని చెప్పడానికి సైన్‌లాంగ్వేజ్‌ని ఉపయోగిస్తాడు ఇన్‌స్ట్రక్టర్. ఈ వర్కవుట్‌లో అందరూ ఒక గ్రూప్‌గా పాల్గొంటారు.

డ్యాన్స్ చేసే సమయంలో అక్షరాలను, అంకెలను పార్టిసిపెంట్స్ తమ పాదాలతో డ్రా (చిత్రణ) చేస్తారు. బక్వా ఎల్, 3, జే, కే ఇంకా డజన్ల కొద్దీ ఇతర బక్వా స్టెప్స్‌ను పాదాలతో డ్రా చేస్తారు. మిగిలిన డ్యాన్స్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్స్ తరహాలో స్టెప్స్ 8 కౌంటింగ్ ఇందులో ఉండదు. అసలు ఇందులో స్టెప్స్ కౌంటింగ్ అవసరమే లేదు. బీట్‌తో పాటు మ్యూజిక్‌ని ఫీలవుతూ కదలడమే. స్టెప్ తెలిస్తే చాలు ఇన్‌స్ట్రక్టర్ అందించే కొరియోగ్రఫీ అవసరం లేకుండానే ఫాలో అయిపోవచ్చు.
 
ఉపయోగాలెన్నో...
అన్ని వయసుల వారికీ తగ్గట్టుగా, అన్ని రకాల ఫిట్‌నెస్ లెవల్స్ ఉన్నవారికీ నప్పేలా డిజైన్ చేసిన డ్యాన్సింగ్ వర్కవుట్ బక్వా.  ఇంటెన్సిటీ ఉన్నవారికీ, కావాలనుకునే వారికీ, లావుగా ఉన్నవారికీ, సన్నగా ఉన్నవారికీ.. ఇలా అందరికీ ఇది ఉపకరిస్తుంది. టోటల్ బాడీ వర్కవుట్‌గా, అత్యధిక కేలరీలను సహజమైన పద్ధతిలో ఖర్చు చేసేదిగా పేరొందింది. అత్యంత సులభంగా అనిపించే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక్క సెషన్‌లో అత్యధికంగా 1,200 కేలరీలు సైతం ఖర్చు చేసే అవకాశం ఉందంటే ఆశ్చర్యమే. ‘జుంబాతో పోల్చి చూస్తే ఇదొక అద్భుతమైన, సమర్థవంతమైన వర్కవుట్. అనూహ్యమైన స్ట్రెస్ బస్టర్. గంటలో 1,000 కేలరీలు ఖర్చు చేయిస్తుంది. జుంబా కూడా ట్రెడిషనల్ 8 కౌంట్ స్టెప్స్‌ను ఫాలో అవుతుంది. అలాగే దీనికన్నా కాస్త స్లో కూడా.

బక్వాకి ఎటువంటి కొరియోగ్రఫీ అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా... ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెటర్స్‌ని, నంబర్స్‌ని మన ఫీట్‌తో డ్రా చేయాలి. ఉదాహరణకు ఎల్, కే, జేలను డ్రా చేయడం లేదా.. మీ దేహాన్ని నంబర్  3 లాగా కదపడం వంటివి. ఈ డ్యాన్స్‌ను అన్ని వయసుల వారూ ఫాలో కావచ్చు’ అని ముంబైకి చెందిన ట్రైనర్ అంచల్ గుప్తా అంటున్నారు. ఇది కేవలం ఒక వర్కవుట్ మాత్రమే కాదని ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ అని కూడా  అంటున్నారు దీని  రూపకర్త మార్వి. మన చుట్టూ ఉన్నవారితో ఎనర్జీనీ, ఎగ్జయిట్‌మెంట్‌నీ సమానంగా పంచుకునే అద్భుతమైన అనుభవం అంటున్నాడు. హైలెవల్ కార్డియో వర్కవుట్ చేశామనే ఫీలింగ్‌నే కలగనీయనంత పూర్తి వినోదం దీని స్పెషాలిటీ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement